పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకే స్త్రీ. ఈ అఖండ ధర్మము లోకంలో ఎక్కడో నెరవేరుతూ ఉంటుంది. రాజకీయంగానో సంతాన వాంఛార్ధమో పురుషుడు ఇరువురు మువ్వురూ స్త్రీలను వాంఛిస్తాడు. నీరస పురుషుల ప్రేమ ఇర్వురూ, మువ్వురూ స్త్రీల పైన ప్రసరిస్తుంది. ఆ పురుషుడు ఉత్తముడు అయితే కావచ్చును.

తన బావగారు తన్ను ప్రేమించాడు. ఇంత చిన్ననాటినుండీ తనబావ తన్ను ప్రేమించినాడు. తాము భార్యాభర్తలవలె మెలగేవారు. తనకు అయిదేడులు, యువరాజుకు ఎనిమిదేడులు. ఇరువురూ విజయపురంలో మహారాణి మాఠరి సారసికాదేవి హర్మ్యాలలో యువరాజు క్రీడామందిరంలో రాణీరాజు ఆట ఆడుకొన్నారు. ఆ ఆటలో దాదులూ పాలుగొన్నారు.

“దేవీ! మన రాజ్యంలో ప్రజలు క్షేమంగా ఉన్నారు” అని తన బావ అన్నారు.

తాను "ప్రభూ! మన ప్రజల క్షేమం మనమే విచారించాలిగదా!” అన్నది.

తన బావ “నువ్వు చాలా అందమైన దానవు దేవీ!” అన్నారు.

“నాధా! మీరు చాలా అందమైనవారు” అని తానన్నది.

తరువాత తనకు పదునాల్గవఏట నవయౌవనము పొడసూపే సమయంలో తన బావగారూ, తాను మహారాణి విహారోద్యానవనంలో కలుసుకొనడం తటస్థించింది. పదునేడేండ్ల యౌవనప్రారంభ దివ్యసౌందర్యస్నాతుడై తన బావవస్తున్నాడు. తన హృదయం ఎన్నిఘటికలో ఆగిపోయినట్లయింది. ప్రేమ ఎంత విచిత్రము, ఎంత బాధాపూర్ణము, ఎంత ఆనందోన్మాదకరము!

తన్ను చూడగానే తన బావ ఒక్క గంతున తన దగ్గరకు వాలినాడు. తనకెంత సిగ్గు వేసింది? ఆ సిగ్గూ స్త్రీల ఆనందంలో భాగం! తనకు ఈడురావడం మేనమామల మహానగరంలో జరిగింది. నెలదినాలు ఉత్సవాలు జరిగినవి. ఆనాటినుంచీ, తనకు ఎవరిని చూడాలన్నా సిగ్గే! తన పినతల్లి కొమరిత రాకుమారి బాపిశ్రీ “అక్కా” అని తన్ను ఒక్కక్షణమూ వదిలి ఉండేది కాదు. తానూ, బాపిశ్రీయూ ఏవో పిచ్చిమాటలు, మధుర రహ్యసాలూ మాట్లాడుకొనేవారు. ఆ రహస్యాలన్నీ తమబావను గురించే. తమ అందాలబావ వీరపురుషుడు. అందంలో ఆ రాకుమారునితో పోలగలిగిన యువకుడేడీ?

అలాంటి సిగ్గుతో నిండి ఉన్న తన్ను తనబావ, తనదైవము, పరుగున వచ్చి కలుసుకున్నప్పుడు మరీ సిగ్గుతో తాను కుంగిపోయింది. ఆ సిగ్గు బావగారికి ఏమి తెలుస్తుంది? వెంటనే అంతమంది దాదులలోనూ తన రెండు చేతులూ పట్టుకొన్నారు ఆయన కళ్ళల్లో ఏదో కాంతి! ఆయనచుట్టూ ఎంతో వెలుగు! -

“నువ్వు ఎంత అందమైనదానవు శాంత?” అన్నాడు బావ.

అంత తీయనిబాధ ప్రేమ! అంత మధురమత్తత ప్రేమ! ప్రేమనిధియై బావ ప్రజ్వరిలు సుందరాకారుడై బావ! ఆనాటి బావ! భట్టిదేవిని వనదేవతగా వరించాడు!


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 6

91

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)