పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బ్రహ్మదత్తుడు శాతవాహనవంశంలో అట్టి చంద్రవిక్రముడు ఇంక రాడు అనుకున్నాడు. శాతవాహనవంశ ప్రభువులనేకులు వలసవెళ్ళి శాతవాహన రాష్ట్రము స్థాపించినారు. తుంగభద్రా కృష్ణవేణా సంగమస్థానంలో వారిలోగాని, మరి ధాన్యకటకాది ప్రదేశాల చిన్న చిన్న సామంతులలోగాని, కళింగంలో శాలివాహన గుండరాజ్య ప్రదేశాల సామంతరాజ్యాలు స్థాపించిన వారిలోగాని ఒక్కడైనా శక్తిమంతుడైన శాతవాహన వీరుడు లేడు. విజయశ్రీ మహారాజే కడగొట్టుపిందె. ఆయన కొమరుడు తండ్రీకన్న నీరసుడు.

బ్రహ్మదత్తుడు యువరాజు వీరపురుషదత్తుని కలుసుకొన్నాడు. వీర పురుషదత్త ప్రభువు మాళవంనుండి అంతకుమున్నే విజయపురికి వేంచేసినారు. మాళవాధిపతియైన రుద్రసేనప్రభువు తన ముఖ్యమంత్రిని శ్రీవీరపురుషదత్త ప్రభువును ఉజ్జయినికి ఆహ్వానించడానికి పంపిస్తాడు. ఆ సమయంలో భరుకచ్ఛంలో మహారాజు శాంతిమూలుడు విడిసి ఉన్నాడు. మహారాజు యువరాజునకు తమతో వచ్చిన ఇక్ష్వాకుమంత్రి నొకరిని పంపి తమ అనుమతిని తెలియజేసినారు. శీతకాలం ప్రారంభమైన దినాలలో ఉజ్జయిని వెళ్ళితిననీ, ఆనాడు ఉజ్జయిని కన్నుల వైకుంఠంలా అలంకరించారనీ యువరాజు బ్రహ్మదత్తునితో చెప్పినాడు.

బ్రహ్మదత్తుడు: ప్రభూ! మాళవ రాజపుత్రిక రుద్రభట్టారిక అపరిమిత సౌందర్యవతి అని నేను ఉజ్జయినిలో విన్నాను.

యువరాజు: ఈ యువరాజు ఈలా అపరిమిత సౌందర్యవతులను ఎంతమందిని చూడవలసి ఉంటుంది?

బ్రహ్మ: ప్రభువులు సర్వసాధారణంగా దక్షిణ నాయకులు. రాజధర్మ సంరక్షణకై దక్షిణ నాయకత్వమును పూనవలసి ఉంటుంది.

యువ: బలవంతుడైన రాజునకు దక్షిణ నాయకత్వం అవసరమా అనుకొంటాను.

బ్రహ్మ: దక్షిణ నాయకత్వమే ప్రభువులకు బలమిస్తుంది. క్రిందటి వసంతోత్సవంలో పూంగీయ రాకుమారికకు కోపం వచ్చింది కదా ప్రభూ?

5

వీరపురుషదత్తుడు బ్రహ్మదత్తుని ఒక నిమేషం తీక్షంగా గమనించి “ధనకప్రభూ! ఆ దినాన వసంతోత్సవంలో జరిగిన గజబిజి ఇదివరకెన్నడూ జరగలేదు. మా చెల్లెలు రతీదేవిగా ఉండలేకపోవడం, మీరు వెళ్ళిపోవడమూ జరిగింది. రాజకుమారి బాపిశ్రీ రహస్యంగా కన్నుల నీరునింపడం నేను చూచాను. దక్షిణ నాయకత్వ ప్రభావం అప్పుడే నాకు అవగతం అయింది.”

“ప్రభూ! మళ్ళీ వసంతోత్సవాలు వస్తున్నవి.”

“మా మరదలు శాంతశ్రీ రాకుమారి ఈ ఏడు వసంతోత్సవాలకు ఉండదలచుకోక తల్లిదండ్రులను ప్రోత్సహించి పూంగిప్రోలు వెళ్ళిపోయింది.”

“ప్రభూ! మేము ఉత్తరకళింగ రాజధానికి పోయినప్పుడు వాసిష్ట ప్రభువు క్రిందటి వసంతోత్సవాన ఆరంభించిన రాయబారాన్ని పూర్తిచేసినారు. అందుకు మహారాజుగారు ఒప్పుకున్నారు.”

అడివి బాపిరాజు రచనలు - 6
అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)
59