పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొడవలేదు. సంగీతం మారుని ఆయుధాలలో ఒకటి” అన్నది అస్పష్ట వాక్కులతో. శాంతశ్రీ బాపిశ్రీలు చిరునవ్వులు నవ్వినారు.

బాపిశ్రీ: వదినా నీకు సంగీతం ఇష్టంలేదంటే నేను నమ్మను. అయినా ఇష్టంలేదని అన్నావు గనుక అడుగుతాను, సంగీతానికి ఏమి దోషం వచ్చిందీ?

శాంతిశ్రీ: దోషం లేకపోలేదు. ఆ దోషం మనం చేసే భోజనంలో, ధరించే వస్త్రాలలో, అలంకరించుకొనే భూషణాదులలో, ఉపయోగించే సుగంధవస్తువులలో, నాసంచేసే ఈ మహాద్భుత అంతఃపురాలలో, జీవించే జీవితంలోనూ అంతటా ఉన్నది.

బాపిశ్రీ: బాగుంది వదినా, స్త్రీ పురుషులందరూ సన్యాసం పుచ్చుకోవాలంటావు నువ్వు.

శాంతిశ్రీ: పుచ్చుకుంటేనేకాని నిర్వాణం లేదుకదా?

శాంతశ్రీ: ఇంక సృష్టి ఎట్లాగు?

శాంతిశ్రీ: సృష్టి అంతా నిర్వాణానికి పోవలసిందే కదా! ఇవాళ కాకుంటే ఏనాటికైనా అది తప్పనిదే.

బాపిశ్రీ: భోజనం?

శాంతిశ్రీ: నిర్వాణ పథం కనుక్కునే వరకూ దేహపోషణ చెయ్యాలి. తర్వాత భోజనం ఎందుకు?

శాంతశ్రీ: వర్ధమాన జినమతం బోధిస్తున్నావా వదినా? నిరాహార దీక్షాప్రతుడై ప్రాణం | బలి ఇచ్చిన వానికి సద్గతి లభించి తీరుతుందంటారు జనులు.

శాంతిశ్రీ: నా మాటలకు అదికాదు అర్థం.

బాపిశ్రీ: కాకపోవచ్చును. కాని తాత్పర్యం ఒకటే కదా? శరీర ధారణం ఎలాంటిదో సర్వవిద్యలూ అలాంటివి కావా? ధాన్యకటక శిల్పం మాట ఏమంటావు?

శాంతిశ్రీ: విద్యలు తథాగతుని అర్చించడానికే అయితే తప్పు లేదంటినిగా.

బాపిశ్రీ: సంగీతంతో ఎందుకు అర్చించకూడదు?

శాంతిశ్రీ: సంగీతం మనం స్వీయానందానికే పాడుకొంటున్నాము. హృదయానందం ప్రాపంచికం. అష్టమార్గాలకు ప్రాపంచికానందం వ్యతిరేకం కాదా?

బాపిశ్రీ: చూచినావా అక్కా వదిన మాటలు?

శాంతశ్రీ: వదిన భిక్కుణి అవుతుందని విన్నాము కాదటే, అది నిజం అని ఇప్పుడు తేలిపోయింది.

7

మువ్వురు రాజకుమారికలు మాట్లాడుచుండగనే ఒక పరిచారిక అక్కడకు వచ్చి “జయము జయము రాజకుమారికలకు! పూజ్యశ్రీ రాజ వసిష్ఠులవారు మహారాజకుమారి నూతన విద్యారంభం, మాఘశుద్ధ పంచమినాడు వసంతోత్సవ ప్రారంభంలో ఉదయం ఘటికా తొమ్మిది విఘడియలకు మేషలగ్న పుష్కర కాలంలో అని సెలవిచ్చినారట. మహారాణి శ్రీశ్రీ సారసికాదేవి మహారాజకుమారికి నివేదింప నాకు ఆజ్ఞ ఇచ్చినారు” అని విన్నవించినది.

అడివి బాపిరాజు రచనలు - 6

22

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)