పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బ్రహ్మదత్తప్రభువు కొరకు బహిర్మందిరంలో ఎనలేని ఓర్పుతో కనిపెట్టుకొని యున్నాడు ఆ వృద్దశ్రమణకుడు. బ్రహ్మదత్తుడు ఆశ్రమణకుని వెంటనే బయలుదేరి అంతస్తులు దిగి, అక్కడ ఉన్న భిక్షులకందరకు నమస్కరించి వారి సెలవుపొంది వెడలి పోయినాడు. త్రికాలజ్ఞులైన మహనీయుల దర్శనమే సర్వసంశయాలకు నివారకమనుకొన్నాడు బ్రహ్మదత్తుడు. మహాత్ములు బోధింపనవసరములేదు. శుద్దసాత్త్వికులను సకలమార్గములూ మూలకారణానికే కొంపోవును.

ప్రపంచంలోని అపశ్రుతులు మానవహృదయాన్ని సంశయానిలం చేస్తవి. స్థిరమైన పట్టు దొరకదు. సంతతమైన ఈ జగత్పరిణామం అతిచిత్రమైనది. కనుకనే ఇది మాయగా గోచరిస్తుంది. ఉపనిషద్విచారణ మార్గాన్ని బౌద్దవిచారణ పరిపూర్తి చేసిందనుకుంటే, బౌద్ధధర్మకూడా హీనమైపోవడమేమిటి! ఎన్నో చిన్న చిన్న సిద్దాంతాలు ఈ ధర్మ సమన్వయానికే భగవాన్ నాగార్జునదేవులు అవతరించారు. శ్రీకృష్ణపరమాత్మే బుద్ధదేవుడు, ఆయనే నాగార్జునదేవుడు అనుకుంటూ బ్రహ్మదత్తుడు కొండ దిగి, రథమెక్కి కృష్ణాతీరానికి వెళ్ళి, ఓడలరేవు చేరినాడు.

శాంతిమూల మహారాజు కృష్ణానది పడవల రేవును చలవ నాపరాళ్ళ వితర్దికగా నిర్మాణ మొనర్పజేసెను. ఆ వసంత కాలంలోకూడా విజయపురి చెంత కృష్ణలో వేలకొలది ఓడలు, నావలు, పడవలు, తరణులు అన్నీ కునికిపాటుపాడే వృద్దులవలె, ఆ నదీ తరంగాలలో ఊగిసలాడుతున్నవి. బ్రహ్మదత్తుడు రేవు దగ్గరకు పోయేసరికి ఒక ఓడలోనుంచి సరుకు దిగుతోంది.

11

బ్రహ్మదత్తుడు రథము దిగి రేవులోని ఓడల పరిశీలింప వెడలినాడు. ఈ ఓడలు సాగరికములుకావు. నదులలో ప్రయాణంచేసే తరణులు. ఇవి సముద్రంవరకు ప్రయాణం చేస్తాయి. కొలందియలు అన్న ఓడలు నదుల ముఖద్వారంలోనూ లోతు నదులలోనూ సముద్రతీరం వెంబడినీ ప్రయాణం చేస్తాయి. నదిలో మాత్రమే యానం చేసేని నావలు. సముద్రంలో మాత్రం యానంచేసే ఓడలనే సాగరికములనీ, నౌకలనీ పిలిచేవారు. కృష్ణాముఖ ద్వారము ఎంత పెద్ద ఓడలలో నుంచి సరుకులన్నీ తాము ఎగుమతి చేసుకొని, ఈ ఓడలు నదీతీర పట్టణాలలో దిగుమతి చేయవలసిన సరకులను దిగుమతి చేస్తూ ప్రయాణం సాగిస్తాయి. శ్రీపార్వతీయాంధ్ర ప్రదేశంవరకూ కృష్ణలో ఒక్కనడివేసవి కాలంలో తప్ప తక్కినకాలాల్లో ఈ పెద్ద ఓడలు ప్రయాణం చేస్తూనే ఉంటాయి.

బ్రహ్మదత్తప్రభువు దిగుమతి అయ్యే మిరియాలు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క ముత్యాలు, లక్క కెంపులు, చీనాపట్టు, బంగారము పరీక్షించెను. శ్రీకాకుళంలోనే వర్తకులు సుంకాలు చెల్లించి సరకులు ఓడలో ఎక్కించుకొన్నారు. సుంకాలు పుచ్చుకొన్నట్లు శాతవాహన ముద్రికలు ఓడ నాయకునికడ ఉన్నాయి. ఏ ఏ వస్తువునకు ఎంత సుంకమిచ్చిరో ఆ వివరాలను సముద్రవర్తకాధికారి రాగి రేకుమీద చెక్కించి ఆ ఓడ నాయకునికి ఇచ్చినాడు. వానినెల్ల ఆ ప్రభువు పరీక్షించినాడు.

అడివి బాపిరాజు రచనలు - 6
అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)
33