పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“నీలవర్ణముగాని, రజనీ గర్భాంతరిత కాలవర్ణముగాని, సంధ్యారుణరోచిస్సుగాని, ఏది యీ యాకాశమునకు సహజవర్ణము! శతసహస్ర శంఖ ప్రమాణ దూరములుగల యీ నిరవధికాంబరమున నెచటెచట నే వర్ణములు పొదివి కొని యుండునో ఎవరు నిర్ణయింపగలరు! ఎంత విచిత్ర మీ వర్ణముల మార్పు! మానగరదైవము చిత్రరథస్వామీ విరాలంబ మార్గానువర్తియై, తాను సృష్టించిన కాలములోనే, సర్వదా యానము చేయుచుండవలయును. సూర్యాస్తమయము, మఱల సూర్యోదయము. నిత్యుడై కదలక యేక ప్రదేశస్థుడైన సూర్యుడు కదలుచున్నట్లు గనబడుట ఎంత విచిత్రము!”

“ఉత్తమ బ్రాహ్మణ క్షత్రియవంశము విష్ణుకుండిన వంశము. అయ్యది తనతో సమాప్తమైనది. దూరస్తులైన జ్ఞాతులెవ్వరో యుండిరట. చిన్న చిన్న సామంతులై వారిని వీరిని గొల్చుచుండిన విష్ణుకుండిన నగరవాసులైన యా జ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట.” ఈవిధమున నాలోచించుకొనుచున్న అంశుమతిని “ఏమమ్మా! భర్తృదారికా! ఏ మాలోచించుచుంటి” వని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను.

“ఏమని చెప్పుదు మాధవీ! ఒక దానికొకటి పోల్చరాని రూపములు! ఒక ఘటిక నొక ఘటిక తరుముకొని వచ్చినట్లు, కాలప్రవాహమువంటి యాలోచన లసంబద్ధములై నా హృదయమును జొచ్చి వచ్చుచున్నవి.”

“ఆలోచనా మధ్యస్థుడై ఎవరో యొక యువకమూర్తి నీకు గోచరించుటలేదా?!”

“ఓసి వెఱ్ఱిదాన! ఎవరే ఆ యువకమూర్తి? లోకమూర్తి సూర్యుడే నవ్యుడును వృద్దుడును! ఈ యనంతాకాశమున పూర్వమేది? పశ్చిమమేది?”

“నారసింహదేశికుల శుశ్రూష వేదాంతమార్గమున బట్టించుచున్నదా నిన్ను?”

“వెఱ్ఱిదానా! ఈ దేశ కాలములందు బద్ధులగువారికి వేదాంతముకూడనా?”

“ఏమో! నీమాట లెప్పుడును నన్ను ముంచుకొని పోవునేగాని కాలు నిలువద్రొక్కు కొననీయవు".

“గోదావరిలో మునిగి కొట్టుకొనిపోవుచున్నట్లుందును గాబోలు నేమి?”

రాజకుమారి నావను వెంబడించి, పరివారమును రక్షక భటులును ఉన్న పడవ లెన్నియో వచ్చుచుండెను. పరిచారి కాజన మున్నపడవ రాజకుమారి నౌకను వెన్నంటియుండెను. ఆ నావనుండి జవ్వని ఒకతె మృదుమధుర కంఠమెత్తి పాడుచుండెను.

“గోదావరీ మాత
కొండలెన్నో గడచి
ఆ దారు లారేవు
లావనములను నడచి,
ఈక్షేత్రముల మధ్య
ఈ నీరముల రథ్య
సాక్షాత్కరించినది
సర్వమంగళ రీతి,
పాడవే గౌతమికి
ప్రణతు లొసగిన పాట,

అడవి బాపిరాజు రచనలు - 6

243

అంశుమతి (చారిత్రాత్మక నవల)