పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విష్ణువర్ధనుని గుంభమిత్రుడు గదతో ముక్కలు చేయుటకు దాని నెత్తిన క్షణముననే “ఛీ! రాక్షసుడా! నాప్రభువు పైననే గదనెత్తుట” అని అంశుమతీకుమారి యాడుపులియై యొక్క విదల్పున దన్నదిమిపట్టిన చేతులు విదల్చుకొని, విష్ణువర్ధనుని ముందున కురికి, యా ప్రభువును వెనుకకు నెట్టి వేసినది. కుంభమిత్రుడు కన్నులింతలు చేసికొని, “ఆ! నిన్ను బూవులలోబెట్టి కొనిరమ్మని నా ప్రభువు సెలవిచ్చినాడు. ఒక్క క్షణమున్నచో నీవు తుత్తునియలైపోయి యుందువు” అని యరచి యెత్తినగద నట్లనే యుంచినాడు. ఆ క్షణికమాత్ర సమయములో విష్ణువర్ధనుడు ఛంగున కుంభమిత్రుని కంఠముకడ కురికి, తన ఛురికను నాతని భుజమున పిడివరకును దింపి వేసినాడు,

“అమ్మో” యని, చేతిగద జారిపోవ, నెడమచేతితో గుంభమిత్రుడు కుబ్జవిష్ణుని బట్టుకొనబోయినాడు. విష్ణువర్ధను డచటలేడు. కుంభమిత్రుని నడుమున గట్టిన మహాఖడ్గము విష్ణువర్ధనుడు చఱ్ఱునలాగి వేసి, యెంతవేగమున ముందున కురికెనో, యంతవేగమున వెనుక కురికినాడు. ఆ ఖడ్గము విష్ణువర్ధను నంతయున్నది. ఆ మహావీరుడు రెండుచేతుల నాఖడ్గమును మెఱుపు వేగమున బ్రయోగించుచు, దిరిగి యంశుమతిని బట్టుకొని యెత్తుకొని పరుగిడిపోవు ముష్కరుల వెన్నాడెను.

అంత కొక్కక్షణము ముందుగనే మాధవీలతకు నోట గుడ్డలు గ్రుక్కి నలుగురు ముష్కరు లెత్తుకొని పారిపోవుచుండిరి. విష్ణువర్ధనుని వేగము నిరుపమానము. అంశుమతిని బట్టిన యొకని తల డుల్లిపడిపోయెను. తక్కిన యిరువు రామెను క్రింద జారవిడచి, పలాయనమంత్రము పఠింప నుద్యుక్తులైరి కాని యొకని చేయి తెగిపడినది. రెండవవాడు రెండు తుండెములై పడిపోయినాడు.

ఆ ఖడ్గమును భుజమున ధరించి మరుక్షణమున చిందువువలె నా ప్రభువు తోట ద్వారమును దాటి ప్రక్కతోటలో బరుగిడిపోవు ముష్కరులను సమీపించినాడు. అచ్చట విష్ణువర్ధను నిరువదిమంది విరోధులు ముట్టడించిరి.

పడిపోయిన యంశుమతి చివ్వునలేచి విష్ణువర్ధన మహారాజు విడిది చేసిన భవనము దిశకు బరుగెతైను. ఆమె కేకలు విని, జయనందియు గొంద రంగరక్షకులును దోటలోనికి బరుగిడి వచ్చిరి. “మహాప్రభూ! - దొంగలు - రక్తము ఎత్తుకొనిపోయిరి” అని చెప్పుచునే అంశుమతి మూర్చపోయినది.

జయనంది అంగరక్షకు నొకని జూచి రాకుమారి కుపచారము సేయ బరిచారికల బిలువు మన చిప్పి శంఖ మూదుమని దళవాయి నొక్కని కాజ్ఞ యిడెను. ఆతడప్పుడే శంఖము తీయుచున్నాడు.

“భోం, భోం, భోం,” అని శంఖధ్వానము దెసలు నిండినది. అచ్చట కావలియున్న అంగరక్షక సైనికులు జయనంది కడ కురికిరి. జయనంది వేగముగ మామిడితోట వైపునకు బరుగిడ నారంభించెను. అతని వెనుక అంగరక్షక సైనికు లర్థచంద్ర వ్యూహముగ బరుగిడ నారంభించిరి.

శంఖధ్వానము లొకటి కొకటి యుప్పందించుకొనినట్లు ఆ తోటల నావరించి, మహికుడ్యమున కావలను “భోం భోం” అని నినదింప సాగినవి. ఎచ్చోటు జూచినను నంగ రక్షక సైన్యములు నిండిపోయినవి.

అడివి బాపిరాజు రచనలు - 6

281

అంశుమతి (చారిత్రాత్మక నవల)