పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(ఏకాదశభాగం)

నాగార్జునపర్వతం

శాంతిమూల చక్రవర్తి

ఇక్ష్వాకు శాంతమూలుడు ధాన్యకటకంలో ఆలోచనాపరుడై యుండగా నాగార్జునదేవుని కడనుండి “కుమారా! నీవే చక్రవర్తిని కావాలి. నేను స్వయంగా మిమ్ము పట్టాభిషిక్తులచేసి సిద్ధలోకానికి వెళ్ళిపోతున్నాను.

“బుద్ధం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
                  - నాగార్జున"

అని కదంబపత్ర విరచితమైన శ్రీముఖం వచ్చింది. వెంటనే శాంతిమూలుని మోము విప్పారినది. సర్వసైన్యాలకు తాను అధ్యక్షుడయి మాహావేగంతో ప్రతిష్ఠానం బయలుదేరినాడు. చవుకరాయనిక ప్రభువును, బృహత్పాలాయనప్రభును ముసికనగరంపైకి పంపినాడు. సాలంకాయనప్రభువును మాళవం పంపినాడు. అతివేగంతో ప్రతిష్ఠానం వచ్చి చెల్లెలి స్త్రీ సైన్యాలను వెంటబెట్టుకొని పూంగీయప్రభువును ప్రతిష్ఠానంలోఉంచి , నాసిక చేరుకునే సరికి పులమావి అంతకుముందే ప్రాణం వదిలినాడని తెలిసినది.

పులమావికి మహావైభవంగా భవంగా అంత్యక్రియలు జరిపి, నిండుసభలో పులమావి చక్రవర్తిగా నిర్యాణమందినాడని ప్రకటించినాడు. పులమావి రాణిని సంరక్షింపుమని చెల్లెలికి అప్పగించినాడు. నాసికనుండి కొమరితను చెల్లెలిని వీరాంగనాసైన్యాన్ని తిరిగి విజయపురం పంపినాడు. అక్కడ నుండి సర్వసైన్యాలతో కూడుకొని భరుకచ్ఛమూల మాళవ, మగథ, విదేహ, కోసల, వంగ, కళింగ విజయ యాత్ర సలిపి విజయపురం చేరెను.

ఒక శుభముహూర్తాన శ్రీనాగార్జునదేవుల పాదసమీపాన సర్వశుద్ధుల నంది శాంతమూలుడు ఆ దివ్యమూర్తికి సాష్టాంగపడినాడు.

శుద్ధసత్వమూర్తియై ఆ పరమఅర్హతుడు చిరునవ్వుతో "నాయనా! నాతల్లి ఆంద్రి. నేను విశ్వామిత్ర గోత్రుడను. సర్వవేదాలను మూర్తించు కొన్న గాయత్రిని కనుగొన్న వంశం మాది. ఏనాడు ఏ సాంప్రదాయం చెడిపోయినా ఆ సంప్రదాయానికి నూత్నజీవం పోసేందుకు ఉద్భవించిన వంశంమాది. సర్వశాస్త్రసమన్వయం, సర్వధర్మ సమన్వయం, సర్వసంప్రదాయ సమన్వయం లోకానికి అవసరమయిన దిప్పుడు. అర్షధర్మం సమన్వయించినాను. భౌతిక సత్యం ఆధ్యాత్మికసత్యంలోనిదే అని రసవాదంవల్ల

అడవి బాపిరాజు రచనలు - 6

216

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)