పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17

విష్ణువర్ధనుడు మహావేగముతో సైన్యములను నడిపించుకొనుచు రెండుదినములలో గృష్ణాతీరమునకు వచ్చి విజయవాటికను ప్రవేశించెను. ఆ నగరమున వేంచేసియున్న మల్లేశ్వరస్వామిని గనకదుర్గాంబను అర్చించి, బౌద్ద సంఘారామములకు నివేదన లర్పించి, యా సాయంకాలముననే కృష్ణ దాటెను.

కాలకంపనప్రభువుకుమారుని పట్టవర్థన జయందిని దనకు బ్రతినిధిగ గొలది సైన్యములతో విజయవాటిక యందుంచి విష్ణువర్థనుడు ఇంకను మహావేగమున కర్మకరాష్ట్ర భాగములైన వెలనాటిని, గొండపడమటి రాజ్యమును, గొండతూర్పురాజ్యమును, పోక రాష్ట్రమును జయించు కొనుచు, దక్షిణమునకు సాగినాడు. విష్ణువర్ధనూ నెదురులేని యా వేగమున సామంతు లొకరి వెనుక నొకరాతనికి పాదాక్రాంతు లగుటయ బల్లవ మహారాజగు రాజేంద్రవర్మ కెప్పటి కప్పుడు వేగు వచ్చుచునే యున్నది. మహేంద్రవర్మ రెండవ పులకేశి నెదిరించి యోడిపోయినాడు. పులకేశి పృధ్వీవల్లభునకు దాను గప్పము గట్టినాడు. ఆతడు మహా విక్రముడు. ఇప్పుడు మహేంద్రవర్మ కుమారుడు యువమహారాజు నరసింహవర్మ యనేక దిగ్విజయములు గాంచుచు దక్షిణమున జోళులను, పడమట గాంగువాడి రాష్ట్రమున దక్షిణ గాంగులను, వనవాసి కదంబలను, వాతాపిచాళుక్యులను, ఉత్తరమున విష్ణుకుండినులను దమదమ రాజ్యపుటెల్లలలో నిలువరించి, దండ్రి మహేంద్రవర్మ మహారాజు కాంచీపురమున సుఖ సంవిధానమున రాజ్యముసేయు నరువు చేసినాడు.

యువమహారాజు చాళుక్య విష్ణువర్ధనుండు కృష్ణదాటి పల్లవ సామ్రాజ్యమును బ్రవేశించి నిరవరోధవేగమున వరదలు పొంగిన గంగవలె బ్రవహించి వచ్చుచున్నాడు. ఆ రాష్ట్రములకు నంగరక్షకదళాధిపతి బుద్ధవర్మను సామంత పట్టాభిషిక్తుని చేసినా డతడు. వనవాసి కదంబులును, కందనోలు చాళుక్య రాజప్రతినిధి పులకేశి పృధ్వీవల్లభ మహారాజు మూడవ కుమారు డాదిత్యవర్మయును గలసి పల్లవరాజ్యముపై నెత్తిరాగా, యువరాజు నరసింహవర్మవారి నెదిరించుటకు వెడలియుండెను. ఆ సమయముననే పిట్టపిడుగు వలె నీ గుజ్జురాజు పల్లవ రాజ్యమును సగముభాగమాక్రమించుకొని విక్రమసింహపురము వరకును వచ్చినాడు. పల్లవ మహారాజు మహేంద్రవర్మ వృద్దుడు. ఆ మహారాజు సేనాపతులలో వ్యూహరచనా సమర్థుడై, విష్ణువర్థను నెదుర్కొను పోడిమీ గల వీరు డెవ్వడును లేడు.

మహేంద్రవర్మ గత్యంతరములేక విష్ణువర్ధనుడు కాంచీపురముపై విరుచుకొని పడనున్నాడని, కుమారుడైన నరసింహవర్మకు వేగు పంపినాడు. నరసింహవర్మ అడకత్తెరలో పోకయై గజిబిజి పడిపోయెను. ఈ వైపు కదంబులను, ఆదిత్యవర్మను జయింపకుండ విష్ణువర్ధన చాళుక్యు నెదిరించుటకు బోయినచో వీరును వారును గూడ గాంచీపురముపై నొక్కసారిగ విరుచుకొని పడుట సంభవించును. తానును తన సైన్యములును హతులై నాశన మందవలసి వచ్చును. కావున దనకు గర్తవ్యము? కదంబులను, జాళుక్యులను నోడించుటయే. ఆ వెనుక విష్ణువర్ధనుని పని పట్టించవచ్చును.

అడివి బాపిరాజు రచనలు - 6

268

అంశుమతి (చారిత్రాత్మక నవల)