పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ ఉత్సవాలలో ఒకనాడు సాయంకాలం తారానిక రథమెక్కి బ్రహ్మదత్తప్రభువు మహాభవనానికి వచ్చి ప్రభువు దర్శనం కోరింది. ఆ ధనకప్రభవు అప్పుడే స్నానంచేసి వచ్చి తన విద్యామందిరంలో పీఠం అధివసించి యుండెను. తారానిక వచ్చి సాష్టాంగపడి “మహాప్రభూ! తాము వెంటనే అంతఃపురానికి రావలసిందని మహారాజకుమారి నన్ను పంపింది” అని మనవి చేసినది.

“ఎప్పుడు?”

“వెంటనే ప్రభు!”

“నేను జపం చేసుకోవలసి ఉంది.”

“మా భర్తృదారిక ఇలా అన్నారండి. 'మా దేశికులు జపానికి పోయే వేళ అయినా వారిని వెంటనే కొనిరా' అని”

“సరే వస్తాను. నీవు పో!”

తారానికి వెళ్ళిపోయింది. బ్రహ్మదత్తుడు 'ఏమి పుట్టి మునిగినదో” అని సందేహించుచు తల్లికి నమస్కరించి ఆశీర్వాదమంది ఆమె మోమున వెలిగిన చిరునవ్వున కర్ధమేమా అని ఆలోచిస్తూ రథమెక్కినాడు.

(3)

ధనకప్రభువు మహావేగంతో మహారాజకుమారి భవనానికి వెడలినాడు. ఆ రథంవెంట తారానిక రథం ఉన్నది. రెండు రథాలూ లోనిప్రాంగణాలకు వెళ్ళిపోయినవి. మహాభవనము ఎదుట ఆగినవి. స్కందవిశాఖప్రభవు నెమ్మదిగి తారినిక దారి చూపగా లోనికి వెడలినాడు. సభాభవనాలు దాటి విద్యా మందిరంలోనికి ఆ మహాసామంతుని కొనిపోయినది. లోన నిశ్చలంగా శాంతిశ్రీ నిలిచి ఉన్నది. ఆమె ఎదుట బ్రహ్మదత్తప్రభువు చిత్రము లిఖించిన ఫలకము కుడ్యమును అలంకరించి ఉన్నది.

బ్రహ్మదత్తుడు రాగానే శాంతిశ్రీ పరుగున వచ్చి ఆ ప్రభునిపాదాల వాలినది. ఆ ప్రభువు చిరునవ్వుతో “మహారాజకుమారీ! నీకు సర్వవిద్యలూ కరతలామలకములగుగాక” యని ఆశీర్వదించెను. తారానిక వచ్చి రాజకుమారిని లేవనెత్తి “మహారాజా! తాము సింహాసనముపై అధివసించండి. మాభర్తృదారిక ఈ ఆసనం అధివసిస్తారు” అని పలికినది. బ్రహ్మదత్తుడు ఒక ఆసనం అధివసించినాడు. రాజకుమారై ఇంకో ఆసనం అధివసించింది.

“రాజకుమారీ! ఎందుకు నన్ను రప్పించింది?”

రాజకుమారి మౌనం వహించింది.

“నీ హృదయంలో ఉన్నది దేశికులకడ చెప్పవచ్చుకాదా?”

రాకుమారి నేలచూస్తూ నిలబడింది.

“ప్రభూ! నేను భిక్షురాలినికా మీ అనుమతి నీయ ప్రార్థిస్తున్నాను.”

"భిక్షుకురాలా?”

అవునని రాకుమారి తలవంచే ఊపినది.

“తప్పక కావచ్చును. కాని....”

అడవి బాపిరాజు రచనలు - 6

218

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)