పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 “ప్రాణసఖీ! ఈ రహస్యము నీకు బాధ గలిగించునది కాదు. దీని నంటివచ్చు పరిణామములు నీకు బాధా కరములు గావచ్చును. అదే నా యాలోచన. విష్ణువర్థన మహారాజు చాలా బొట్టివాడు. తాను చాళుక్య చక్రవర్తికి దమ్ముడగుటచే నేరాజకన్య యైన దన్ను వివాహమాడుటకు సమ్మతించునేగాని, ఇసుమంతయుదన్ను ప్రేమించబోదని భయము వారిని పీడించుచున్నదట. అందుకని ఆ మహారా జింతవరకును వివాహము చేసికొనుటకు నిరాకరించెనట. ఈ విషయము మన పరిచారికలలో గనకాంగి యనునది గ్రహించి నాకు జెప్పినద."

“ఈ విషయము దానికెట్లు తెలియవచ్చినది?”

పిష్టపురము విష్ణువర్ధనుని హస్తగతమైన రెండవ దినమున మన పరిచారిక లందరును గోవూరునుండి పిష్టపురమునకు వచ్చిరి గదా!”

"అవును.”

“ఆ వచ్చినవారిలో గనకాంగియు నున్నది. విష్ణువర్ధను సంగరక్షక దళపతులలో నొక డామె కీ రహస్యము తెల్పినాడట.”

“ఇది నిజమైనచో నాకు బాధ యెట్లగును?”

“నిజమైనచో నీకు బాధగలుగదు. ఇది వట్టియూహా జనితమైనచో నీ మనస్సంకటమునకు బరిమితి యుండదు.”

“విష్ణువర్థన మహారాజంత పొట్టివాడా!”

“అవును! అందుకనియే వారికి కుజ్జవిష్ణువర్ధనుడని పేరు వచ్చినదట.”

“అందుకనియే కాబోలు -”

“ఏమిటందుకనియే కాబోలు?. నాతో జెప్పగూడదు కాబోలు”

“నీకు జెప్పక దాచగలనా! పిష్టపురమును చాళుక్యులాక్రమించిన నాలుగు దినములకు గదా నాకు బూర్తిగా బలము కలిగినది! ఒక దినమున నేనంతఃపురోద్యానమున విహరించుచుంటిని. అప్పుడొక యిరువది యిరువదొక సంవత్సరముల యీడుగల యువకు నొకని దర్శించితిని, ఆయన నామము ప్రియదర్శి' యట.”

“ఇదంతయు నాకు దెల్పితివి కాదటమ్మా!”

“ఆతనియందు నా మనస్సు లగ్నమైనదని చెప్పితిని. ఆ మహాభాగుడును దన యీడుకు దగిన పొడుగరి కాడు, అదియే నేను తెల్సునది.”

“నీ యుద్దేశము విష్ణువర్ధన మహారాజు తాను బొట్టి వాడగుటచే తన పరివారమున గూడ బొట్టివారినే చేర్చు కొనుచున్నాడని.......!”

“పొట్టిపొడుగులకును బ్రేమకును సంబంధమేమి చెలీ!”

“ఇంతకును నెవరో యా సామంతరాజకుమారుడు!”

ఆకసమున జిరుమబ్బులు పొడసూపినవి. అవియు వెన్నెలలో దడియుచు దెల్లందనమును దాల్చినవి. ఇంతలో “భర్తృదారికకు భోజనమునకు వేళయైనది, వడ్డనకు నాజ్ఞ వేడుచున్నాను” అని పరిచారిక యొకర్తు మనవిచేసికొన్నది. “వచ్చుచున్నాము. వడ్డనకు సన్నాహములు చేయవచ్చు” నని పరిచారికకు సెలవిచ్చి యంశుమతి లేచినది. మాధవీ లతయు లేచినది.

అడివి బాపిరాజు రచనలు - 6

267

అంశుమతి (చారిత్రాత్మక నవల)