పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బ్రహ్మదత్తుడు భిక్షులకు నమస్కరించినాడు. అప్పుడొక వృద్ద శ్రమణకుడు బ్రహ్మదత్తుని స్నానగృహానికి కొనిపోయినాడు. బ్రహ్మదత్తుడు ఆ స్నాన గృహ కుడ్యమందున్న గోముఖాన వినిర్గమించే ప్రసవణం క్రింద స్నానంచేసి ఆ శ్రమణకు డందిచ్చు చీనాంబరాలను ధరించినాడు.

అప్పుడు అర్హతులొకరు వచ్చి మాటలాడక స్కందవిశాఖాయన ప్రభువును చివర అంతస్తులోనికి తీసుకొనిపోయినాడు. అడవి స్కంద విశాఖాయనక ప్రభువు నాగార్జునాచార్యుని ఎదుట సాష్టాంగము పడినాడు.

“నాయనా, దగ్గరకు వచ్చి కూర్చో” అని అతి మధురములై, దివ్యామృతధారలైన మాటలు స్పష్టముగా వినంబడినవి. బ్రహ్మదత్తప్రభువు ఆనంద వికసితమైన మోముతో లేచి, నాగార్జునదేవునికడకు వచ్చి వారి మంచముదాపున క్రింద మొగలియాకు చాపపై కూర్చుండినాడు. నాగార్జున దేవుని వదనాన మందహాసము సంపూర్ణ జ్యోత్స్నలు విరియుచున్నది.

“ధనకప్రభూ! మీ నాయనగారు శ్రీశైలారణ్యాశ్రమంలో క్షేమంగా ఉన్నారా?” నాగార్జునదేవుడు మాట్లాడునప్పుడు పెదవులు కదలినట్లు కానరావు.

“క్షేమంగా ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నవి భగవాన్!”

“కాలం మనలోనే ఉంది. దానినుంచి మనం ఎంతదూరం పరుగెత్తగలం?”

“చిత్తము.”

“మూడుగా కనుపిస్తూ ఏకమైనకాలం అనంతమై, మనుష్యుని అణువణువూ పొదువుకొని ఉంటుంది.”

“చిత్తం భగవాన్!”

‘శాతవాహన యుగం అస్తమిస్తున్నది. దేశంలో ధర్మనాశనం కలుగుతుంది అనుకుంటున్నావు.”

“చిత్తం భగవాన్."

“ఆనాటి ఇక్ష్వాకు వంశంలోనిదే ఈ విజయపురి శాఖ.”

“చిత్తం.”

“నాయనా, ఇక్ష్వాకులమీదే ఈ మహాదేశ రక్షణభారం పడుతుంది. ఆ ఇక్ష్వాకుల భారం నీపైన ఎక్కువ మొగ్గుతుంది. ధర్మనిర్వహణానికి దారిచూపే వెలుగు మనలోనే ఉంది.”

“భగవాన్! నేను కృతార్థుణ్ణి.

“నాయనా! నువ్వు ధాన్యకటకంనుండి రాగానే, ఇక్కడికి ఒక్కసారి రా.”

ఆనందంతో, అనిర్వచనీయ మహాభక్తితో బ్రహ్మదత్తుడు భగవాన్ నాగార్జునదేవునకు సమాలింగితభూతభూతలుడై నమస్కరించి, నెమ్మదిగా నడిచి వెడలి పోయినాడు. నాగార్జునదేవుని చిరునవ్వులు విశ్వమున ప్రసరించినట్లయి పోయినవి. ఆశీర్వచన సమ్మిశ్రితమగు చూపులు బ్రహ్మదత్తుని గుమ్మము వరకు సాగనంపినవి.

అడివి బాపిరాజు రచనలు - 6
అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)
32