పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాధారణ రాజకుమారులు పరిచర్యలన్నియు దాసీజనముల వలననే పొందుదురు. విలాసవతులును, నందకత్తెలను నగు బరిచారిక లా రాజకుమారుల కనుసన్నల మెలగు చుందురు. కాని విష్ణువర్ధనుడు శైశవమునందే తన్ను బెంచు దాదులను నిరసించువాడు. ఆడువా రాతని కంట బడగూడదు. అట్లని యాతడు స్త్రీవిద్వేషియు గాడు.

ఇట్టి చిత్తవృత్తి గలిగిన విష్ణువర్ధను డెటుల పిష్టపురమున నాబాలికను బలుకరింపగలిగినాడో యాతనికే ఆశ్చర్య మొదవినది. కళింగ జైత్రయాత్రా దినములలో, నప్పుడప్పుడా బాలిక యాతని మనఃపథమున బ్రత్యక్షమగుచుండెడిది. ఆ భావము నాతడు వెంటనే సాలెగూటి దారములను దులిపివేసినట్లు దులిపివేసికోనువాడు నేడు వేంగీపుర మునకు వచ్చుటచే గాబోలు తన యంతర్వృత్తియం దట్లు చొచ్చుకొని యా బాలికను గూర్చిన తలపులు వచ్చుచున్నవి. ఆ బాలిక యిప్పు డేమి సేయుచుండును! రాజకుమారితో మంతనము సలుపుచుండును గాబోలు. మహారాజులకు మాత్రమే అనన్య సౌందర్యవతులగు బాలిక లుద్భవింతురను కొననక్కరలేదు. తక్కువలోతుగల సముద్ర భాగములందే అనన్యమైన ముతైములు దొరకును.

ఏమిటికో యీ యాలోచనలు తనకు! తనకును నా బాలికకును నేమి సంబంధము! తూర్పుతీర రాజ్యములలో బలవత్తరము పల్లవసామ్రాజ్యము. అది యెప్పటికప్పుడు ప్పొంగుచు నుప్పెనవలె బైకెగయుచు, బ్రాంతీయరాజ్యములపై విరుచుకొని పడుచుండును. పల్లవులవలన నెన్ని రాజ్యము లస్తమించిపోలేదు! త్రినయన పల్లవుడుగదా, తన ముత్తాత తాతగారైన విజయాదిత్యునితో యుద్ధములు చేసి యనేక పర్యాయములోడి తుద కాతని జంపివేసెను ఏమైనను బల్లవులు దండార్హులు. వారిని గాంచీపుర రాజ్యములోనే బంధించి వేయవలసి యున్నది. ఆతడొక నిట్టూరుపు విడిచినాడు.

16

చాళుక్య విష్ణువర్ధనుడు రాజోద్యానమున వివిధాలోచనల పాలయిన సమయముననె, అంశుమతీకుమారి తన యంతఃపురసౌధోపరిభాగమునందు రత్నకంబళముపై నధివసించి, దిండ్లనానుకొని, యా ఫాల్గుణ శుద్ద దశమీచంద్రు నవలోకించుచు, వెన్నెలలు చెట్లకొమ్మలపై ఆకులపై నృత్యము చేయుట గనుగొనుచు నాలోచనాధీనయైనది.

తండ్రిగారికి విష్ణువర్ధన మహారాజును జూడగనే మనస్సార్ధ్రత జెందినదట! ఈ మహావిక్రముడు తన కల్లుడైనచో విష్ణుకుండిన చాళుక్య వంశ సంజాతులైన మహాపురుషు లుద్భవించి, లోకోత్తరమైన మహదాంధ్ర సామ్రాజ్యము నిర్మింతురని యాశించుచుండిరట!

అందుకు తల్లిగారు “ఒకనాడు యావదాంధ్రసామ్రాజ్యము జగద్వైభవముగ నేలిన విష్ణుకుండిన వంశమునకు జివరికొమ్మగ నుద్భవించిన అంశుమతి యొక సాధారణ సామంతబాలుని పరిణయమాడుట తమ రాజవంశమునకు దీరని కళంక” మని పలికిరట.

ఈ సంభాషణ మంతయు దన యాంతరంగికురాలగు చేటిక యోర్తు తనకు నివేదించినది. ప్రత్యూషము నుండియు దా నానందముచే నుప్పొంగిపోయినది. ఏదియో

అడివి బాపిరాజు రచనలు - 6

• 265 •

అంశుమతి (చారిత్రాత్మక నవల)