పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంకా దొంగమాటున ఉండదలచుకుందనీ, తన చెల్లెలినికూడా మాట్లాడవద్దన్నదనీ నాగదత్తుడు క్షణికంలో గ్రహించాడు. అతనిలో మత్తులు తాండవించాయి. కన్నులు బరువెక్కాయి.

    “ఘలఘలఘల కదిలిరావ
     థళథళథళ తరలిరావ
     పసిడి వొంటి పడుచుదాన
     మిసిమి వయసు సోకుదాన.”

యశోద పట్టలేక పకపకమని నవ్వింది. తారానిక కొండవాగులా మిల మిలల తళతళల నవ్వు నవ్వింది. నాగదత్తుడు “హహో, ఓహో” అని ఉరుము లురిమినట్లు నవ్వాడు. బాలిక లిద్దరూ లేచి నిలిచినారు.

తారానిక: పెద్దపులి వచ్చిందేమో అని అడిలిపోయాను.

నాగదత్తు: కోకిల గుంపు వచ్చిందేమో అని ఉప్పొంగిపోయాను.

యశోద: మీ ఇద్దరికీ మతిపోయిందేమోనని బేజారయ్యాను.

నాగదత్తు: ఇంతకీ నా చిన్నకత్తి తీసిన అందాలదొంగ దొరికింది. అదే సంతోషం.

తార: నా వల్కలం తస్కరించుకొని పోయిన ముచ్చు దొరికాడు. అదీ నాకు విచారం.

యశోద: అన్నయ్యకు సంతోషం ఏమిటీ, నీకు విచారం ఏమిటీ?

నాగ: నా కత్తి నాకు దొరికినందుకు సంతోషం, కాదుటే చెల్లీ!

తార: ఆడవాళ్ళ వల్కలం మొగవాళ్లు ఎత్తుకుపోవడం విచారం కాదుటే నాగవల్లీ!

యశోద: మా అన్నయ్య వీపుతట్టనా, నీకు కన్నీరు తుడవనా?

తార: పాపం మీ అన్నగారి వీపుతట్టు లేకపోతే నవ్వి నవ్వి వీరులకు పొరమారుతుంది.

నాగ: మీ స్నేహితురాలు కన్నీళ్ళు తుడు ముందు. లేకపోతే ఆ నీళ్ళతో ఈ వాగుపొంగి మన ఊళ్ళన్నీ ములిగిపోతాయి.

యశోద: ఉండండి ఇక్కడే. తట్టటానికీ తుడవడానికి కావలసిన వస్తువులు పట్టుకువస్తాను, అంటూ తుఱ్ఱున పారిపోయింది. “నేనూ వస్తాను ఉండవే” అని తారానిక ఆమెవెంట పారిపోబోతూంటే, నాగదత్తుడు చేయి పట్టి ఆపినాడు.

“నా చేయి వదలండి.”

“ఇది నాచేయి.”

“మీ చేయి ఏలాగు ?”

“నేను వరించిన చేయి నాదికాదా ఏమిటి?”

“అయితే మీకు ఎన్ని చేతులు దక్కి ఉంటాయో?”

“రెండే రెండు చేతులు తారా!”

“నా పేరు తారానిక.”

“నా పేరు నాగదత్తుడు. అయితే ఏమి, నేను నాగయ్యను. నువ్వు నాకు దారి చూపే చుక్కల రాణివి."

“మీరు చుక్కల్లో చంద్రుడు.”

అడివి బాపిరాజు రచనలు - 6

70

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)