పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీర: ఎప్పటి కా ఉత్తమస్థితి?

బ్రహ్మ? ఈ ప్రపంచం విశ్వంలో లయమైనప్పుడే.

6

బ్రహ్మదత్తప్రభువు అంగరక్షకసైన్యం పదునైదువందల వీరులతో విలసిల్లుతూ ఉంటుంది. వీరంతా ఒకధనస్సు (ఈ నాటి ఆరడుగులు) పొడుగుంటారు. అందరు బలసంపన్నులు, సంశప్తకులు. ఆయుధ విద్యలో వీరికి దీటయిన శూరులరుదు. విజయపురానికి అయిదుగోరుతాల దూరంలో ఉన్న సాలగ్రామవాసి నాగదత్తుడు ఈ దళానికి నాయకుడు సాలగ్రామం ధర్మగిరికి ఎదురుగా కృష్ణకావల రెండుగోరుతాలలో ఉన్న చిన్న గ్రామం.

ఇక్ష్వాకు సైన్యాలు జైత్రయాత్ర చాలించి విజయపురం రాగానే నాగదత్తుడు తన సేనాపతి అనుమతి తీసుకొని సాలగ్రామం వెళ్ళాడు. నాగదత్తుని తండ్రి బుద్దనాగడు అరువది ఏళ్ళవాడయినా జవసత్వాలుడుగని పోటుమానిసి. అతనికి సాలగ్రామంలో రెండు పెద్దఇళ్లు ఉన్నాయి. ఆ రెండు ఇళ్ళలో అతడూ భార్యలూ, అతని అయిదుగురు సంతానమూ ఉంటారు.

అతని పెద్దభార్య కన్నసిరి సంతానంలో ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుండ్రు. కన్నసిరి మూడవ కొడుకు నాగదత్తుడు. కన్నసిరి పెద్దకొడుకు దుగ్గసామికి నలుగురు సంతానం రెండవకొడుకు గోదత్తునికి ఇద్దరు సంతానం. మూడవ కొడుకు నాగదత్తునికి వివాహమేలేదు. పెద్దకూతురు నాగసిరి రెండవ సంతానం. ఆమెకు పెండ్లయి అత్తవారూరయిన కోంబ్రోలకు పోయింది. ఆ గ్రామం సాలగ్రామానికి మూడు గోరుతాలుంటుంది. ఈమెకు అయిదుగురు సంతానం.

బుద్ధనాగుని రెండవ అమ్మాయి మహారాజకుమారి శాంతిశ్రీకడ అంగరక్షకి. ఆమె పేరు యశోదనాగిని. యశోదనాగినితో ఉన్న రెండవ అంగరక్షకి తారానిక. తారానిక తండ్రిగారి ఊరు విజయపురానికి దిగువను కృష్ణానది ఒడ్డునవున్న ఏటిరాయి గ్రామం. తారానిక తండ్రి ఏటిరాయి గ్రామణికుడైన సప్తనాగుని రెండవపుత్రుడై, శాంతిమూల ప్రభువు తండ్రికి అంతఃపుర రక్షకుడుగావచ్చి అంతిపురాలు కాస్తూ ఉండెను. అతని పెద్ద కొమరిత తారానిక.

తారానికకు ఇప్పుడు పదునెనిమిదేండ్లున్నవి. అంగరక్షకులుగా ఉన్నంత కాలం స్త్రీలు వివాహం చేసుకోకూడదు. వివాహం చేసుకోవాలంటే అంతఃపురోద్యోగం వదలి తండ్రి ఇంటికి వచ్చి పెళ్ళి చేసుకోవలసిందే.

తారానికా యశోదనాగిని లిరువురూ దేహబలమూ, సౌందర్యమూ, బుద్ధిబలమూ, సుగుణసంపత్తీ ఉన్న బాలికలు. యశోదనాగినికి పది హేడేండ్లు. యశోదనాగినికకూ తారానికకూ పువ్వునకూ సువాసనకు ఉన్నంత స్నేహం. ఇద్దరూ కలిసి భోజనం చేయవలసిందే. ఇద్దరూ ఒకే రంగు చీరెలూ, వల్లెలూ, స్తనవల్కలాలూ, ఒకే దినుసు నగలూ ధరించవలసిందే. ఇద్దరూ మొలనూళ్ళకు దిగువను ఛురికలు ధరిస్తారు. యశోద

అడివి బాపిరాజు రచనలు - 6

61

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)