పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“నీతో జెప్పి వచ్చుటకు నీవు కనబడవైతివి. వారి గలసికొనగలనని నమ్మకమున్నది. కలిసి కొంటిని.”

“ఆయన యెవ్వడో తెలియునా నీకు?”

“ఎవ్వరైన నేమి! ఉత్తమ చరిత్రుడు”

ఆ బాలిక లిరువురు నంతఃపురములోనికి వెడలిపోయిరి.

“ఇదియిది” యని తెలియరాని యాలోచన లెన్నియో యుద్భవించి యాప్రభువును గలతవెట్టుచుండెను. తానెవ్వరో ఆ బాలిక యెరుగునా! విష్ణుకుండిన రాజకుమారి జగదేకసుందరియని విని, తనయన్నగారు వివాహము చేసికొమ్మని తన్నెన్నిసారులో కోరినారు. కాని తన రాజ్యమున దన్ను ప్రేమింపవచ్చు నాడది యుండునా! ప్రేమలేని వివాహమును తానెట్లొప్పుకొనగలడు! కాని యీబాలమాటలలో నసత్యము గోచరించదు. తన కెట్లీ సందిగ్ధావస్థ తీరును.

స్వచ్చజీవనయగు విజనప్రదేశపుష్పము నొకదానిని సేకరించగలిగితినని కొంత యానందపులకితుడనైన మాట నిజము. కాని యీపుష్పము రాజోద్యానమున ఉద్భవించినదేకదా!

ఆ రాత్రి మాధవీలత మంచనభట్టారక మహారాజు కడకు బోయి, మహారాజును దర్శించి వారితో నంశుమతీ కుమారి కుబ్జ విష్ణువర్ధనునే ప్రేమించుచున్నదనియు నాతడొక సామాన్య సామంతు డనుకొనియే ఆయనను ప్రేమించిన దనియు, నా ప్రేమకు విష్ణువర్ధన చాళుక్యుడును సముఖుడై యున్నట్లు భావించవచ్చుననియు, నాతడును అంశుమతి యొక సామంతుని కొమరితయని తెలిసియు ననుకూలుడుగ నుండెననియు నా సామంతనమే తాను విష్ణుకుండిన మహారాజు పుత్రికనని యంశుమతి విష్ణువర్ధనునికి దెలిపెననియు జెప్పెను.

మహారాజు నానందమునకు మేరలేకపోయెను. వెంటనే యామహారాజు తన దేవేరి మందిరమునకు బోయి “దేవీ! నేనింత కాలమును వృధాభయములకులోనై గురువుగారిని జాతకము లడుగుచుంటిని. అమ్మాయి ప్రేమించినది విష్ణువర్ధనమహారాజు” అని తెలిపెను.

“మహాప్రభూ! విష్ణువర్ధనమహారా జిందుకు సుముఖుడేనా!”

“సుముఖుడైనట్లు సౌభాగ్యవతి మాధవీలత చెప్పుచున్నది.”

మహారాజు యంతఃపురపు బరిచారికలకు సంతోషమున బహుమతు లర్పించినది. మంచెన భట్టారక మహాప్రభువు ఉదయమున సకలాలయములయందును నర్చనలు జరిపింపుమని తన యాంతరంగికుడగు గంచుకికి నానతి యిచ్చెను. ఆ రాత్రి యెవరికిని నిదుర పట్టలేదు.

మరునాడు సాయంకాలము బంగారు నీరెండలు తోటలలో దోబూచులాడుచు బరుగులిడుచున్నవి. ఆకసమున బసిమిరంగు కుంకుమరాగమలముకొనుచున్నది. సాయంకాలము సకలవర్ణములకు నిలయము సంధ్యా నటేశ్వరుని తాండవక్రీడా

అడివి బాపిరాజు రచనలు - 6

279

అంశుమతి(చారిత్రాత్మక నవల)