పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహారాజు శాంతిమూల మహాప్రభువు ఆర్షధర్మ పరాయణుడు. గౌతమపుత్ర శ్రీశాతకర్ణి చక్రవర్తి కాలంనుంచీ ఇక్ష్వాకులు ఆర్షధర్మాభిరతు లయ్యారు. శాంతమూలుడు ఉత్తమ బ్రాహ్మణుడై అగ్నిష్టోమంకూడా చేశాడు. అయినా కరుణాత్మకుడైన ఆ మహాప్రభువు సర్వధర్మరతులను సమాన ప్రేమతో చూసేవాడు.

ఆనందార్హతులు నాగార్జున బోధిసత్వుల శిష్యులు. ఆర్యసంఘ సంప్రదాయ, దిఘ, మజ్జిమ నికాయ పారంగతుడు, పంచమాతులుక మహానుష్ఠానపరుడు, యోగీంద్రుడు.

శాంతిశ్రీకి చిన్నతనాన్నుంచీ అహింస, అష్టమార్గములు అంటే నమ్మకం. అవి ఆచరిస్తేనేగాని మనుష్యునకు గతిలేదని ఆమె చిన్ని హృదయానికి నమ్మకం. మాటలు వచ్చినప్పటినుంచి ఆ బాలిక ఒక్క పరుష వాక్యం అయినా పలికి ఎరుగదు. “వెఱ్ఱిబాగుల తల్లి!” అని మహారాజులున్నూ, మహారాణియు అనుకునేవారు బుద్ధపూజలు, చైత్య నిర్మాణాలు ఆటలలో, నందసుందరీ గాథలు మహాభిష్క్రమణ గాథలు వింటూ ఉండేది.

తండ్రి ఆర్షసంప్రదాయంగా జపతపాలు, గార్హస్థ్యాగ్న్యర్చననిత్యమూ జరుపుతూ ఉండేవారు. తమ పూర్వీకుడు అవతారమూర్తి అయిన రామచంద్రుని సర్వదా పూజించేవారు. పూర్వఇక్ష్వాకుల మహోత్తమ స్థితి, వారి తపస్సు వారి శక్తి, వారి దిగ్విజయ ప్రతిభ శాంతిమూలునికి పులకలు కలిగించేవి.

కొమరిత శాంతిశ్రీ ఎవ్వరితో వాదించేదికాదు. మేనత్తలు ఇద్దరూ ఇక్ష్వాకుల ఆడబడుచులు అయినందుకు అన్నగారి రామభక్తి వారికీ అబ్బింది. అయినా వారికిగాని, శాంతిమూల మహారాజుకుగాని, బౌద్ధధర్మమన్న అయిష్ట మేమీ లేదు. ఆనందులవారు ఆరు సంవత్సరాల క్రిందటనే పమ్నగ్రామం నుంచి పవిత్రప్రదేశమైన నాగార్జున దేవపవిత్రమైన విజయపురం విచ్చేసినారు.

శాంతిశ్రీకి బౌద్ధ ధర్మాభిరతులైన పిష్టపురాధీశులు మేనమామలు. మాఠరి యైన తల్లి పోలిక తెచ్చుకున్నది. తండ్రి తన్ను ఆ దండనాయకుడైన, స్కంద విశాఖాయనక ప్రభువుచెంత భగవద్గీత, రామాయణము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు చదువుకొమ్మని నంతనే ఆమె ఆశ్చర్యమందినది. తనకును, ఆ ఆర్షధర్మ గ్రంథాలకు సంబంధమేమి? తనకు గురువు కాబోవు ఆ మహాపురుషుడు అంత యువకుడే! వారు తనకు గురువు లగుట ఏమి? తండ్రిగారి ఉద్దేశమేమి?

బ్రహ్మజ్ఞాన సంపన్నులు, ఉత్తమ బ్రాహ్మణులు, సాంఖ్యాయనస గోత్రజులయిన ప్రియబలదేవదత్త ప్రభువు ఖ్యాతి ఆమె విన్నది. బౌద్ధభిక్షాచార్యులకు, దేవదత్తప్రభువులకు జరిగిన వాదోపవాదాలు, అందులో దేవదత్తుడు వాదమునందు అప్రతిమానుడై ఆచార్యుల నందరిని ఓడించిన సంగతి తన గురువులు ఆనందులవారు తన కుపదేశించారు. దేవదత్తప్రభువు తనయులు బ్రహ్మదత్త ప్రభువులు. పండితలోకము ఆయనకు బ్రహ్మదత్త బిరుదం ఇచ్చెనట. తండ్రితో సమమైన విద్యావంతులు. తండ్రికన్న మించిన జ్ఞానమూ ఉపజ్ఞా కలవారు. యుద్ధంలో తన తండ్రికి కుడిచేయి. బ్రహ్మదత్త ప్రభువు నెదిరించగల మేటి ఈ జంబూద్వీపంలోనే లేరు అంటారు. ఎంత శాంత తేజస్సు! అంత చిన్నవారయ్యు ఆ ప్రభువు విద్యలో అంత వృద్ధులట. ఆ ప్రభువును తనకు గురువుగా చేయుటలో జనకుల ఉద్దేశమేమి?

అడివి బాపిరాజు రచనలు - 6

• 19 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)