పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యానశాలకు పోయినది. అప్పటికి అప్పుడే యువమహారాజు మాఠరీపుత్ర వీరపురుషదత్త ప్రభువు నూరు మన్మథుల అందముతో నడిచి వస్తున్నాడు. అన్నగారు దగ్గరకు రాగానే శాంతిశ్రీ వారి పాదాలకు వంగి నమస్కరించింది. చెల్లెలిని భుజములు పట్టి వీరపురుష దత్తుడు లేవదీసి “చెల్లీ, నీతో మాట్లాడవలసిన విషయాలు చాలా ఉండి వచ్చాను” అన్నాడు. “శాంతశ్రీకుమారీ బాపిశ్రీకుమారీ నా చదువుల గదిలో ఉన్నారు” అని ఆమె అన్నతో ననెను. “మరీమంచిది. పదచెల్లీ!” అని రాజకుమారుడు ప్రత్యుత్తర మిచ్చినాడు.

అన్నయు చెల్లెలును లోనికి విచ్చేసినారు. పూంగీయ రాజకుమారి శాంతశ్రీయు, బాపిశ్రీ రాకుమారియు చిరునవ్వులతో సిగ్గు గదురు నెమ్మోములతో నిలుచుండి బావగారికి నమస్కారాలు చేసినారు. వారిని చూచి వీరపురుషదత్తుడు ప్రతినమస్కారాలిడి “మా మరదళ్ళు మేనమామ కొమారితతో ఏకాంత మున్నట్లున్నారు” అని సంతోషాన వికసించిన మోముతో పలికినాడు. శాంతశ్రీ బాపిశ్రీలు మాటలాడకుండ నిలుచుండిరి. శాంతిశ్రీ నవ్వుచు “వదినలు కూర్చోండి! నిలుచున్నారేమి, బావగారు కొత్తవారు కదా?” అనెను.

ఇక్ష్వాకువంశపు ఆడబిడ్డలు, ఇక్ష్వాకు రాజకుమారులు అందాలకు జంబూ ద్వీపం అంతట ప్రసిద్ధి పొందిరి. వీరపురుషదత్తుని అందము జగత్ప్రసిద్దము. ఆయనను ఆపరమన్మథుడని కవులు వర్ణింతురు. అతని మేనత్తలిరువురువారి యవ్వనంలో వేవురు రాజకుమారుల హృదయాలలో ప్రణయాలు ఉద్దీపింపజేసిరి. వారి కొమరితలకూ ఆ అందాలు అబ్బినవి. ఆనలువురదిదేవతలను కురూపులనుగా చేయజాలిన అందము. బాపిశ్రీ మోమించుకగుండ్రము, శాంతశ్రీ మోమించుకకోల. బాపిశ్రీ నుదురు అర్ధచంద్రము. శాంతశ్రీ నుదురు విశాల విశాలము. బాపిశ్రీ కనుబొమలు రెండు ఎక్కుబెట్టిన ధనస్సుకు పూర్వఉత్తరార్ధ దండభాగముల వంటివి, శాంతశ్రీ కనుబొమలు ఆకాశపు వంపుల వంటివి. బాపిశ్రీ నాసిక తిలపుష్పము, శాంతశ్రీ నాసిక శుకనాసిక. బాపిశ్రీ పెదవులు చిన్నవి, పక్వబింబాలు. శాంతశ్రీ పెదవులు మధ్యమాలు. కాశ్మీరకుసుమ రాసులు. బాపిశ్రీ, శాంతశ్రీలు కవలలవలె ఉంటారు. తీర్చిన రేఖలతో పోత పోసిన బంగారు విగ్రహాలు వారివి.

వీరపురుషదత్తుని ఈ బాలికలిద్దరు ప్రేమించుచుండిరి. వీరిరువురను ఆ యువరాజు ప్రేమిస్తున్నాడు. ప్రజాపతులు దక్షిణనాయకులు. పరమేశ్వరీ పరమేశ్వరు అర్థనారీశ్వరులు. ఇక్ష్వాకు శ్రీశాంతమూల మహారాజు గూడ దక్షిణ నాయకుడే. బ్రహ్మదత్తు డేకనాయకుడు. వీరపురుషదత్తుడు సౌందర్యజిత లోలుడు. వీరవిక్రమ విహారంలోను స్కందదేవ సమానుడు. అతని హృదయాన శాంతశ్రీ బాపిశ్రీలు ఇరువురు సమాన స్థానాలు ఆక్రమించినారు.

ఇక్ష్వాకు శాంతిశ్రీ అన్నగారికి శాంతశ్రీని బాపిశ్రీని వేలుపెట్టి చూపించింది. “ఈ ఇద్దరు మహారాజకుమారుని హృదయం దొంగిలించారు. మీ ఇద్దరూ ఒక్కరే ఇద్దరయ్యారా, ఇద్దరూ ఒకటయ్యారా!” అని చిరునవ్వు నవ్వింది.

“వదినా! ఈ అల్లరి ఎక్కడ నేర్చావు? మరి నేనేమి ఎరగనంటావు. నువ్వు ప్రతిజ్జాయౌగంధరాయణం చదవడం మరిచిపోకు. నీ గురువుగారినే చెప్పమను.”

అడివి బాపిరాజు రచనలు - 6

24

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)