పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విభ్రమము చెందుచుండగనే యా దుండగీండ్రు అంశుమతీ కుమారిని, మాధవిని నెత్తుకొని, ప్రక్కనున్న యొక పడవలోనికి ఢాకినులవంటి యాడువాండ్ర చేతుల కందిచ్చిరి, రాజకుమారీ మాధవీలతల నోళ్ళకు నాఢాకినులు గుడ్డలు గ్రుక్కి కాలుసేతులు గట్టివైచి, నౌకాంతర్భాగములోనికి గొంపోయిరి. ఆ పడవ తన్ను మఱి మూడు పడవ లనుసరింప మహావేగముతో ధవళగిరి క్షేత్రము దెసకు బోదొడంగెను.

(7)

శ్రీశైల పవిత్రప్రదేశంబులకు దక్షిణమునున్న చళుక రాష్ట్రము నేలు ప్రభువులు చాళుక్యులు. సాతవాహనులకు సామంతులై సాతవాహన మహారాజ్య మంతరించిన వెనుక చళుకరాష్ట్ర ప్రభువు లిక్ష్వాకులకు సామంతులైరి. ఇక్ష్వాకులతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్లవుల తోడను, కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానందులతోడను, ధాన్యకటక ప్రభువులైన ధనకులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రధిపతులైన సాలంకాయనులతోడను, క్రముక రాష్ట్ర ప్రభులైన బృహత్పలాయనులతోడను, పూంగీరాష్ట్రాధిపతులైన పూంగీయుల తోడను, ఇక్ష్వాకులకు సామంతులై చాళుక్యులు వృద్ధిపొందుచుండిరి.

ఇక్ష్వాకుల రాజ్య మంతరించగనే పల్లవులు విజృంభించిరి. సామంతు లందఱును స్వతంత్రులైరి. చాళుక్యులను తమ స్వాతంత్య్రమును బ్రకటించుకొని మహారాజ చిహ్నమగు 'భట్టారక' శబ్దమును వహించిరి. వారికిని పల్ల వులకును యుద్ధములు సాగినవి. చివరకు త్రినయన పల్లవమహారాజును చాళుక్యమహారాజు ఓడించెను. కాని యాతడు యుద్ధరంగమున వీరమరణము నందెను. చాళుక్య మహారాజ్ఞి వనవాసి కదంబుల యాడుపడుచు. ఆమె యప్పుడు నిండు చూలాలు. విష్ణుశర్మయను రాజపురోహితు, డామహారాణి, సహగమనము సేయ నుద్యమింప దత్ప్ర యత్నమును మాన్పించి, రహస్యముగ నామెను గొనిపోయి వాతాపినగరమున దన బందుగుల యింట దాచెను. ఆమెకు చాళుక్య విష్ణువర్ధనుడుద్భవించినాడు.

బాల్యమునుండియు విష్ణువర్ధనుఁడు వీర విక్రమ విహారుడై, విష్ణుశర్మ గుప్తముగా గొనితెచ్చిన రత్నభూషలను మార్చి ధనము సేకరించుకొని, యా కుంతల దేశమున వాతాపినగరము దనకు ముఖ్యనగరముగ నొనర్చుకొని, సైన్యముల సమకూర్చుకొని, నెమ్మది నెమ్మదిగా రాష్ట్రకూటుల రాజ్యమునుండి జయించిన యా భూభాగమున చాళుక్య రాజ్యము నిర్మించినాడు. చాళుక్య విష్ణువర్ధనుడు పరమ బ్రహ్మణ్యుడై, విష్ణుభక్తుడై, వరాహ లాంఛనమును గ్రహించినాడు. తన రాజ్యమును తూర్పు పడమరలకును, దక్షిణోత్తరములకును విస్తరింప జేయసాగెను. వాతాపి నగరమే యాయనకు రాజధాని యాయెను. పల్లవ సామ్రాజ్యములోని భాగము లన్నింటిని నాతని వంశీయులు చాళుక్య రాజ్యములో గలుపుకొనసాగిరి.

చాళుక్యరాజ్య మంతకంతకు విస్తరించి ప్రథమ పులకేశి కాలమున, బాట, సౌరాష్ట్ర,

అవంతి, అశ్మిక, అపరాంత, కుంతల, ములకరాష్ట్రములు మొదలైననన్నిటిని దనలో

అడవి బాపిరాజు రచనలు - 6

245

అంశుమతి (చారిత్రాత్మక నవల)