పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండితులు. వారికి జంబూద్వీపంలోని భాషలన్నీ వచ్చును. వారిలో వారు మాట్లాడుకొనే భాష ఇతరదేశాల అపసర్పులకు తెలియదు.

కొంతసేపు వారు ఏమేమో మాట్లాడుకొని, పాలీలో బౌద్ధధర్మ విచారణ ప్రారంభించారు. మొదటి భిక్కు తక్కినవారికి గురువై గంభీర కంఠంలో ఉపదేశం ప్రారంభించాడు. మువ్వురు శిష్యులూ, మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ ఉండడము, ఆచార్యులు దారపు చిక్కు విడదీసినట్లు వారి అనుమానాలు తీర్చడమూ, ఈలా విచారణ జరుగుతూ ఉంటే, అనేకమంది భిక్కులు, సాధారణులు నెమ్మది నెమ్మదిగా సమీపానికి చేరారు. ఆ బౌద్ధాచార్యుల ప్రతిభకు, ఆయన మహాత్మ్యానికి వారు ఆశ్చర్యం చెందుతున్నారు.

(10)

అడవి స్కందవివాఖాయనక బ్రహ్మదత్తప్రభువు పూంగీప్రోలుచేరి అమాత్యులచే ఆహ్వానితుడై కోటలో తన విడిది గృహం చేరినారు.

హారీతసి శాంతశ్రీ రాకుమారి బ్రహ్మదత్తప్రభువు ఎందుకు పూంగీప్రోలు వచ్చినారో వెంటనే గ్రహించుకొన్నది. తన బావగారు వీరపురుషదత్త యువరాజు తన్ను దివ్యప్రేమతో పూజిస్తున్నాడని ఆమెకు బాగా తెలియును. తాను వనదేవతావరణానంతరం కోపంతో ఇంటికివచ్చి, తల్లిదండ్రులను బయలుదేరతీసి పూంగీప్రోలు చేరినప్పటినుంచీ, ఆ యువరాజు అమిత హృదయవేదన అనుభవిస్తున్నాడని శాంతశ్రీ రాకుమారికి తెలుసును. తనకు బావగారు చేసిన అవమాన్నాన్ని ఆమె ఎప్పుడూ మరచిపోలేదు. -

వసంతకాలం వచ్చింది. మన్మథుడూ, రతీదేవీ లేకుండా వసంతోత్సవం జరిగిందనీ, ఉత్సవంలో వసంతుడు హేమంతుడైనాడని పూంగీయ శాంతశ్రీకి తెలిసింది.

తానెంత మూర్ఖురాలు! స్త్రీకి వుండే పౌరుషాలూ, అహంభావాలు, ఓర్వలేని తనమూ ఎవరు వర్ణించగలరు? స్త్రీ హృదయం స్త్రీకే తెలియదు. స్త్రీ మాయ అవడంచేత ప్రకృతి అవడంచేత ఆమెలో ఎన్ని విచిత్రాలు ఉన్నాయో ఎవరికి తెలుసును? ఆమె ప్రేమిస్తున్నాను అని చెప్పినా ప్రియుడు ఒక్కొక్కప్పుడు నమ్మలేడు. ఈ దినం తన సర్వస్వమూ ప్రియుని పాదాలకడ పూజా పుష్పాలు చేసిన యువతియే రేపు ఆ ప్రియుని సర్వస్వమూ తన పాదాలకడ పూజాకుసుమాలయినా ఆ పూవులను నిర్దాక్షిణ్యంగా కాలితో నలిపివేయ గలదు.

పతివ్రతా లక్షణాలు శాంతశ్రీకి పూర్తిగా తెలుసును. ఇక్ష్వాకు వంశాన్ని సీతాదేవి పవిత్రం చేసింది. భర్తమాట వేదవాక్కు. భర్తసేవ, భర్తపూజ, భర్తతో జీవనము, భర్తజీవితం ముగింపుతో తన జీవితమూ ముగింపు.

అవును. అవి మహాపతివ్రతా లక్షణాలు అయిఉండవచ్చును. అట్టి పరమోత్తమస్త్రీ మహాకావ్యనాయిక అవుతుంది. లోకంలో తక్కిన స్త్రీలు శాకినిలో, ఢాకినిలో! శ్రీరాముడూ, పరమ శ్రమణకుడూ వంటి మహాపురుషులు దివ్యులు. తక్కినవారు సామాన్యులే అయినా ఆ మహాపురుషులను వారివారికై ఉద్భవించిన స్త్రీలు ప్రేమించడం మానినారా? వారికి తమ సర్వస్వాలు అర్పించడం మానినారా? ఒకస్త్రీకి ఒకేపురుషుడు, ఒక పురుషునకు

అడివి బాపిరాజు రచనలు - 6

90

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)