పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భరతదేశంలో శాతవాహనుల కాలంలో ముష్టివాళ్ళు ఉండేవారు. ఆ దినాల్లో ముష్టివాళ్ళు ఉండడానికి ముఖ్యమైనవి మూడుకారణాలు. పనిచేయలేని స్థితిలో నా అనేవాళ్ళు లేకపోవడం వల్లా, బద్దకించి పనిచేయక మనుష్యుల ధర్మప్రకృతిపై ఆధారపడి ముష్టి ఎత్తడమే జీవనోపాధిగా చేసుకోవడంవల్లా, ఉంఛవృత్తిపై ఆధారపడి ముష్టి ఎత్తడమే ధర్మంగా స్వీకరించడంవల్లనూ. కాని బద్ధకంచేత ఉంఛవృత్తి నవలంబించినవాళ్ళు శాతవాహన సామ్రాజ్యంలో ధర్మశాస్త్రరీత్యా కఠిన శిక్షలకు పాలయ్యేవారు.

భిక్కులు, కాపాలికలు, భిక్కునిలు, జైనయోగులు, యోగినులు మొదలైనవారు దేశం అంతా తిరుగుతూ ఉంటారు. పంటలు బాగా పండుతూ ఉన్నాయి. కాబట్టి బిచ్చానికేమీ లోటులేదు. దుర్భిక్షము సంభవించి, కాటకము పిశాచనృత్యం చేస్తే, మూడేళ్ళనుండీ కాటకంకోసం నిలవ ఉంచిన ధాన్యపు గాదులలో నుండి ధాన్యాదులు దేశం అంతా ప్రవహిస్తాయి. ప్రతిగ్రామములో ప్రతినగరంలో ఈ కాటకధాన్యపుగాదులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇది భారతీయ ధర్మం.

ఒక దినాన విజయపురంలో నలుగురు భిక్కులు “బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్ఛామి” అంటూ వెడుతున్నారు. ఈ భిక్షావృత్తి వారికా దినానికి సరిపోయేతిండి వచ్చేవరకే. పది ఇళ్ళు తిరిగేసరికి వారి జోలెలు నిండాయి. అంతటితో వారు భిచ్చ మెత్తడం మాని మహాసంఘారామానికి చేరారు. ఎక్కడి బౌద్ధభిక్షువులు వచ్చినా, వారే సంప్రదాయానికి చెందినా మహాసంఘారామం చేరుతారు. అక్కడ అన్ని సంప్రదాయాలవారికి వివిధ విహారగృహాలు ఉన్నాయి. ఈ నలుగురు భిక్షుకులు మహాచైత్యవాదులు. తాము భిక్షునడిగి తెచ్చుకొన్న అన్నము, కూరలు, పప్పు భోజనంచేసి, ఒక తల్లి ఇచ్చిన మజ్జిగత్రాగి, ఒక చోట కూరుచున్నారు.

మొదటిభిక్కు: మహారాజకుమారి భవనానికి బిక్షకు వెళ్ళినా ఆమె కనబడలేదు. ఏమిటి ఉపాయం ?

రెండవభిక్కు: మనం ఆ బాలికను చూచితీరాలి ఆరునూరయినా.

మూడవభిక్కు: నేను బొమ్మవేసి తీరాలి.

నాలుగవభిక్కు: లేకపోతే మన అపసర్పత గంగకలిసినట్లే!

మొదటి: మనం నివేదించినమీదట కదా మహారాజుగారి ఈ నగరం నాగార్జునదేవుని దర్శించడానికి వస్తామన్నారు.

మూడవ: ఈ బాలిక అందం అంత లోక ప్రఖ్యాతి పొందిందా?

నాల్గవ: ప్రఖ్యాతా! గాంధారరాజు ఈ బాలికను ఆశిస్తున్నాడంటే, మన మగధమహారాజు ఒక లెక్కా?

మొదటి: ఇంతకూ మనం ఆ రాజకుమారిని చూడడం ఏలాగు?

రెండవ: నిదానంగా, నెమ్మదిగా ఆలోచించాలికదా? -

ఆ నలుగురు ఆరితేరిన అపసర్పులు. ఏ వేషమైనా చక్కగా వేసుకోగలరు, వేషం తొందరలో మార్చగలరు. వేసుకొన్న వేషానికి తగిన కార్యకలాపంలో వారు ఉద్దండ

అడివి బాపిరాజు రచనలు - 6

89

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)