పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పులకేశి మహాప్రభువు కడకు నారసింహభట్టులవారు సకల పరివారసమేతులై విష్ణుకుండిన మంచన భట్టారకు నేక పుత్రిక నంశుమతీ దేవిని చక్రవర్తి ప్రియానుజులైన శ్రీసత్యా శ్రయ విషమసిద్ది విష్ణువర్ధన మహారాజున కుద్వాహ మొనరింప ననుమతి వేడుటకు వచ్చినారు. తన కత్యంత ప్రియతమమగు నా యానందవార్తను విని, పులకేశి పృధ్వీవల్లభుడు సింహాసనమునుండి దిగివచ్చి నారసింహభట్టు పాదములకు నమస్కరించి, ఆయన హస్తము గ్రహించి, తన యర్థసింహాసనమున గూర్చుండబెట్టు కొనెను.

నార: మహారాజాధిరాజా! సకలభూమండలాఖండలా! మా మహారాజు తమ కూతురి నిచ్చి విష్ణువర్ధన మహారాజులకు వివాహము చేసిన వెనుక తృతీయాశ్రమస్వీకారము చేయుదురట. విష్ణుకుండిన సింహాసనమున కంశుమతీ దేవియేకదా అధికారిణి. ఆమెకు గాబోవు భర్తయైన విష్ణువర్ధన మహారాజు వేంగీ సింహాసనాసీన స్వత్వుడగును. తమ జామాతకు మా మహాప్రభువు మూర్ధాషేక మొనర్చి తాము శ్రీశైలమునకు దపస్సుచేయ బోవునట. తమ యాజ్ఞకు నేను నిరీక్షించుచున్నాను.

పులకేశి మహారాజు "మహాతపస్వీ! ఈ శుభవార్తకై యిన్ని సంవత్సరములనుండియు నెదురు చూచుచుంటిమి. వివాహ పట్టాభిషేకములకు మాప్రతినిధులుగ మా పుత్రులందరును, మా మహారాణియు విచ్చేయుదురుగాక! మాయనుంగు దమ్ముని మనస్సు వశీకరింపగల బాలిక యీ రేడులోకముల లేదను కొంటిమి. అంశుమతీ మహారాజకుమారి అమృతాంశుమతియే!”

వేంగీ రాష్ట్రమున మహోత్సవములు యుగయుగములు కవులు కావ్యములు రచింప దగునంత వైభవముగ జరుగుచున్నవి.

శ్రీసత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహేశ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువన రాజన్యకిరీటాంచిత రత్న కాంతినీరాజిత పాదసరోరుహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ది పలకేశి పృద్వీవల్లభ చక్రవర్తి యనుగుతమ్ముడు, శ్రీసత్యాశ్రయ పరబ్రహ్మణ్య పరమమహేశ్వర అపరత్రివిక్రమ, చాళుక్యకులాభరణ, విషమసిద్ది కుబ్జ విష్ణువర్ధన మహారాజునకును; జనాశ్రయ, పరమబ్రహ్మణ్య పరమభట్టారక, పరమభాగవత, శ్రీవిష్ణుకుండిన మంచనభట్టారక, మహారాజాధిరాజు నేకతనయ యంశుమతీదేవికిని, విష్ణునకు లక్ష్మికిని జరిగినంత మహావైభవముగ వివాహము జరిగెను.

ఆ శుభముహూర్తముననే శ్రీపట్టవర్ధనకులతిలక, కాలకంపన మహాసామంత ప్రభువు కొమరుడు జయనంది ప్రభువునకును, కలతీర్థ మహాసామంత, బృహత్పాలాయన పృధ్వీశవర్మ ప్రభువు కొమరిత మాధవీలతాదేవికిని వేంగీపురముననే వైభవమున వివాహము జరిగెను.

ఆంధ్రమహాభూమి నింకొక్క శుభముహూర్తమున పాళికేతన మెగురుచు దనకాంతుల నింపినది. యజ్ఞవరాహ దేవుడే ఆ మహారాజ్యమును సంరక్షింప లాంఛన రూపమున వెలసినాడు. చాళుక్యుల వెల్లగొడు గంధ్రభూమి నంతయు గప్పినది. పంచ మహాశబ్దము లవతరించినవి. గంగాయమునా కలశములు వెలసినవి. ప్రతిఢక్కా ధ్వానములు మారుమ్రోగినవి. మకరతోరణయుక్తమై చాళుక్యపతాక, కాంతసింహాసనముల

అడివి బాపిరాజు రచనలు - 6

283

అంశుమతి (చారిత్రాత్మక నవల)