పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్క శాంతశ్రీని ఎన్నుకోకుండా వాసిష్టి భట్టిదేవిని బావగారు ఎన్నుకోడం అక్కగారికి కోప కారణమైనది. అక్కకు కోపం వచ్చినట్లు తనకు కోపం రావలసిందే. కాని సౌందర్యంలో అక్క శాంతశ్రీతో ఎవరు దీటుకో గలరు! తన్ను యువరాజు కమల పుష్పముగా మాత్రము ఎన్నుకుంటారని ఆమె అనుకున్నది.

ఈ ఆలోచనలతోనే బాపిశ్రీ బ్రహదత్త ప్రభువునుచూచి, ఈ ప్రభువును కామదేవునిగా ఎన్నుకుంటే, ఈయనే అక్కకూ, తన బావగారికీ సామరస్యం కుదర్చగలరు అని ఆలోచించుకున్నది. ఆ భావము ఒక బాలిక చెవులో వేసింది. అది అలా అలా పాకిపోయింది బాలిక లందరిలో.

        “మధుమాసదేవునకు మదనదేవుడు హితుడూ
        మదనదేవుందేడి మదవతులు వేదకరే!”

అని పాడుతూ బాలికలు బ్రహ్మదత్తప్రభువును చుట్టుముట్టినారు.

      “ఇడుగిడుగొ చెలియరో ఇక్కడే వెలిసాడె
       పడుచువారల దాడిసలుప నున్నాడే!

బ్రహ్మదత్తుడు తెల్ల పోయినాడు.

     “రావోయి మన్మథా
      రావోయి శుకరథా!
      నీవె సృష్టికి మూల మీవె జీవాత్ముడవు
              రావోయి మన్మథా
              రావోయి శుకరథా!
      కామేశ్వరుడ వీవె
      కావేశ్వరుడ వీవె
      ఈవె యవ్వన జీవితేశ్వరుడవు కావే
              రావోయి మన్మథా
              రావోయి శుకరథా!”

పాటలు పాడుతూ మహావేగాన నృత్యమొనరించినారు. బాలురు, బాలికలు, వృద్దులు వసంతుని ఎన్నిక సమయంలోవలె అత్యంత సంతోషము వెల్లడించారు. బ్రహ్మదత్త ప్రభువు మాట్లాడుటకు వీలే లేకపోయింది. ఆయనను కొనిపోయి వసంతదేవుని పూలవేదిక ప్రక్కనున్న వేదికపైన పూలసింహాసనంపై అధివసింపచేశారు. యువతీ యువకులు ఆయనకు పూలకిరీటం పెట్టినారు. ఇక్షు కోదండమూ, పూవుల బాణాలతో అలంకరించారు.

     “వెదకరే మన రతీదేవిని
      వెదకరే శృంగారాదేవిని
      ఆనంద పులకితదూ!”

అని పాడినా రా బాలలు. బ్రహ్మదత్తునకు చటుక్కున ఒక దృఢనిశ్చయం కలిగింది. ఆ ప్రభువు ఆ బాలికల నందరిని కలియచూచినాడు. చిరునవ్వు నవ్వుకొన్నాడు. మహారాజు

అడివి బాపిరాజు రచనలు - 6

48

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)