పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుభము తనకు సన్నిహిత మగుచున్నదని దినమంతయు దన కంతర్వాణి బోధించి నట్లయినది. చిత్రరథస్వామి పూజలో దివ్యతేజస్వరూపుడైన యా దేవుడు జాజ్వల్యమాన కాంతులు ప్రసరించుచు దనకు బ్రత్యక్షమైనట్లైనది. ఇంతలో జలిపిడుగువలె దన తల్లిదండ్రుల సంభాషణ తెలియవచ్చినది. ధర్మహృదయ యగు స్త్రీకి దనకు గారాని పురుషునియందు మనస్సు లగ్నమగు టెట్లు!

"రాజకుమారీ! ఒక్కరు నేమి సేయుచున్నారమ్మా! పరిచారిక లెవ్వరు నుండరాదని యాజ్ఞ పెట్టితిరట” యనుచు చెలి మాధవీలత యచటకు వచ్చినది.

“మాధవీ! వచ్చితివా! పరిచారికల పొడిమాటలు నాకు విసువు గలిగించుచున్నవి. ఆకాశమును, జంద్రుడును మన కందిచ్చు భావములు నిశ్శబ్దములయ్యు మధురములు గదా!”

విష్ణువర్ధనమహారాజు మన మహాసభకు వచ్చినప్పటి వైభవమును జూచుటకు మీరు రాకపోతిరి

“అవును మాధవీ! విష్ణువర్ధన మహారాజుతో గలిసి యా బాలకుడు వచ్చునో రాడో! నా హృదయమంతయు నీకు సంపూర్ణముగ దెలిపికొనియుంటిని. నా హృదయ మిసుమంతయేని దెలియని తల్లిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహారాజున కీయ సంకల్పించినారట!”

“ఔనమ్మాఔను. మనము గోవూరునుండి వచ్చినది మొదలీ విషయమును గురించి యంతఃపురము నందు భాషించుచున్నారట. రాజుల రహస్యము లన్నియు బరి చారికలకు దెలియకుండుటెట్టు! మహారాజున కిది గాటమగు గోర్కెగా బరిణమించినది. మహారాణియు దలయూపిరట. నారసింహభట్టులవారు, మహారాజుగారి యాలోచన లెస్స యనిరట. విష్ణువర్థన మహారాజు మన నగరమునకు విచ్చేయుటయు నందుకు శుభశకునమట! కాని, వీరందరికి నొక పరమరహస్యము తెలియదు.”

“ఏమిటది?”

“అది నాకనుమాన మాత్రము సుమా రాజకుమారీ! నే నది తమకు విన్నవించుట మంచిది కాదేమోయని సందేహించుచున్నాను.”

“మాధవీ! నీవును నేనును జిన్నతనము నుండియు నొక్కచో బెరిగిన వారము. ఒక గురువునొద్ద విద్య నేర్చిన వారమును. ఒకచో బండుకొంటి మొకచోట నిదురగూరితిమి. నీకును నాకును రహస్యము లెక్కడున్నవి!”

“అవునమ్మా అవును. కాని, యెంత స్నేహము సల్పినవారమైనను తమతమ ప్రణయవిషయముల నొకే మార్గమున నెట్లు సంచరించగలము! నాకు దెలిసిన విషయము నే ననుమానించుచున్న విషయమును నీ హృదయమున నినుపముల్లువలె గ్రుచ్చుకొను నేమోయని భయము నందుచున్నాను.”

“ఆ రహస్య మెప్పుడైన నాకు గంటకమగునుగదా! ఈ పూట దాని బారినుండి నీవు తప్పింతువు. రేపది వేఱొక మార్గమున నాకు ఎదురగును. నా ప్రాణమిత్రమవగు నీ నోటనుండి యా మాటవిని యా బాధ నీ సమక్షమున ననుభవించుట నాకు సుకరమగును.”

అడివి బాపిరాజు రచనలు - 6

266

అంశుమతి (చారిత్రాత్మక నవల)