పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ కాలంలో దండకాటవి-పాండవ కాలంలో విదర్భ దేశమై నేడు ఆంధ్రమహా సామ్రాజ్యమున చేరిన కుండిన నగరంలో తన వీరాంగనా సైన్యంకోసం లక్ష సువర్ణ ఫణాలు ఖర్చుపెట్టి ఆయుధాలు, కవచాదులు సేకరించింది. వాసిష్టీపుత్రి పూంగీయ మహారాణి శాంతిశ్రీదేవి. కుండిన నగరంలో నెలదినాలు విడిది చేసింది వీరాంగనా సైన్యం.

కుండిన నగరంలో తన చెల్లెలు, ఆమె కొమరిత, తన చిన్న చెల్లెలు హమ్మిశ్రీదేవి తనయలిద్దరూ, తన ఏక పుత్రికా స్త్రీ సైన్యం నడుపుకుంటూపోయి విడిదిచేసి ఉన్న విషయమూ, ఆ సైన్యం బయలుదేరిన విషయమూ అన్నీ శాంతిమూల మహారాజుకు ఎప్పటికప్పుడే తెలుస్తున్నది. కాని ఆ మహారాజు మాటలాడడు. బ్రహ్మదత్తుడు మహారాజు నిశ్చలతకు ఆశ్చర్యంపడుతూ ఉన్నాడు. బ్రహ్మదత్తప్రభువు మహారాజు ఏమిచేయునో అని కనిపెట్టుకొని చూస్తున్నాడు. పూంగీయ మహా సామంతాదుల ఆశ్చర్యానికి మేరలేదు. పూంగీయ స్కందశ్రీ మహారాజు కడకు ఆతని రాణి వచ్చి స్త్రీ సైన్యసమేతంగా తాను బౌద్ద పుణ్య క్షేత్రాలు చూచి వస్తానని అనుమతి కోరింది. రాజు సరేనన్నాడు.

వాసిష్టి శాంతిశ్రీ జగత్ప్రసిద్ది చెందిన సుందరి. అన్నగారితో సమంగా అన్ని శాస్త్రాలు చదువుకొన్నది. ధీసంపన్న, రాజకీయ పరిజ్ఞానపూర్ణ. స్కందశ్రీ పురుషులలో సుందరుడు, ప్రసిద్ధవీరుడు. శాంతిశ్రీ అతనిని తానే కోరి విహహం చేసుకొన్నది. స్కందశ్రీకి భార్య తెలివితేటలలో మూడవవంతు లేవు. పైగా ఆ జగదేకసుందరి తనకు దేవేరియై శృంగారా నందకలశాంబుధీస్నాతుణ్ణి చేసేది, వారిరువురి అనుకూల దాంపత్యము జగత్ స్తుత్యమై కావ్యవిషయమై గానం చేయబడేది. వ్యవహారదక్షయైన భార్యమాటకు స్కందశ్రీ మహారాజు జవదాటి ఎరుగడు. ఆమె తన్ను విడిచి పుట్టింటికైనా వెళ్ళలేదు, ఇరువురు కలసి వెళ్ళేవారు. ఇరువురు కలసి వచ్చేవారు. రెండుసార్లు పురిటికి వెళ్ళింది. ఆ రెండుసార్లు పూంగీయ రాష్ట్రపతి భార్యతో విజయపురం వెళ్ళినాడు.

అలాంటి శాంతిశ్రీ నేడు తన కొమరితను తీసుకొని బౌద్ధక్షేత్ర యాత్రకు పోవడం ఆ మహారాజుకు ఆశ్చర్యమూ, బాధా, దుఃఖమూ కలిగించినది. కాని ఈ విషయములో ఏదో పరమరహస్యం ఉందని అతడు తలపోసికొన్నాడు. అయినా తమకందరకు నాయకుడు మహాసామంత శ్రేష్ఠుడూ, మహారాజరాజేశ్వరుడు కావలసిన వాడూ అయిన తన బావగారు మాట్లాడక ఊరుకుంటే తానేమి చేయగలడు?

ఆ దినం మహాసామంతులు సభ చేశారు. చక్రవర్తి సింహాసనంపై ఎవ్వరు అధివసించలేరు. కుడివైపు ఆసనంపై శాంతిమూలుడు కూర్చుండి ఉన్నారు. వేంగీపుర సాలంకాయనుడు, ప్రతీసాలపుర బృహత్పాలాయనుడు, కాంచీపుర పల్లవుడు, పిష్టపురపు మాధవుడు, కళింగపుర వాసిష్ఠుడు, సంగమపుర చాళుక్యుడు, ధనకరాష్ట్రపతి బ్రహ్మదత్తుడు, పూంగీయ స్కంద ప్రభువూ సభ తీర్చి ఉన్నారు.

ధనకప్రభువు: శాంతిమూల మహాప్రభూ! మనవారందరూ కుండినపురంలో విడిది చేసి ఉన్నారు.

స్కందశ్రీ: నారీసైన్యం పదిహేను వేలవరకూ వృద్ధిపొందిందట.

అడివి బాపిరాజు రచనలు - 6

• 207 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)