పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

శాంతిమూల మహారాజు సింహాసనం అధిష్టించగా సభ్యులంతా కూర్చున్నారు. మహారాజు: బ్రహ్మదత్తప్రభూ! చక్రవర్తి ధాన్యకటకానికి ససైన్యంగా రమ్మని, శాత్రవులు శాతవాహనులపై దండెత్తుతున్నారని వేరు వచ్చిందికదా! మీరు సన్నాహంలో ఉన్నారు కదా?

బ్రహ్మ: చిత్తం మహాప్రభూ! పూంగి రాష్ట్ర ప్రభువులనూ వేంగి వారిని ససైన్యంగా వచ్చి కలుసుకోమని వార్త పంపించగలవాడను. ఈలోగా మన సైన్యం అంతా సిద్ధం చేయగలను.

మహారాజు: బ్రహ్మదత్తప్రభూ! మీకు బ్రహ్మదత్త బిరుదము, తమ తండ్రిగారికి దేవదత్త బిరుదము ఊరికే రాలేదు. మీ ఆలోచన మాకు అవశ్యం ఆచరణీయము. శ్రీయజ్ఞశ్రీ చక్రవర్తి వృద్ధులైనారు. సామ్రాజ్యంలో ఎక్కడి ప్రభువులక్కడ స్వాతంత్ర్యం వహించాలని కాబోలు మహారాజ బిరుదాలు వహిస్తున్నారు. ఈనాడు ఈ హీనమతులవల్ల మన భారం అధికమవుతున్నది.

బ్రహ్మ: మహాప్రభూ! తాము నాయందున్న ప్రేమచే అలా సెలవిస్తున్నారు. నేను తమకు ఆలోచన చెప్పగలవాణ్ణికాను. ఈనాడు తాము కదా శాతవాహన సామ్రాజ్యం నిలబెట్టుతున్నది! ఒకనాడు ఇక్ష్వాకు వంశం సకలజగత్తును ఏలింది. హిమాచలంనుంచి గౌతమి వరకూ కోసలదేశం రెక్కలు చాచి ఉండేది. మహాప్రభూ! మొదటినుండీ తమ వంశీయులు ధర్మాన్ని రక్షిస్తూనే ఉన్నారు.

మహారాజు: ప్రభూ! ఆ ఇక్ష్వాకుల ప్రతిష్ట ఇప్పుడు మాకు ఆవేదన కారణమయింది.

బ్రహ్మదత్తు: మహాప్రభూ! ఇప్పుడు సర్వదేశాలలోని పరిస్థితి ఆవేదన కారణమవుతున్నది. ధర్మరక్షణకొరకు యుద్దాలు తప్పవు. బుద్ధదేవుడు లోకంలో యుద్ధాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కాని మానవ ప్రకృతిని ఎవరు మారుస్తారు? మానవుడు కూడా ఒక్కొక్కప్పుడు ద్విపాద పశువు అయిపోతాడు.

సభ పూర్తి అయ్యేవరకూ మహారాజు శాంతమూలుడూ, దండనాయకుడూ, సేనాపతీ అయిన బ్రహ్మదత్తుడూ ఏవేవో మాట్లాడుతునే ఉన్నారు. సభలోని వారు కదలరాదు. మాట్లాడరాదు. అయితే ఎందుకు మహాప్రభువు ఒడ్లోలగమున్నారో తెలియలేదు. సభ్యులందరు మహారాజు ఆజ్ఞలకు, ఆలోచనకు ఎదురు చూస్తూ ఉండిరి.

మహారాజు కొన్ని విఘడియలు బ్రహ్మదత్తులతో మాట్లాడుచుండిరి. ఆ వెనుక బ్రహ్మదత్తప్రభువు సభ్యుల కనుగొని “మహారాజులవారు ససైన్యంగా ధాన్యకటకపురం వెడుతున్నారు. శ్రీ సార్వభౌములు యజ్ఞశ్రీ మహారాజు కోరడంచే అలా వెళ్ళవలసి వచ్చింది. మహారాజులవారితో నేను సేనాపతిగా వెడుతున్నాను. ఈలోగా రాజప్రతినిధిగా యువరాజులవారుంటారు. వూంగీయ రాష్ట్రపతి స్కంధప్రభువు యువరాజులవారికి బాసటగా విజయపురంలో రాజ్యం చూస్తూ ఉంటారు” అని తెలిపినాడు. అడివి బాపిరాజు రచనలు - 6' • 12 •'అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)