పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగనిక శాంతిశ్రీ రాకుమారిక కడకు వెళ్ళవలసివస్తే ఆమె వెనుకనే తారానిక ఉన్నదన్నమాట. తారానికి రాకుమారిక పనికోసం ఎక్కడికేని వెళ్ళినచో యశోదనాగనిక కూడా వెళ్ళిందన్నమాటే. అంగరక్షకస్వామిని ఈ ఇద్దరిని ఒకర్తెగానే భావించి విధుల నేర్పాటుచేస్తూ ఉంటుంది. వీరిద్దరిపైనా ఉన్న నమ్మక మాస్వామినికి ఇతరులపై లేదు. రాకుమారిక ప్రార్థనా మందిరం ముందరగాని శయనమందిర ప్రాంగణంలోగాని కాపుగా ఉండేది ఈ బాలిక. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్కజట్టు పరిచారికలు తమ తమ గ్రామాలకు ఒకనెల దినాలపాటు వెళ్ళివస్తూ ఉంటారు. రాబోయే వసంతోత్సవాలకు యశోదనాగనికా తారానికలు సాలగ్రామం వెళ్ళుదమనుకుని స్వామిని ఆనతిని పుచ్చుకున్నారు. శుభముహూర్తం చూచి బాలికలిద్దరూ రాకుమారిక పాదాలకెరగి ఆమె అనుమతి నందుకొని కోట్యరథము కృష్ణకావల నెక్కి సాలగ్రామం బయలుదేరారు.

యశోద నాగరిక: ఏమే వదినా!

తారానిక: ఎందుకే సుదతీ!

యశో: ఏమిటే ఆలోచిస్తున్నావు?

తారా: నీ అందాన్ని గూర్చి.

యశో: నా అందమా?

తారా: నీ అందమే వదిన

             నీ అందమే! సుదిన

             మే నేను నినుచూచి

             చూచినప్పుడో కాణాచి!

యశో: కాణాచి నేనై తే
      
             జాణ వీవగుదువే
     
             అంగజుని బాణమా

             చందురుని కిరణమా?

రథాశ్వాలు వీరి పాటలు వింటూ నెమ్మదిగా నడుస్తున్నవి.

7

శోదనాగనిక తలవంచుకొని దారిలో కాల్చిన జొన్నకంకుల ఊచబియ్యం నములుతూ “ఈ చేను లేగాపుది. అందుకనే జొన్నబియ్యం మారుచిగా ఉంది. పైరు పొలాలన్నీ ఏపుగా వస్తున్నాయి. సంక్రాంతి పండుగ ముందరనే కోతలైపోతాయి” అని చెప్పి తలెత్తి తారానికను చూచింది.

తారానిక నవ్వుతూ “మంచి రుచిగా ఉంది. ఈ ఊచబియ్యం పంట దినాల్లో పొలాలకు పోయి బాలబాలికలు ఈలా తింటూ ఉంటారా?” అని ఆ బాల యశోద నాగనికను ప్రశ్నించింది.

“వానాకాలంలో పొలాలకు పని ఉన్నవాళ్ళు తప్ప మరి ఎవరూ వెళ్ళరు. శీతకాలం వచ్చిందీ అంటే మా పల్లెటూళ్ళ వాళ్ళందరూ పొలాలలోనే కాపురాలు పెడ్తారు.”

అడివి బాపిరాజు రచనలు - 6

62

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)