పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె కంఠము మధురమైంది. ఆమెకు నేర్పకుండానే సంగీతం అలవడింది. ఆమె భూర్జపత్రాలపై వ్రాసిన ధర్మసూత్రలు ముత్యాలకోవలే. మషీపాత్రలో కుంచెముంచి, ఆమె మహావేగంతో అందాలు కరిగించి పోతపోసిన వ్రాత వ్రాస్తుంది. ఆమె బొమ్మలు వేస్తుంది కాని ఆ రచన భక్తివల్ల చేసేదికాదు. అయిన ఆ బొమ్మలు అందం ఒలుకుతూ ఉంటవి. వానిలో పరిణతి లేకపోయినా మంచి ప్రజ్ఞ కనిపిస్తుంది.

ఈ ఆలోచనతో మహారాజు తన నగరు చేరెను. శాంతిశ్రీ హృదయంలో పరివర్తన ఎప్పటికైనా కలగదా? ఆమెలో ప్రేమ ఉద్భవింపదా? ఆమెకు కోపము తాపము ఆవేశము పుల్కరింపు ఒకనాటికైనా తలచూపవా? తన ఈ అందాలబిడ్డ, ఈ జగదద్భుతసుందరి, చిత్రించిన పారిజాత కుసుమమయి పోవలసిందేనా? ధర్మదత్త ప్రభువు తాను ఈ బాలిక విషయమై ప్రశ్న అడిగినప్పుడు “ప్రభూ! ఈ బాలికలోని మహోత్తమ మానవత్వము భూమి లోతుగా రాళ్ళకింద పరవళ్ళెత్తి ప్రవహించే పాతాళగంగలా ఉన్నది. ఒకనాడు ఆ రాళ్ళను బద్దలుకొట్టి పాతాళగంగను భాగీరధి చేయగలిగిన మహాపురుషు డెవ్వడో ఆమె జీవితంలో తారసిల్లుతాడు. అప్పుడే ఈమె సంపూర్ణ స్త్రీ అవుతుం” దని వాక్రుచ్చినాడు.

విజ్ఞానంలో, ప్రతిభలో, మహాపురుషత్వంలో, అతిరథ శూరత్వంలో బ్రహ్మదత్త ప్రభువు మేరుశిఖరంవంటివాడు. వీరిరువురిని ఒకరికోస మొకరిని బ్రహ్మ సృష్టించినాడు. తాను వారిద్దరిని విద్యవ్యాజా సంధానించినాడు. ఆ పైన భగవదిచ్ఛ.

తండ్రి వెళ్ళినప్పటినుండి శాంతిశ్రీ మహారాజు ఎందుకు వచ్చినారు అనుకొన్నది. ఆమె చెలికత్తె ఒకర్తవచ్చి “మహారాజకుమరీ, మిమ్ము శాంతశ్రీ ఆహ్వానించింది. వేళ అవుతున్నది. కోటభేరీ అప్పుడే మూడవ యామపు మ్రోత వ్రాయించినది” అని మనవి చేసినది.

17

విజయపురిలో వసంతతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆనాడు సకల భారతవర్షమూ నవ్యజీవనంతో కలకలలాడి పోతుంది. కామదేవుడు దివ్యతపోజనిత నేత్రాగ్నితో మసి అయిపోతాడు. ఆ దినాన ప్రజలు కామ దహనోత్సవంచేసి, విషణ్ణ వదనాలతో ఘడియలు గడుపుతారు. ఆ మరునాడు మనుష్యుని నిత్యయౌవనశక్తి నూత్న జీవన మార్గాన్ని అన్వేషించ కోరుతుంది. ఆ కాంక్షకు సిద్ది రతీదేవి. సిద్ది కార్యదీక్షను వాంఛిస్తుంది. కార్యదీక్ష కామదేవుడు, మనుష్యుని నిత్యత్వానికై కాముడు తిరిగి ఉద్భవించాలి. నూత్నచైతన్యం కటికచీకటిలో కాంతికణంలా ఉద్భవిస్తుంది. ఎండిపోయిన చెట్టు కోరికలనే కెంజిగుళ్లు ధరిస్తుంది. ఎక్కడో అస్పష్టంగా “కో” యని వినబడుతుంది. కామ జననం అయింది. పసంతకాలం ప్రారంభించింది. చిగురులు పెరుగుతున్నాయి. ఫెళ్లున తోటలు అడవులు, చెట్లు, పొదలు జేగురుపసిమి రంగులతో విరిసిపోయినాయి. దిరిసెనలు, తంగేడులు, మోదుగలు కోర్కెచివుళ్ళు తొడగకుండానే పూలమొగ్గలతో నిండిపోయాయి. యువతీ యువకులు తమలో ఉదయిస్తున్న ప్రేమరాగానికి చిహ్నంగా వసంతకాలం అంతా పాటలతో, ఆటలతో, నాట్యాలతో ఉప్పొంగిపోతారు.

అడివి బాపిరాజు రచనలు - 6

43

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)