పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/213

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పూంగీయ శాంతశ్రీ: తారానికా! మేమంతా జైత్రయాత్రకు బయలు దేరాము.

తారానిక, యశోద: (ఆశ్చర్యంతో) జైత్రయాత్రకే?

బాపిశ్రీ: అవునఱ్ఱా! మీరును కవచాదులు ధరించి, సిద్ధంకండి.

యశోద: మా కవచాదులు ఈలిన్యకటకంలో ఉన్నాయి.

ఇక్ష్వాకు శాంతిశ్రీ: మీ కవచాదులు, మీ ఇతర వస్తువులు కూడా పట్టించుకు వచ్చాను. వారిద్దరికీ మరీ అచ్చర్యం కలిగింది.

యశోద: మనము యుద్ధానికి వెళ్ళడం అంటే?

షష్టిశ్రీ: (యవ్వనం అంకురించబోతున్న బాలిక) యశోదా! మన మహిళలమే కత్తిగట్టి యుద్ధానికి వెడుతున్నాము. వెనుక అర్జునునివంటి వీరుణ్ణి ప్రమీల ఓడించింది. మనం ఒక అధర్మపరుణ్ణి, రాక్షసుణ్ణి ఓడించబోతున్నాము.

తారానిక: రాజకుమారిగారు ఈడున చిన్నలయినా సాత్రాజితివలె మాట్లాడారు.

యశోద: ఇక్ష్వాకులకోడలు కైకేయిలానే మాట్లాడారు.

ఇక్ష్వాకు శాంతిశ్రీ: మా శాంతిశ్రీవదిన కౌసల్య, మా బాపిశ్రీ సుమిత్ర కాబోలు. మా అన్నయ్య దశరథుడా?

షష్టిశ్రీ: మనం యుద్ధానికి సిద్దమై ఉన్నాము. మా పెత్తల్లి సేనా నాయకురాలు.

పూంగీయ శాంతశ్రీ: రండి అమ్మగారి దగ్గరకు పోదాము. ఆమెతో ఆలోచించాలి.

యశోద: మన అపసర్పబలం మనతో ఉండాలికదా....

బాపిశ్రీ: అంతమాత్రమే పురుషులు మనతో ఉండడానికి వీలు.

యశోద: అయితే మా అన్నయ్య మనతో రావాలి. ధనకప్రభువుల అనుమతి పొందవలసి ఉంటుంది.

షష్టిశ్రీ: మా అన్నయ్యగారి దగ్గరకువెళ్ళి వారి ఆశీర్వాదమంది మనలను దారిలో వచ్చి కలుసుకోమను.

హెచ్చుతగ్గుగా రెండువేలమంది అశ్వసాహిణులు, మూడువందల మంది గజసాహిణీలు, రెండువందలమంది రధిక రమణీబృందము, వేయి మందిగల వృషభశకట వాహినీదళం, నాల్గువేలమంది పదాతినులతో వీరనారీ సైన్యం బయలుదేరింది. సర్వసేనాపత్ని ఇక్ష్వాకు శాంతిమూలుని చెల్లెలు పూంగీయ మహారాణి వాసిష్టిపుత్రి శ్రీ శాంతిశ్రీదేవి.

ఈ సైన్యం దినానికి మూడుపర్యాయాలు విడుదులు చేయడమూ, గ్రామాలలో స్త్రీలకు బోధించడం, దిట్టరులైన స్త్రీలను తమ దళంలో నేర్చుకోవడము. పురుషులెంతమంది వచ్చి చేరుతామన్నా శాంతిశ్రీదేవి ఒప్పుకోలేదు. ఒక మహారథమెక్కి రఐసైన్యాధ్యక్షరాలై ముందుగా ఆమే వెళుతూ ఉంటే వెనకనే పదాతినీ దళమునకు బాపిశ్రీ నాయకయై వస్తున్నది. ఆ వెనుకనే ఎద్దు బండ్లదళము తారానిక ఆధిపత్యాన నడుస్తున్నది. సేనాధ్యక్షురాలికి కుడివైపున ఇక్ష్వాకు శాంతిశ్రీరాజకుమారి అశ్వసాహిణీదళం నడపుచు ప్రయాణిస్తున్నది. ఆమె వెనుక, యశోదనాగనిక రక్షకత్వాన ధనుర్వీరాంగ నాదళం నడచుచున్నది. పూంగీయ మహారాణి శాంతిశ్రీదేవి ఎడమవైపున ఆమె కొమరిత శాంతశ్రీ

అడివి బాపిరాజు రచనలు - 6
అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)
• 205 •