పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“అవును మహాప్రభూ! కాళింగు లెప్పుడును దురాశ కలవారు. మా రాజ్యమునకును, వారి రాజ్యమునకును తీవ్రమైన పోరాట మేన్నండును లేదు. గోదావరీనది సరిహద్దుగ నేర్పరచుకొనుచు, నెన్నియో పర్యాయములు వేంగీ రాజ్యమునకును, కళింగరాజ్యమునకును సంధి జరుగుచుండెడిది ఆ సంధిని భగ్నపరచినవా రెప్పుడును గాళింగులే. యువ మహారాజా! మీరు మా వేంగీనగరమును దమ యావాస నగరముగ జేసికొనుడు. ఇచ్చటనుండియే తా మటు ఈశాన్యమున గళింగగాంగులను, దక్షిణమున బల్లవులను అణచి యుంచువచ్చును.”

“కృతజ్ఞుడను మహాప్రభూ! విష్ణుకుండిన సామంతులే కొందరు తిరుగుబాటులు చేయుచున్నారు. గృధలవాడ రాష్ట్రాధిపతి పల్లవ వంశీయుడు. తాను కాంచీపుర పల్లవ మహారాజునకును, నిటు తమకును గప్పము కట్టక, తాను భట్టారక శబ్దము వహించి స్వాతంత్ర్యము బ్రకటించుకొన్నాడని వేగువచ్చినది. అట్టి వారందరు తిరిగి తమకు గప్పము గట్టగలరు.”

ఈ విధముగ గుశల ప్రశ్నము లనేకములు జరిగినవి. ఆ వెనుక విష్ణువర్ధనునకు మహారాజు సగౌరవముగ వీడ్కోలిచ్చెను. ఆ రాత్రి విష్ణువర్ధనుడు తన విడిదియం దొంటరిగ గూర్చుండి వివిధాలోచనములకు లోనయ్యెను. తాను విష్ణుకుండిన మహారాజుకడ గప్పము గైకొనుటయా! మానుటయా! తాను పిష్టపురమునా, లేక విష్ణుకుండిన నగరమునా స్థిరనివాసము చేసికొనుట! పల్లవులకు బుద్దిగరపుటకు దాను కాంచీపురమువఱకు బోవలయునా, లేదా! అప్పటి కైదు సంవత్సరములకు పూర్వము పల్లవులు, చోళులు, పాండ్యులు నందరును 'దాసోహ'మ్మని కప్పములు గట్టుకొన్నారు తన అన్నగారికి.

అన్నగారు “తమ్ముడా! ఎప్పుడో యొకనాడు ఆంధ్ర మహాసామ్రాజ్య భాగమైన చళుక రాష్ట్రమునుండి వచ్చిన వారమే మనము. ఆంధ్రరాజులు పౌరుషవంతులు. వాతాపి నగరమున నుండి ఆంధ్ర రాజ్యములను లోబరుచుకొని యుండుట యెంతటి వీరుడైన వానికిని దుస్సాధ్య మగుచున్నది. పెద్దతమ్ముడు జయసింహప్రభువు ఘూర్జరమున సుస్థిరమగు రాజ్యమును నెలకొల్పి యున్నాడు. నీవు తూర్పుతీరమున మూడవ చళుక్య రాజ్యమును స్థాపింపుమయ్యా! నీకు శ్రేయమగును" అనుచు దన్నాశీర్వదించినారు. తానట్టి రాజ్యమును నిర్మింపగలుగునా!

తనకు సరియైన సైన్యమున్నచో, నెదిరి యెట్టి దిట్టయైనను యుద్ధమున దా నసమాన విజయ మొందగలడని యాతని కెప్పుడును ధైర్యమే. తా నింతదనుక నన్నగారికి ప్రతినిధిగమాత్ర మున్నాడు. రాజప్రతినిధిగనుండి పాలించుట వేరు, స్వతంత్ర రాజ్యమును స్థాపించి పరిపాలించుట వేరు.

ఇంతలో నాతనికి బిష్టపుర రాజోద్యానమున గనబడిన బాలిక స్మృతికి వచ్చెను. ఆతడు పొట్టివాడై యెప్పుడును బాలకుడుగ గన్పించుటచే దన బందుగులు తనయందు గనబరుచు బాలభావమువలన నాతని హృదయమున నాలోచనలెప్పుడును సుడిగుండములు తిరుగుచుండును. ఈ భావ సంఘాతముల వలననే యొకరిద్దరనిన తప్ప మనుష్యులన్న నాతనికి బరమజుగుప్స. ఇంక స్త్రీలన్న నాతనికి మరియునేవము.

అడివి బాపిరాజు రచనలు - 6

• 264 •

అంశుమతి (చారిత్రాత్మక నవల)