పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకృతి. అది మార్పులతో విన్పించడం వికృతియైన ప్రకృతి. ఆ విషయాన్ని కవిత్వంలా చెప్పడం అద్భుత ప్రకృతి.

మహారాణుల శుద్ధాంతాలిలో అనేకం వినబడుతాయి. ద్వారపాలికలు, పారిపార్శ్వకలు, దాసీలు మహారాజు హర్మ్యంలో అనేకం వింటారు. అక్కడ ఉండే కంచుకులు, ద్వారపాలకులు, చారులు ఏవో చెప్పుకుంటారు. ఇవన్నీ రాజకుమారికలకు, రాణులకు తెలుస్తాయి. అలాగే శాంతిశ్రీ రాజ కుమారికకు ఎందరో యువరాజులు, మహారాజులు పరోక్షంగా తన్ను భార్యగా వాంఛించి రాయబారాలు పంపున్నారని తెలిసింది.

రాజకుమారిక అందంవంటి అందం ఒక్కొక్కశకానికి ఒకసారి రెండుసార్లుమాత్రం ప్రత్యక్షమౌతుంది.

రాజకుమారుడు వీరపురుషదత్తుడు చాల అందమైనవాడు. అతడు శాంతిశ్రీ అన్న. వీరిరువురు కవలలులా ఉంటారు. శాంతిశ్రీ అందానికి ఒక వీసపాలులో వీసపాలు తక్కువ రాజకుమార వీరపురుషదత్తుని అందము.

వీరిరువురి తల్లి మాఠరిగోత్రజ అయిన సారసికాదేవి. శ్రీ మాఠరి సారసికాదేవి, శాంతిశ్రీ అడ్డాల శిశువుగా ఉన్నప్పటినుంచీ దృష్టికొడుతుందనే భయంచేత ఇతరుల కంటబడనిచ్చేదికాదు. తాను తేరిపార చూచుటకే భయపడేది.

సారసికాదేవి బౌద్ధధర్మ పరాయణులైన కళింగాంధ్ర ప్రభువుల ఆడుబడుచు. పిష్ఠపురం రాజధానిగా ఈ మాఠరీగోత్రజులైన మహారాజులు శాతవాహనులకు ముఖ్యసామంతులై రాజ్యం చేస్తూ ఉండిరి. వారి ఆడబడుచు సారసికాదేవి. బుద్ధదేవుని యందు పరమభక్తితో మాఠర గోత్రజుడు శుభశ్రీ మహారాజు నూరేండ్ల క్రిందట బుద్ధగయనుండి ఒక బోధివృక్షశాఖ ఉత్సవాలలో పవిత్ర స్వర్ణపాత్రలో సప్తమృత్తికలు కలిపి ఫల్గుణినదీ జలాభిషేకం చేస్తూ కొనివచ్చి పిష్ఠపురంలో మహాసంఘారామం ప్రక్కను మహాచైత్యానికి తూర్పుగా పవిత్ర వితర్ధిక మధ్యను పాదుకొల్పినాడు.

ఈలాంటి శాఖే పూజ్య శ్రీ సంఘమిత్ర భిత్కుని శ్రీ మహేంద్ర భిక్కులు తామ్రపర్ణి ద్వీపంలో నెలకొల్పినారు. ఆనాటినుండి పిష్ఠపురానికి పాద బౌద్దమనీ, పాదగయ అనీ పేరు వచ్చింది.

మాఠరీ ప్రజలకు శాతవాహనులంటే అమితభక్తి. తరువాత శాతవాహనులు బౌద్ధధర్మము పరిత్యజించినా మాఠరీ ప్రభువులు మాత్రం ఆ ధర్మము పరిత్యజించలేదు. వారు ధాన్యకటక మహాచైత్యము, కంటకశైల మహా చైత్యము, ప్రతిపాలపుర చైత్యము సిద్ధనాగార్జున ప్రతిష్ఠాపిత మహాచైత్యము దర్శిస్తూ ఉండిరి. వారికీ, శాతవాహనులకూ, ఇక్ష్వాకులకూ ఎన్నేని సంబంధాలు ఉండేవి.

సారసికాదేవి బుద్ధధర్మపరాయణ. శాంతిమూల మహారాజు పట్టమహిషి. ఆమె బుద్ధభక్తి విషయంలో మహారాజు ఏ విధమైన అభ్యంతరమూ పెట్టలేదు. ఆమె బౌద్దధర్మాభిరతియై కొమరుని, కొమరితను తన గురువైన ఆనందార్హతుల పాదాలకడ చదువుకై అప్పగించింది.

అడివి బాపిరాజు రచనలు - 6

18

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)