పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాకుమారి గజయుద్ధాధిపత్నియై హిమాలయంవలె ఉన్న మహాగజం ఎక్కిసాగిపోతున్నది. నాగదత్తుడు, మరికొందరు పడుచువాండ్రు మారువేషాలతో ఎప్పటి సంగతులు అప్పటికి శాంతిశ్రీదేవికి తెలియజేస్తున్నారు. వీరాంగనా సైన్యము పదిదినాలలో పదియోజనాలు నడిచింది. సైన్యం నానాటికి పెరుగుచున్నది. ఎందుకు ఈ సైన్యం బయలు దేరిందో ఎవరికీ తెలియకుండా కుండిన నగరంలో మహాధాతువును పూజించి, వ్యాఘ్రనదీ సంఘారామం చేరి ఆ వెనుక వేణుసంఘారామం దర్శించి రావాలని వార్తలు మాత్రం ప్రబలజేసారు. సైన్యం సంఖ్య పదివేలకు మించి పోయింది. రెండుమూడు దినాలలో కుండినపురం చెంత విడిది చేసినారు.

ఆంధ్ర వీరాంగనలు సౌందర్యవతులు, దిట్టరులు, సకలకళా కోవిదులు, కుండినపురాధినాథుడు - ఇక్ష్వాకుల ఆడపడుచు పూంగీయమహారాణి బుద్ధక్షేత్ర యాత్రా గమనయే స్త్రీ సైన్యంతో వస్తుందని విన్నప్పుడే ఆశ్చర్య మంది పరివారజనంతో ఆమెకు ఎదురేగి ఆహ్వానించినాడు. వారికి ఊరి చివర ఒక గోరుతం దూరంలో విశాలమయిన మామిడి తోపులలో స్థలం చూపించాడు. ఆ మామిడి తోపుల ప్రక్కనే ఎడతెగని నిర్మలజలంతో కూడిన ఏరు సంగీతం పాడుకుంటూ ప్రవహిస్తున్నది. కుండిన నగరం చుట్టూ వివిధ జాతుల తోటలు ఆ ప్రదేశం అంతా సస్యశ్యామలమై ధనధాన్య సమృద్ధమై ఆంధ్రదేశ పురీమణులలో ప్రసిద్ధి కెక్కినది. నగరానికి ఎగువగా ఒక పెద్ద చెరువు నిర్మించారు. నదిలోనుండి ఒక పాయ ఎప్పుడూ చెరువులోనికి ప్రవహిస్తూ ఉంటుంది.

(3)

కుండిననగరం రుక్మిణీదేవి పుట్టింటి వారిది. విదర్భదేశం యావత్తు ఇప్పుడు ఆంధ్రసామ్రాజ్యంలో భాగము... కుండిననగరంలో పూసలహారాలు, గాజులు అద్భుతంగా చేస్తారు. మట్టిపనిలో ఈ నగరాన్ని మించినది లేదు. అచ్చటి అరజానెడు, పావుజానెడు మట్టిబొమ్మలు వ్యాఘ్రసంఘారామ గుహాకుడ్య విరచితచిత్రాలతో సమంగా, ధాన్యకటక పూర్వశైల సంఘారామ శిల్పాలతో సమంగా, జగత్ప్రసిద్ది నందినవి. బుద్ధుడు, బోధిసత్వుడు, మాయాదేవి మొదలయిన విగ్రహాలెన్నో చేస్తూ ఉండేవారా నగరంలో.

స్పటిక శిలలు, గండ్రఇసుక కరగించి అందులో కొన్ని రసాయని కాలు కలపి గాజు తయారు చేసేవారు. ఆ గాజుతో కంకణాలు పాత్రలు, అద్దాలు, పూసలు మొదలయినవి రంగులు కలిపి పోతపోసి వానికి తళుకు ఇస్తారు. ఈ గాజు పరిశ్రమ విదర్భ దేశంలో ఇక్ష్వాకుల కాలంనాటికి రెండు వేల సంవత్సరాలనుంచి ఉన్నది ఈ దేశం కొండలలో ఇనుము, రాగి, సత్తు దొరుకుతుంది. గోదావరీ నదీప్రాంతంలో బ్రహ్మాండమయిన అడువులున్నాయి. ఆ అడవి కలపతో అతివేడి వచ్చే మంటలుచేసి గాజూ లోహజాతులూ కరిగిస్తూ ఉంటారు ఉక్కు పరిశ్రమకు కుండిన నగరం (ఇప్పటి కొండాపురం) గాజు పరిశ్రమకువలెనే ప్రసిద్ధికెక్కింది కత్తులు, ఖడ్గాలు, పరశువులు, భల్లములు, శతఘ్నులు, ఛురికలు, కవచాలు, శిరస్త్రాణములు నిర్మించేవారు.

అడివి బాపిరాజు రచనలు - 6

• 206 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)