పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఆజ్ఞ ఇవ్వవచ్చునుగాదా?”

“ఇవ్వవచ్చును, సమయము వచ్చినప్పుడు,

ఇప్పుడు ఎందుకు ఇవ్వకూడదు?”

“మీ తండ్రిగారు దగ్గిర ఉండగా గురువులు ఈయకూడదు. పెళ్ళి అయిన స్త్రీకి అనుమతి ఈయవలసింది భర్త. విధవ అయితే కుమారుడు. ఎవరూ లేకపోతే గురువు. పెళ్ళికాని బాలికలకు తండ్రి. తండ్రి తరువాత తల్లి. వీరుకాక ఇంకొకరు కన్యకు అనుమతి ఈయకూడదు.”

శాంతిశ్రీ మౌనం వహించింది. ఆమె దేశికులు సన్యాసానికి ఆజ్ఞ ఇస్తారు అనుకొన్నది. కాని ధర్మశాస్త్రప్రకారం అలా దేశికులు పనికిరాదని అంటారని ఆమె ఏ మాత్రమూ అనుకోలేదు. ఆ రాజపుత్రి ఇంచుక తడవు నిర్వికారమై నిలిచినది. పొడముచున్న కన్నీటిని రెప్పలతో అప్పళించినది. వెనుదిరిగి ఏగబోయి ఆగినది. ముందునకూగి వెనుకడుగు వై చినది. తటాలున బ్రహ్మదత్తుని పాదాలవాలి “మీరు నాకు దేశికులుకాదు, భగవంతులు. నేను నాకు తెలియక మిమ్ము ప్రేమించాను. శూన్యమయిన ఏదోలోకంలో చైతన్యంకాని చైతన్యంలో తిరుగుచుంటిని. చదివిన విద్య ఒక విధంగా అగ్రాహ్యమై ఉండేది. ఇంతలో మీరు నాకు దేశికులయినప్పటినుండీ ఏదో నాలో నూతనచైతన్యం అంకురించి, క్రమంగా నా జీవితం అంతా నిండి పోయింది. ప్రభూ! తాము నన్ను వనదేవతగా ఎన్నుకొంటిరి. ఎన్ను కొన్నందుకు ప్రథమంలో విపరీతానందం, వెంటనే తీరని వ్యధ అరంభించినవి అంతకుమున్ను అట్టి అనుభవాలు ఎరుగను. ఈ బాధలూ, ఈ సంతోషాలూ ఏమిటని ఆశ్చర్యపొందినాను. చికాకుపడినాను, ఏడ్చినాను, గంతులు వేసినాను మీరు కనబడక మనలేకపోతిని. మీరు నన్ను ప్రేమిస్తున్నారేమో అని ఆనందమందాను, బాధపడినాను. ప్రేమించుటలేదని నిశ్చయించి దుఃఖించినాను. మీరు సముద్రంలో మునిగిపోయినారన్న వార్తనా జన్మను మూలవంతటా కదిలించివేసింది. ఒకనాడు నేను జైనులవలె నా దేహం నాశనం చేసుకుందామనిపించినది.

“ఇంతలో మీరు తిరిగివచ్చినారని తెలిసి నాలో ఉద్భవించిన ఆనందము వర్ణనాతీతము. ప్రభూ! మీరు బందీ అయినారని విని క్రుంగి పోయాను. ఇంతలో నన్ను మించిన కోపం ఆవహించి పులనూవిని నాశనం చేయ సమకట్టినాను.

“దివ్యమూర్తీ! నేను మిమ్ము సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. మీ పరిచర్యకుగాని ఈ బ్రతుకు ఇసుమంతయినా అవసరంలేదు. మీరు వేదాంతము నాకు బోధించినారు. లోకమంతా పరిత్యజించి సన్యాసులయి వెడలిపోతారని భయమావహించి మీకన్న

ముందుగానే దీక్ష పుచ్చుకోవాలని నిశ్చయించాను. ప్రభూ! ఈ నా ప్రేమ అవధిరహితం. సర్వదివ్యభావాలనూ అధిగమించి పోయినది. సర్వధర్మాలను దాటిపోయింది. మీరు నన్ను భార్యగానన్నా స్వీకరించండి. లేదా నాకు భిక్షుణి ధర్మదీక్షకు అనుమతి నివ్వండి. ఇదంతా నాయనగారికి మనవి చేసి వారి అనుమతిమీద మీకు నివేదించాను” అని మాటలంతకన్న అంతకన్న అస్పష్టమైపోగా మనవి చేసి కనులనీరు దొరలిపోగా, ఆ ధనకప్రభువు పాదాల వాలిపోయినది.

అడవి బాపిరాజు రచనలు - 6

219

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)