పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఉన్నది. పై రెప్పలు ఒత్తు. ఒత్తైన కనుబొమలు. చటుక్కున చూచినపుడు పులమావి రాజకుమారుడు తీక్ష్ణమైన, మనోహరమైన చూపులుకలవాడని అనుకుంటారు. కాని ఆ కళ్ళలో అతి క్రూరమైన పాముచూపులున్నాయి. అతనికి ఇరుపది ముప్పదిమంది అందమైన ఉంపుడుకత్తెలున్నారు. అతడు సర్వదా స్త్రీలోలుడు.

పులమావి రాకుమారుని హృదయంలో ఎంత క్రౌర్యమున్నా పైకి చిరునవ్వు నవ్వుతూనే ఉంటాడు. చిరునవ్వులు ప్రసరిస్తూ వెంటవెంటనే ఎదుటివాని నాశనాన్ని కోరుతూ ఉంటాడు. ఎదుటివాని భావం గ్రహించాలని అతి ప్రయత్నం చేస్తు ఉంటాడు. అసత్యాలాడటానికి వెరవడు. వెనుక నుండి చురకత్తియతో తన గురువునైనా పొడవగలడు పులమావి రాకుమారుడు. రాజకీయాలలో నిర్వహించవలసిన పని లాభకరమైతే చాలు, మార్గమేదైనా సరే!

పులమావి రాకుమారుని ముసికనగరం (నేటి మస్కీ) రాజధానిగా శాతవాహన రాష్ట్రం పాలిస్తున్నాడు. ముసికనగరంలో తన కేళీ మందిరంలో సువర్ణాసనం అధివసించి పులమావి నర్మసచివుడైన నందిధర్మునితో మాట్లాడుతూ ఉండెను.

పులమావి: శాంతిశ్రీని మళ్ళీ ఒకసారి చూడాలి. ఆమెను చూడడమే శృంగార కళాసిద్ది.

సందిధర్ముడు: చిత్తం మహారాజా! ఇంక వివాహం ఎందుకు?

పుల: ఓయి వెఱ్ఱివాడా! భగవంతుడు ప్రత్యక్షమవడమే దుర్లభం. ప్రత్యక్షమగుటే చాలునని భక్తుడూరకుంటాడా చెప్పు. ఆ భగవంతునిలో లయం కావాలి అని కోరుతాడు

నంది: మహాప్రభువులు రాజకుమారిలో లయం కావాలి అని కోరుతున్నారా, లేక శాంతిశ్రీయే మహాప్రభువులో లయం కావాలి?

పుల: ఓయి విదూషక చక్రవర్తీ! నువ్వు ఏ ఉపాయం ఆలోచిస్తావో. మేము ఆ రాజకుమారిని ఒక పక్షందినాలలో చూడకపోతో...

నంది: పక్షవాతం వచ్చినంతపని అవుతుందంటారు ప్రభువులు.

పుల: నీ నొసలు వెక్కిరించక మానవు?

నంది: మహాప్రభువుల కళ్ళు తామరపూవుల్ని వెక్కిరించినట్లు.

పుల: ఉపాయం ?

నంది: దేవేంద్రుని ఉపాయం

పుల: దేహమెల్లా కళ్ళయి ఊరుకుంటే?

నంది : గౌతము డొకడు ఏర్పడితేకదా మహారాజా!

పుల: ఓయి మట్టితలకాయా నేనే ఆ గౌతముణ్ణి కాదలుచుకొన్నాను.

నంది: మహారాజా ఇంతకూ ఆమె అహల్య కాకపోయినా, ఆమె పోలికలున్న వంటారు.

పుల: అంటే?

నంది: మహాప్రభూ! ఆమెకు చైతన్యమే లేదట. ఆమెకు మెదడు ఉంది. హృదయంలేని రాయి అంటారు.

పుల: మే మాదినాన చూచినప్పుడు ఎక్కువ అభిమానమూ, గర్వమూ ఉన్నదానివలె కనిపించింది.

అడివి బాపిరాజు రచనలు - 6
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)
75