పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంశుమతి

• చారిత్రాత్మక నవల •

శ్రీఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారకదేవుని ఏకైక పుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాదక్షేత్రమునందు స్నానము చేయుచున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ్రుంకులిడుచున్నది. రాజ పురోహితుడు 'అఖండ గౌతమీస్నానమహం కరిష్యే' అని ప్రారంభించి, 'దశాపరేషాం దశపూర్వేషాం' అను మంత్రములతో రాజకుమారికను గోదావరీ స్నానము పూర్తి చేయించెను.

గట్టుపైన తనకై నిర్మించిన శిబిరములోనికి బోయి, యాబాలిక యుచితవేషము ధరించి, చెలులు కొలుచుచుండ నీవలికివచ్చి, అక్కడచేరిన భూదేవు లందరకు సంభావనలు సమర్పించినది. ఆ వెనుక స్యందనమెక్కి విడిది చేసియున్న మహాభవనమున బ్రవేశించినది.

పదునెనిమిది వత్సరముల ఎలప్రాయమున నున్న ఆ బాలిక లోకోత్తరసుందరి యని ప్రసిద్ధిగాంచినది. ఆనాటి రాజకుమారు లెందరో ఆమెను వివాహమాడ వాంఛించి శ్రీ మంచన భట్టారకమహారాజు కడకు రాయబారములంపు చుండిరి. కాని యా బాలిక ఏ కారణముననో యా రాయబారములలో నొక్కటినైనను అంగీకరించలేదు.

అంశుమతీ కుమారి జాతకమున నేదియో గ్రహ దోషము వచ్చినదని రాజ జ్యోతిష్కుడు నారసింహభట్టు పండితులు సెలవిచ్చినారు. అందులకు, గోవూరు గోపాద క్షేత్రమున గోదావరీ స్నానము చేయుచు, నుత్తమ బ్రాహ్మణులచే గ్రహజపము లొనరింప జేయుచు, దానాదు లర్పింపవలయునని నారసింహభట్టు నిర్ణయించినారు.

'ఆ దోషము గ్రహచారమువలన కలిగినది. తమ రాజ్యమునకే ముప్పు తెచ్చును. గ్రహశాంతి చేయించినచో నా యుపద్రవము తీరిపోవును' అని రాజగురువు వచించినాడు.

'అటుల దోషము తీరిపోయిన అమ్మాయి జాతక మెట్లుండు నందురు గురుదేవా?'

'రాజకుమారి జాతక ముత్కృష్టమైనది. ఆమెకు మహారాజు భర్తగా లభించును. ఆమె గర్భమున కులదీపకుడైన సుపుత్రు డుద్భవించి , సామ్రాజ్యాధిపతి యగును.'

రాజగురువే గోవూరునందు రాజకుమారికచే గోదావరీ స్నాన వ్రతము చేయింప నేర్పాటయ్యెను. వ్రతము నలుబది దినము లొనరింపవలసి యున్నది.

సాగరు లపవిత్రము సలిపిన భూమిని పవిత్రను సేయుటకు భగీరధుడు హిమవ న్నగమున దప మాచరించి, ఆకాశగంగను మెప్పించెను. ఆమె భూమి నవతరించుట కనుగ్రహించినను, ఆమె దిగివచ్చు నురవడి నాపగల వారెవ్వరు? కావున భగీరధుడు

అడవి బాపిరాజు రచనలు - 6

231

అంశుమతి(చారిత్రాత్మక నవల)