పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నువ్వు దిట్టమైన అపసర్పులను ఏర్పాటు చేశావు. నీకు ఎప్పటి వార్తలు అప్పటికి తెలుస్తాయి. మామయ్యగారు మాట్లాడక ఊరుకొన్నారని మా నాన్నగారు చెప్పినారు. వాడు నిన్ను పెళ్ళిచేసుకోక వదలడట.

ఇ. శాంతి: నాకు పెళ్ళే అవసరంలేదు వదినా! పైగా ఆనాడు నేను పులమావిమీదకు ఎందుకు వెళ్లానో నా కింతవరకూ ఏమీ అర్థంకాలేదు. నాయనగారికన్న నాకు ధర్మరక్షణ కర్తవ్యాన్ని గూర్చి ఎక్కువ తెలుసునా? నాకు హింస అంటే ఏమీ సరిపడదు. అందులో మనం స్త్రీలం. మనకు మించిన ఈ గొడవ లెందుకు?

పూం. శాంత: వదినా! నువ్వు చెప్పినవన్నీ నిజమే! కాదననుగాని మనం అందరమూ విజయపుర ప్రాంతాలకు విడిదిచేసి....

బాపిశ్రీ: పులమావిపైన యుద్దయాత్ర నడిపేనారివలె బీభత్సం కల్పిద్దాం పులమావి హృదయంలో!

పూం. శాంత: మన సైన్యంతో బయలుదేరామంటే చాలు.

ఇక్ష్వాకు శాంతిశ్రీకి తన మేనత్తల తనయల ఇద్దరి హృదయమూ నిముషంలో అర్థమైంది. వారికి యుద్ధం చేయాలని కుతూహలంగా ఉంది. పులమావి ఎలాగో నాశనం అయితేనేగాని తన జనకుడు శాంతిమూలమహారాజు సార్వభౌమ సింహాసనం అధివసించడానికి ఒప్పుకోరని వీరిద్దరూ నిశ్చయించుకొని పులమావిపై మహాజైత్రయాత్రకు తన్ను ప్రోత్సహిస్తున్నారని గ్రహించింది. ఆమె చిత్తవృత్తి వెలుగునీడలుగా పరిభ్రమిస్తున్నది. ఏమి బుద్ధిపుట్టిందో మేనత్తల కొమరితలు చెప్పింది ఆలోచించింది.

“శాంతిశ్రీవదినా, బాపిశ్రీవదినా, సరే మీదళాలను ఆయత్తం చేయండి. నేను నా దళాలతో వస్తున్నాను. పెద్దత్తయ్యగారు మనకు నాయకురాలయ్యేటట్లు ప్రార్థించుదాము. అందరము కలసి విజయపురం వెళ్ళి పులమావి విషయం అంతా తెలుసుకొని అతనిమీద జైత్రయాత్ర సాగిద్దాము.”

అప్పటినుంచి సిద్దమై తండ్రిగారిని విజయపురం చెళ్ళడానికి అనుమతి అడిగి, మేనత్తను ఒప్పించి వారందరితో బయలుదేరింది. యశోదా తారానికలతో అంగరక్షణిదళాని వెంటబెట్టుకొని పోవాలని సాలగ్రామం చేరింది.

(2)

శాంతిశ్రీ రాకుమారి తన మేనత్త కూతళ్ళతో వచ్చిందని వినగానే యశోదనాగనికా, తారానికి గంతులువేసి కంగారుపడి పరుగెత్తినారు. ఆ వెళ్లడం శాంతిశ్రీ శిబిరంలోకిపోయి ఆమె పాదాలకెరిగినారు. శాంతిశ్రీ ఇద్దరిని ఒకేసారిగా నిలిఢంగా హృదయాని కదుముకొంది. ఆ ఇద్దరిని వెంట తీసుకొని ఆ బాల ఒక పెద్దశిబిరంలో ఆసనాన అధివసించియున్న పూంగీయ శాంతశ్రీ, బాపిశ్రీ, షష్టిశ్రీల కడకు పోయింది. తారానికా యశోదా ఆ మువ్వురు రాజకుమారికలను బాగా ఎరుగుదురు వీరిదనీఖీరూ వారు మువ్వురకు రండప్రణామాలు చేశారు. వాళ్ళు మువ్వురూ ఈ బాలికలను దరికి చేరదీసి తమకడనే కూర్చోబెట్టుకొన్నారు.

అడివి బాపిరాజు రచనలు - 6

• 204 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)