పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరపురుష: శాంతా! చిన్ననాటినుండి నువ్వు అల్లరిపిల్ల ! బాపిశ్రీ గడుసరిది. నాతో పందేలువేసి నిరుడు వసంతోత్సవాలలో నువ్వు ఓడిపోయావుగాని ఈఏడు బాపిశ్రీ వీణపాటలో నన్ను ఓడిస్తుంది.

శాంతిశ్రీ “ఈ ఇరువురితో పందెంవేసి మీరెప్పుడు జయించలేరు” అన్నది అన్నతో. వీరపురుష ఓటమి నిశ్చయం కనుకనే వసంతోత్సవాల అనంతరం నేను ఉజ్జయిని వెళుతున్నాను.

వసంతోత్సవాల అనంతరము తమ వసంతుడు ఉండడు కాబోలునని శాంతశ్రీ బాపిశ్రీల హృదయాలలో పిడుగులు పడినవి. బాపిశ్రీ వదనము వాడిపోయింది. ఆమె కన్నుల అశ్రువులు తిరిగినవి. శాంతశ్రీ తనలో ఒక్కసారిగా భయంకర తృణావర్తము ఉద్భవించి హృదయమును మనస్సును మెదడును దూదిపింజలు చేసి ఎగురవేసినా, మోమునందు గంభీరత వీడకుండా “చెల్లీ! అలా కంటనీరు పెట్టుకొంటావేమిటి? యువరాజులవారికి రాజకీయ వ్యవహారాలకంటే మనతో ఆటలు ప్రియమటే! చిన్ననాటి నుండీ మనతో ఊసుపోక బాల్యక్రీడలు ఆడినారేకాని యువరాజులవారి కిపుడు మనం కావలెనటే వెఱ్ఱిదానా! వారిని నువ్వు నేను ఆపగలమా?” అన్నది. ఆమె మాటలలో హృదయము కృంగిపోవుట ప్రత్యక్షమయినది.

శాంతిశ్రీ బాపిశ్రీలమధ్య అరమరలు లేవు. ఇరువురు గాఢంగా యువమహారాజ వీరపురుషదత్తప్రభువును ప్రేమిస్తున్నట్లు ఇరువురు నెరుగుదురు. ఒకరి రహస్య మొకరికి దెలిసినదేయనికూడ వారెరుగుదురు. ఇరువురకు ఓర్వలేనితనంలేదు. అతన్ని ప్రేమించడంలో తామిరువురూ ఒకే ఆత్మలోని రెండు ఛాయలనుకున్నారు. శాంతశ్రీ పూంగీప్రోలు మహాపట్టణంలో ఉన్నా బాపిశ్రీని తలవని నిమిషం ఉండదు. బాపిశ్రీ విజయపురంలో ఉంటూ శాంతశ్రీని తలవని నిమేషం ఉండదు. ఇరువురూ యువ రాజును తలపోయని క్షణమంటు ఉండదు. ఆ యిరువురకు వీరపురుషదత్తుడు కుమారస్వామీ, బోధిసత్వుడూ! అతని దివ్యసౌందర్యం వారికి పూర్ణ చంద్రికా ప్రకాశం. అతని మహాశౌర్యం అఖండ సూర్యతేజస్సు. వారిరువురు వీలయినప్పుడు కలుసుకుంటారు. ఇరువురూ తమ జీవిత మధ్యస్థుడైన యువరాజును గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.

ఆ బాలికలు చిన్ననాటి నుండి విజయపుర వసంతోత్సవాలలో యువరాజునే వసంతునిచేసి తాము పుష్పమహారాణులై అతనితో ఆనంద పరవశులై ఆటలాడు కొనేవారు. ఇంతవరకు ఒక సంవత్సరమైనా తప్పిపోక ఈ మువ్వురు వసంతోత్సవానికి అవసంత కుసుమాలై ఆడుకొంటున్నారు. నేడు ఆ వసంతోత్సవము మళ్ళీ అరుదెంచినది. తమ వసంతుడు తమ మన్మథుడు తమ భగవానుడు మళ్ళీ వసంతుడు కావాలి, తాము వనదేవీ, వాసంత కావాలి. మహారాజ పుత్రితో శాంతశ్రీ “వదినా, మేమిరువురమూ, సెలవు పుచ్చుకొంటాము” అన్నది వినీ వినరాని నిట్టూర్పుతో.

శాంతిశ్రీ: అప్పుడే వెడతారా వదినలిద్దరూ? ఎల్లుండి ప్రారంభించబోయే వసంతోత్సవాలకు వాసిష్టిభట్టిదేవి రాకుమారి కళింగమునుండి దాసదాసీజన పరివృతయై మహా వైభవంగా వస్తుందని వారికి అంతకుముందే తెలిసినది. వాసిష్ణులకు ఇక్ష్వాకులైన

అడివి బాపిరాజు రచనలు - 6

25

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)