పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“కరడు కట్టిన నీరు కరగి ప్రవహించింది.
 కొత్త ఉప్పొంగుతో కొత్త కెరటాలతో”

వారు ధరించిన వస్త్రాలు కళాస్వరూపాలు. వారి అలంకారాలు సౌందర్య స్వప్నాలు. వారేరసాధిదేవతలు. యువరాజు వీరపురుషదత్తుడు వసంతమూర్తి అయినాడు. పూంగీయ శాంతశ్రీయు, బాపిశ్రీయు వనదేవతా, కుసుమదేవత అయినారు. నగరంలోని, దేశంలోని యువతీ యువకులు మహోద్యానవనంలోనే చేరి అచ్చటనే వివిధ మందిరాలలో నివసిస్తారు. పగలూ రాత్రీ ఆటలపరవళ్ళలో ప్రవహించిపోతారు.

ఒకదినం వసంతవరణోత్సవము. ఆ దినం కొన్ని నూరుల నివర్త నాల వైశాల్యమున ఆ తోటంతా దేశంలోని వీరులు, చదువుకొన్నవారు, అందమైనవారు, సర్వకళా కుశలులు అయిన బ్రహ్మచారులు కూడిపోయినారు. వారిలోనుండి మరల ఉదయించిన కామదేవుని, అతని అనుగు చెలికాడు వసంతుని ఎన్నుకోవాలి. వీరిద్దరిలో మొదటి ఎన్నిక వసంతదేవునిదే. ఈ ఏడు వసంతుడు ఉత్తమ గాంధర్వనిధి అయ్యుండాలన్నారు. ఆ నిర్ణయానికి ఒక పండితుడు, ఒక యువకుడు, ఒక యువతి పరీక్షకులు. శాంతిమూల మహారాజు ముగ్గురు పరీక్షకులను నియమించారు. పరీక్షలు నాలుగుదినాలు జరిగినవి. ఎందరో యువకులా పరీక్షకు నిలిచిరి. సంగీత ప్రదర్శనం కాగానే పరీక్షకులు ఆలోచించుకొని శ్రీశ్రీ వీరపురుషదత్తప్రభువు ఉత్తమ గాయకుడని నిర్ణయించారు. యువరాజు వీరపురుషదత్తుడు రావణహస్తము మ్రోయిస్తూ, గాత్రంతో గంభీరముగా పాటలు పాడినాడు.

     “పూలకై భృంగమే పుట్టేనో
      పూలె భృంగానికై పుట్టేనో
      వనములే ఎరుగున్,
భూమిచీల్చుకు మొక్కవచ్చును
మొక్కపూయును మంజులతలన్
     పూలఎదలో మధురగంధము
     భూమిలోనే గంధముండేనా?”

యువరాజు మోమున చంద్రిక లలముకొన్నవి. ఆ యువక ప్రభువు దేహమంతా ఏదో ఒక ఆనందముతో పుష్పపూర్ణ వృక్షములా అయినది. ఆ ప్రభువు కంఠంలో తేనెలు నిండినవి. లోయలో సెలయేరు నిండిపోయి ప్రవహించినట్లా మహారాజకుమారుని గొంతుకలో విమలగాంధర్వము పొంగిపోయింది. వసంతరాగ మాలాపించి ఆ సుందరమూర్తి తన కంఠాన్ని పూవుపూవుకూ పోయే భృంగమూర్తిని చేసినాడు. ఆకాశాన సంతోషంతో తిరిగే పతంగ మూర్తిని చేసినాడు. అగాథశూన్యంలో పయనించే నక్షత్రాన్ని చేసినాడు. విపుల వక్షుడు, ప్రస్పుట రేఖా సమన్విత దృఢంగ సుభగుడైన ఆ ప్రభువు మనోహర వదనము పారిజాత కుసుమంలా కలకలలాడిపోయినది. రావణహస్త విపంచిపై ప్రసరించే వ్రేళ్ళు నీళ్ళలో ఈదులాడే మీనాలులా ఉన్నవి. వ్రేళ్ళ కదలికలో

అడివి బాపిరాజు రచనలు - 6

44

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)