పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాను భర్తృదారిక స్థితిని భయము నిండిన మాటలతో నా మహారాజునకు జెప్పునపు డాతని పీఠముదాపున నిలబడి సమున్నతాంగుడై, గంభీర తేజస్వియై, తన దిక్కుదయార్ధ్ర దృష్టిని బరపి, తన్ను కులీనయగు బాలిక యని గ్రహించి చూపులు క్రిందికి వాల్చివేసిన యొక పురుషమూర్తి యీనాడు తన మనో గగనమున దళ్కుమని మెఱసినాడు. ఆ సంభ్రమస్థితిలో నాత డెవడో తనకు డెలియకపోయినను యా పురుషపుంగవు విగ్రహము మాత్రము మనస్సున స్పష్టముగ జిత్రింపబడినది. ఆతని గూర్చి యాలోచించుటకే యా బాలిక సిగ్గుపడినది. అట్లాలోచించుట తన చెల్లి గ్రహించునేమో యని ఆమె చకిత యగుచుండెడిది. తన రాజకుమారికి బరిచర్యలు సేకూర్చుటలో నిమగ్నమైన యా బాలిక హృదయమునుండి యా పురుషవిగ్రహము గుప్తమైపోయినది. నే డా పూరుషుడు మఱల దోతెంచుటకు గారణమేమి!

ఆమె కన్ను అర్ధనిమీలితము లైనవి; మెల్లగ బూర్ణ నిమీలితము లైనవి. మరల గన్నులు పూర్తిగ దెరచినంత నాబాలికయెదుట, లోనిమూర్తియే బ్రత్యక్షమగుట చూచి, పగటికల యనుకొనుచు గలలు దిరుగు కన్నులతోడనే యామూర్తి నామె తిలకించుచుండెను తన వెనుక కొలది యలికిడి యగుట గ్రహించి, వెనుకకు దిరిగి, పరిచారిక లిరువురు నిలబడియుండుట నామె కనుగొన్నది. మఱల మోము త్రిప్పి యెదుట జూడ నామూర్తి తన్ను దీక్షణముగ జూచుచు నిలిచియుండుట గననయ్యెను. ఆమె యాశ్చర్య మందుచు చుటుక్కున నిలుచుండెను.

అప్పు డా యువకుడు చిరునవ్వు నవ్వుచు "రాజకుమారీ! క్షంతవ్యుడను. ఇది శుద్దాంతజనముల తోటయని అనుకొనలేదు. నన్ను “జయనంది” యందురు. ఈ పట్టణపు దోటలు బహు సుందరములును, ఫలపుష్పపూర్ణములును, కనుగొన నా కెంతయో ముచ్చటపుట్టి యొంటిగా నీ తోటలోనికి వచ్చితిని. నేను సెలవుతీసికొనెద" నని యా యువకుడు మనవి చేసినాడు.

“చేయరాని పనిజేసి క్షమార్పణవేడుట పశ్చిమదేశముల వారి యాచారము కాబోలు” నని మాధవీలత కొంచెము చురుకుగనే పై కన్నది.

ఆ యువకుడు కలత నొందని మోముతో జిరునవ్వు నవ్వుచు, “మేము చేయరాని పనుల జేసెడివారమని యేకవి గ్రంథము వ్రాసినాడు? అని ప్రత్యుత్తర మిచ్చెను.

“క్షమించదగినవా రెవరో తెలిసికొనక క్షమించుటెట్లు?” అని మాధవీలత తలవంచుకొనియే పలికినది.

“మా జనకులు పట్టవర్ధన కాలకంపన ప్రభువులు, శ్రీ విష్ణువర్థన మహారాజాధి రాజులకు సర్వసేనాధిపతులు. నేనా మహాప్రభువు ఉపసేనాధిపతులలో నొకడను.”

“ఓహో యెంత చరిత్రయున్నది! తోటల దిరుగుటను గూర్చి యావల నాలోచింతము. చాళుక్యసేనాపతులకు దమ ప్రభువును యుద్ధమున వదలి తోటలు, పేటలు, బాటలును జూచుట యలవాటు కాబోలు!”

“అంతియ కాదు ఆ తోటలో నీటుకత్తెలగు రాకొమరితల దర్శించుటయు నలవాటు.”

అడివి బాపిరాజు రచనలు - 6 • 273 •

అంశుమతి (చారిత్రాత్మక నవల)