పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నంది: ఆమె అపురూపు సౌందర్యంచే మహారాజు కన్నులు మిరుమిట్లుగొని ఇతరమును చూడలేక పోయినవి. నిజానికి ఆ కన్య అతిలోక సౌందర్యవతే. వైకుంఠలో భక్తులు నివేదించే వంటకాలకన్న రుచియైన అందం ఆమెది. కాని ఆ వంటకంలో అమృతమూలేదు, కామ దేనువు వెన్నా లేదు, పాలసముద్రంలో పాలూ లేవు, మందారంలోని మకరందమూ లేదు.

పుల: వెఱ్ఱిదికాదు. సర్వశాస్త్రపారంగత!

నంది: బుద్దభక్తి ఉన్నది. తండ్రిమాటకు జవదాటదు.

పుల: ఇంతకూ ఆ బాలిక ఎలాంటి దంటావు?

నంది: పాలులేని పాలసముద్ర మంటాను.

పుల: వెన్నెలలేని పూర్ణచంద్రుడు.

నంది: వాసనలేని పారిజాతం.

పుల: ఆవిడ ఓ విగ్రహమా?

నంది: తారుణ్యం, లావణ్యం, యవ్వనం, సౌందర్యం అన్నీ ఉన్నాయి.

పుల: అయితే మనం దేవేంద్రుని ఉపాయమే పూనుదాము. మంచి ముహూర్తం చూడు!

3

క్ష్వాకు శాంతిశ్రీకుమారి, అప్పుడు బ్రహ్మదత్తుడు తన్ను రతీదేవిగా ఎన్నుకోగానే ఎంతో ఆవేదనకు లోనయింది. ఆమె అట్టి అవస్థనే ఇదివరకు ఎరగదు. హృదయంలో ఉప్పొంగు, మనస్సుకు మంట ఆమె ఎరగదు. అర్థం కాని ఒక ప్రళయగర్జన విన్న కురంగశాంబకంలా ఆమె గజగజలాడింది. ఒక పెద్దరాయిపడిన నూతిలోని నీరుచుట్టూ గోడకు తాకినట్లు ఆమె హృదయము దడదడ లాడిపోయింది. ఆ బాలిక వసంతోత్సవ వేషధారులై ఉన్న యువతీ యువకులను చూచింది. ఆమె కళ్లు ఏదోభయంతో అతివిస్పారితలు అయ్యాయి. కళ్ళనీళ్ళు వేడినీటి ఊటలా జివ్వున ఊరినాయి. కెవ్వున కేకవేయబోయి, కుడిచేతితో పెదవులు బిగించుకుంది. బ్రహ్మదత్తుడు వెంటనే రథమెక్కి వెళ్ళిపోయినాడు. యువతీ యువకులు వెళ్ళిపోయినారు. నీళ్ళలో ఊపిరాడనంతవరకూ మునిగిపోయి పైకి ఎలాగో తేలినట్లనిపించింది. ఆ బాలికకు. ఆమె కూడా తిన్నగా యింటికిపోయింది.

నిజంగా ఏమి జరిగింది? బహ్మదత్తప్రభువు తన్ను రతీదేవిగా ఎన్నుకొన్నాడు. ఎన్నుకొంటే తన కెందుకంతభయం కలిగింది? భయం కలగడమేమిటి? శాస్త్రగ్రంథాలలో “భయము, కంటినీరు, వణకుట” వీటిని గురించి నిర్వచనాలున్నాయి. ఆ నిర్వచనాలు మాత్రం మా బాలకు ఏమి తెలియజేస్తాయి? పూలదండ మెళ్ళోవేస్తూ బ్రహ్మదత్తప్రభువు చేయి ఆమెకు తగిలినప్పుడు ఆమె దేహంలో ఏదో మహానది ప్రవహించినట్లయిపోయింది. గ్రంథాలలో చెప్పినట్లు, తన బౌద్దగురువు సెలవిచ్చినట్లు దేహంలోని నరాలు బాహ్యంగా జరిగిన ఒక సంఘటనవలన స్పందిస్తాయి. ఆ నరాలు దేహకండరాలను కదుపుతాయి. అదే జల్లుమనడానికి కారణమని అంటారు. ఏమిటా సంఘటన? బ్రహ్మదత్తప్రభువు

అడివి బాపిరాజు రచనలు - 6

76

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)