పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బాపిశ్రీ: వదినా! మీ విజయపురం వసంతోత్సవానికి నే వస్తే

పూంగీయశాంతశ్రీ: మీ అన్నయ్యగారు ఉజ్జయినికి వెళ్ళుతున్నారటగా? వారు లేని వసంతపంచమి శిశిరపంచమే అవుతుందని భయంగా ఉంది వదినా?

బాపిశ్రీ: మూగదేవుడులా బదులు చెప్పవు. నీకు హృదయము ఏమి అర్థము అవుతుందీ?

శాంతిశ్రీ: చెల్లీ మామయ్యగారు గురువును ఏర్పాటు చేశారు, వదిన ఇక మనతో మాట్లాడదులే!

బాపిశ్రీ: అదికాదే అక్కా! గురువు దగ్గర అంచక్కగా చమత్కారాలూ అవి నేర్చుకొని ఇక మనలను మాటాడనే మాటాడ నివ్వదు.

పూంగీయశాంతశ్రీ: అవునవును. చదువుల సరస్వతై పోతుంది కాబోలు.

బాపిశ్రీ: అప్పుడు రతీదేవికే పాఠాలు నేర్పుతుందేమో?

ఇక్ష్వాకుశాంతిశ్రీ: ఏమో మీ మాటలు నాకు తెలియవుగాని నిజం చెబుతాను వినండి. నాకు ఆనందులవారి దగ్గర చదువుతప్ప ఇంకో చదువు అక్కరలేదు. అయినా మహారాజు ఆజ్ఞ పరిపాలింపక తప్పదు.

బాపిశ్రీ పూంగీయశాంతశ్రీ లిద్దరు శాంతిశ్రీ మాటలకు తెల్లబోయి నారు. వరి వారి తల్లుల అంతఃపురాలలో వినవచ్చిన విషయం ఒకరీతిగా, ఇప్పుడు శాంతిశ్రీ అనే విషయం వేరుగా ఉంది అనుకున్నారు. శాంతిశ్రీ వేళాకోళా లెరుగదు. ఎంత వేళాకోళం చేసినా, ఆ హాస్యాన్ని నిజము క్రింద భావించుకొంటుంది.

శాంతిశ్రీకి సంగీతం నేర్చుకొనుట తప్పుగా తోచినది. ఆవిద్య ఏనాడూ నేర్చుకోవాలని కోరలేదు. పాటలంటే విసుగువచ్చేది. కవిత్వమంటే ఆమెకు తలనొప్పి, కాని బోధిసత్వుని పరమపవిత్ర జాతక గాథలు ఎంతో ఆపేక్షగా చదువుకొంటుంది. సంగీతమూ, శిల్పమూ, చిత్రమూ బుద్ధదేవుని అర్చించడానికే అయితే సరేనట. అట్లు ఉపచరించని సంగీతము, నాట్యము బుద్ధధర్మాధిరతులకు పనికిరావట. అయినా శాంతిశ్రీ మహారాజకుమారి కంఠంలో అమృతాలు వాకలు కట్టుతవి. ఆమె మాటలే మధురము. ఆమె ఏదో రాగధోరణిగా వినయాది త్రిపీఠకాలు, ధర్మసూత్రాలు చదువుతూ ఉంటే వినేవారు “ఇంతకన్న దివ్యగాంధర్వం ఏమి కావాలి?' అని తన్మయులై పోదురు.

వాసిష్టీపుత్రిక శ్రీపూంగిరాణి శాంతశ్రీదేవికీ, ఆమె చెల్లెలు హమ్మశ్రీదేవికీ భౌద్ధధర్మం అంటే వెఱ్ఱి ఆపేక్ష లేదు గానీ బుద్దదేవునియందు భక్తి మాత్రం ఎక్కువే. వాసిష్టీ పుత్రిక శాంతశ్రీదేవి కొమరిత శాంతశ్రీ రాజకుమారికిన్నీ హమ్మశ్రీదేవి కొమరితలు బాపిశ్రీ షష్టిశ్రీ రాకొమరితలకున్నూ ఏదేవునియందు అంత భక్తిలేదు. శాంతశ్రీ బాపిశ్రీలు ఎలజవ్వనులు; షష్ఠిశ్రీ ఇంకా జవ్వనంలో అడుగుపెట్టుచున్నది.

అల్లరిపిల్ల శాంతశ్రీ రాకుమారి మహారాజకుమారిని చూచి, “వదినా ఒక్కపాట పాడవమ్మా” అన్నది. మహారాజపుత్రి శాంతిశ్రీని రెప్పవాల్చకుండా అయిదు నిమేషాలు చూచి నిట్టూర్చి, రెప్పలు వాల్చి, “వదినా! నాకు సంగీతమంటే ఇష్టంలేదు. మీరు భరత సూత్రాలు కూడా నేర్చుకున్నారు. మీరు ఆ విద్యలవే సభారం జనం చేయగలరు. నాకా

అడివి బాపిరాజు రచనలు - 6
అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)
21