పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్వరితగతి నాయావు రాజకుమారుని కడకు నడచి వచ్చినది. ఒక్కక్షణము మోరనెత్తి చూచినది. మఱు క్షణము రాజకుమారుని జూచి తలవాల్చినది. “అంభా” యని యరచుచు నాయావు గదలక అట్లే నిలచిపోయినది.

ఆ గోవును రాజభటులు ముందుకు నెట్టినారు. అదలించుచు దోలినారు. ఆ గంగిగోవిసుమంతయేని గదలలేదు. మఱల “నంబా” యని యరచినది. రాజకుమారు నొడలంతయు ముట్టెతో నా ఘ్రాణించినది. ఆ గోమాత కన్నుల గిఱ్ఱున నీరు దిరిగినది. కంటి నీటితో గోమాత నాలుక చాచి రాకొమరుని చేతులు, మోమును నాక జొచ్చినది. రాజభటులు గోవును మఱల గట్టిగ గ్రోసినారు. ఆవు వెనకకు దిరిగి కోపపుజూపు చూచి, మెల్లగ దన యజమానుని యొద్దకు బోయినది. ప్రజలందరు హర్ష నినాదములు, జయ ధ్వానములు సేయుచు “మహాప్రభూ ధర్మసంస్థాపనమైనది. గోమాత దానిని బాలించినది. ధర్మమేవ జయతు! ధర్మమేవ జయతు!” యని యరచుట సాగించినారు.

గంభీరానన నిశ్చలుడై నిలుచున్న మహారాజు కన్నుల నీరు దిరిగినది. కదలక నిశ్చేష్టయై చేతలు మాని నిలుచున్న మహారాణి, “తల్లీ! కనకదుర్గా! నీవే నమ్మా! గోమాతవు!” అనుచు గుప్పగ గూలిపోయినది. పరిచారిక లామె కడకు బరుగిడివచ్చి మోమున నీరు చల్లి, పరిచర్య లొనరించుచుండిరి. గోవు యజమానియు గొందరు సాక్ష్యమిచ్చిన వారును రాజకుమారు నొద్దకు బరుగిడి వచ్చి కట్లు విప్పి వేసిరి.

అప్పుడు పరమేశ్వరుడు బంగారు వర్షము గురిపించినాడని ప్రజలు చెప్పుకొనిరి.

ఆ గోవును మాధవవర్మ విష్ణుకుండిన మహారాజు లక్ష ఫణము లిచ్చి కొనెను. ఆ గోమాతను తమ కులదైవముగ నెంచికొని వేంగీపురమునకు గొంపోయిరి.

ఆ గోదేవి పదునైదు వర్షములు జీవించి పరమపదించిన వెనుక మాధవవర్మ మహారాజు గోపాదక్షేత్ర గోదావరీతీరమున, దాని కగ్నిసంస్కార మొనర్చి, ధాన్యకటకపు బాలరాతితో నుత్తమశిల్పిచే గో విగ్రహము నొకదానిని విన్యసింప జేసినారు.

చక్కని దేవాలయ మొక్కటి గోపాద క్షేత్రమున నిర్మించినారు. అందా విగ్రహమును బ్రతిష్ఠించినారు. రాజకుటుంబపు స్త్రీ పురుషులందరు ప్రతివర్షమున నా గోమాతకు మహోత్సవములతో పూజ లర్పించుచుందురు. ఆ గోమాతకు బుట్టిన వత్సములన్నియు నా వంశమువారికి బూజనీయములు.

(6)

విష్ణుకుండిన మహారాజకుమారి అంశుమతీబాల ఒకనాటి సాయంకాలము కోటిలింగాల క్షేత్రమునుండి తన నౌకపై నెక్కి గోపాదక్షేత్రమునకు వచ్చుచున్నది. రాజనౌక రాజహంస స్వరూపమున విన్యసింపబడినది. పడవ వాండ్రు తెరచాపలను విప్పుటచే నా నౌక రెక్కలను జాచి మానస సరోవరమునందు విప్పుకొన్న రాజహంసవలె నిర్మల నీలప్రవాహయగు గౌతమీ కూలంకషపై తేలికొనుచు వేగమున గోవూరు వైపునకు

వచ్చునుండెను. సూర్యదేవుడు నిరవద్య (నిడదవోలు) పురమువైపున దిగి పశ్చిమాశాతలమున మాయమై పోయినాడు. కాశ్మీర కుంకుమ వర్ణదీధితు లాకాశ మెల్లెడను గ్రమ్ముకొన్నవి.

అడవి బాపిరాజు రచనలు - 6

242

అంశుమతి (చారిత్రాత్మక నవల)