పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుద్ధభిక్షుక చైత్యవిహార సంఘాధిపతి, మహామంత్రులు, నిబందకారుడు శాసనాలు, భూమి అమ్మకాలు, వర్తకంలో వస్తువుల అమ్మకాలు మొదలయినవి చూచేవాడు. చక్రవర్తి ఆజ్ఞలను ప్రతీహారులు కొనిపోయి ఆయా అధిపతులకు అందిస్తూ ఉండేవారు.

రాజ్యంలో బ్రాహ్మణులు, క్షత్రియబ్రాహ్మణులు అను కులాల వారుండేవారు. రాజ్యాలు పాలించే బ్రాహ్మణులు క్షత్రియ బ్రాహ్మణులు. వారికింకా బ్రాహ్మణత్వం పోలేదు. అలా బ్రాహ్మణత్వం పోగొట్టుకున్న వారు పూర్తిగా క్షత్రియులై పోయేవారు. వీరు, హాలికులని, మూర్ఖకులని, గోపాలురని మూడు కులాలుగా ఉండేవారు. కుమ్మరులు, చాకళ్ళు మొదలయినరు శూద్రులు.

శాంతిమూల చక్రవర్తి పరిపాలన ప్రారంభించడమేమి సర్వదక్షిణాపథ మందూ నిమ్మకు నీరుపోసినట్లు అద్భుతమైన శాంతి అవతరించింది. సర్వధర్మాల వారూ అడ్డంకులులేక ఆనందంతో నిజధర్మమందు మెలగేవారు. శాంతిమూల చక్రవర్తిని ధాన్యకటకంలో సింహాసనం అధివసింపవలసిందని మహాసామంతులందరూ కోరినా శాంతమూలుడు పనికిరాదన్నాడు.

“శాతవాహన వంశం పాలించిన పవిత్రదేశం మనకు దివ్యక్షేత్రం."

“నేనూ నా పుత్రులు వారి సంతానమూ ఎప్పటికీ ఆంధ్రభృత్యులం.

ఇక్కడనుండే సర్వదక్షిణాపథాన్ని పరిపాలింతుముగాక” అని నిండుసభలో సెలవిచ్చినాడు. బ్రహ్మదత్తప్రభువును మహాసేనాపతి మహామాత్య సింహాసనంపై చక్రవర్తి అభిషేకించినారు. పూంగీయ శాంతశ్రీ వివాహం కాగానే శ్రీ వీరపురుషదత్త యువ మహారాజునకు ఇరువురు దేవులతో ప్రతిష్ఠాన నగరంలో యువరాజ పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం అవుతూనే వీర పురుషదత్తుడు తన సామంతులతో ఉజ్జయిని వెళ్ళి రుద్రసేనక్షాత్రప రుద్రసింహ మహారాజు కొమరిత రుద్రభట్టారికను వివాహము చేసుకొన్నాడు. ఆ ఉత్సవం పరమాద్భుతంగా జరిగింది.

(6)

అడవి శాంతిశ్రీ బ్రహ్మదత్తుడు పాలీ గ్రంథము చదువుకొను విద్యామందిరానికి తొందరగా వెళ్ళినది. తనదేవేరి మంజీరనిక్వణశ్రుతి చెవుల సోకగానే ధనకప్రభువు పుస్తకము కన్నుల కద్దుకొని పేటికాంతమందుంచి లేచి నిలుచుండి గుమ్మమువంక చిరునవ్వుతో ఎదురు చూస్తున్నాడు. ఇంతలో శాంతిశ్రీదేవి గుమ్మం దగ్గర ప్రత్యక్షమయినది.

“ప్రభూ! ఎప్పుడూ చదువే?”

“నువ్వు నా జీవితంలోకి వచ్చి నా చదువు అంతా ఆపివేశావు దేవీ!” ఆమె కోపం నటించే అతని చెంతజేరి నల్లత్రాచువంటి వేణీబంధము కేలబూని గిరగిర త్రిప్పుతూ జంకించినది.

“శాంతీ! నువ్వు నా యెదుట ఉన్నా, లేకున్నా హృదయానికి శాంతి లేదు.”

“బాధలన్నీ మీరొక్కరే కాబోలు పడేది?”

“రా, ఇలా వచ్చి నా అంకమందు”

అడవి బాపిరాజు రచనలు - 6

223

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)