పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సార్వభౌముల ప్రతినిధులుగా వచ్చారని మాకు నమ్మకం కలుగగానే తమ సన్నిధికి మా ప్రభుభక్తిని అణకువతో ఉద్ఘాటించడానికి వచ్చాము” అని అభీరనాయకులు బ్రహ్మదత్త ప్రభునకు విన్నవించెను. బ్రహ్మదత్తప్రభువు చిరునవ్వు నవ్వుతూ యవన పారశీకాది వణిజులను చూచి “మీ కోరికా, నా ఆశయమూ ఫలించాయి” అంటూ, అభీరులను చూచి గంభీరంగా, “మేము మా సైన్యాలతో భరుకచ్ఛం ఆక్రమించుకుంటాము” అని తెలిపినాడు.

ఆ దినమందే బ్రహ్మదత్తప్రభువు భరుకచ్చం ఆక్రమించుకున్నాడు. బ్రహ్మదత్తుని కడనుండీ భరుకచ్చపట్టణ నాయకులకడనుండీ చారులు, భరుకచ్చం లోబడిన విషయం వార్తలు కొనిపోయినారు. భరుకచ్ఛనాయకులు కట్టవలసిన కప్పము కట్టివేసినారు. కతిపయదినాల్లో శాంతిమూలమహారాజు సైన్యాలతో, భరుకచ్ఛ సేనాపతులతో సేనలతో భరుకచ్చం చేరిరి. నగరంలో నూతన్న శాతవాహన చక్రవర్తి సామ్రాజ్యాభిషేకోత్సవాలు వైభవంగా అభీరులు జరిపినారు.

భరుకచ్చంనుంచి శాంతిమూల మహారాజు దక్షిణంగా మరలి కుంతల దేశం చేరుకున్నారు. చూతశాత కర్ణాట ప్రభువు యుద్ధం చేయడానికి ఇష్టం లేక తానీయవలసిన కప్పం కట్టి, తన అకుంఠితభక్తి తెలిపినాడు. వైజయంతీ పురంనుంచి శాంతిమూల మహారాజు ముసికనగర ముఖ్యనగరస్థమైన శాతవాహనపథం దాటి కాంచీపురం చేరుకొని, కాంచీపురాధిపతులకడ, తొండమండలాధిపతులకడ కప్పముగొని, తిరిగి ప్రయాణాలు సలుపుతూ ధాన్యకటక నగరం విచ్చేసినారు. ఈ యాత్ర సంవత్సరానికి పూర్తియైనది. సామంతులందరూ యుద్ధం అవసరం లేకుండా కప్పముకట్టిన సంగతి విని విజయశ్రీ శాతకర్ణి చక్రవర్తి ఎంతో సంతోషించినారు. శాంతిమూల మహారాజు కప్పమంతా చక్రవర్తికి అప్పగించి, తాను విజయపురం వెళ్ళినాడు. బ్రహ్మదత్త ప్రభువు తాను యుద్ధం చేయవలసిన అవసరం లేకుండా ఈ జైత్రయాత్ర పూర్తి అయినందుకు భగవదనుగ్రహాన్ని కొనియాడుకొన్నాడు.

శాంతిమూలమహారాజు ఈ జైత్రయాత్ర ఇంత సులభంగా జరిగిపోయినందుకు ధాన్యకటక మహేశ్వర దేవాలయంలో అర్చనలు చేయించి, మహా చైత్యానికి వేయి దీపములు అర్పించుకున్నాడు. బ్రహ్మదత్తప్రభువు మహారాజు శాంతిమూలునితో ఏ తీర్థయాత్రకో వెళ్ళివచ్చినట్లు జైత్రయాత్ర చేసి వచ్చినందుకు ఆశ్చర్యం చెందినాడు. యజ్ఞశ్రీశాతవాహన చక్రవర్తి కాలంలో ఆ సార్వభౌముడు అభీరులతో, మాళవులతో యుద్దములు చేసినాడు. కుంతలములో నాగదేవులతో మహాయుద్ద మొనరింపవలసి వచ్చింది. యజ్ఞశ్రీ దేవుని తండ్రి నీరసుడవడంవల్ల శాతవాహన సామ్రాజ్యము క్రుంగి కృశించిపోయినది.

యజ్ఞశ్రీప్రభువు విక్రమ ప్రజ్ఞలవల్ల తండ్రితరాన ముక్కలైపోయిన సామ్రాజ్యము తిరిగి తాతగారయిన పులమావి, వారితండ్రి గౌతమిపుత్ర శాతకర్ణులనాటి మహోత్తమదశకు వచ్చింది.

అడివి బాపిరాజు రచనలు - 6

58

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)