పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మొదటిది ఏ కొంచెమో తెలుసు.”

“తాను వలచిన యువతిని ప్రేమించటంకూడా జ్ఞానమేనా?”

“వలపు మొదలైన చిత్తవికారాలన్నీ జ్ఞానసాధనలే.”

“అయితే మాళవికకూడా నాకు గురువే.”

“ఒక్కమాళవికాదేవియేకాదు. సమస్తలోకము గురువే అవుతుంది తెలియనేరిస్తే.”

“ఆ నేర్పు ఎటువంటిదో ?”

“మనం ఏ పనిజేస్తున్నా, దాని స్వరూపాన్ని, అది యిచ్చే ఫలితాన్ని విచారిస్తూ చేయాలి.”

“మాళవిక వల్ల మాకు సుఖం కలుగుతున్నది.”

“చిత్తం. ఆ సుఖస్వరూపాన్ని ఇంకా తరచాలి మహాప్రభూ.”

(10)

ఆవల శాంతమూలుడు అగ్నిష్టోమం ప్రారంభించాడు. ఈ యాగము వసంతకాలంలో ప్రారంభమయింది. వసంతకాలంలో అయిదుదినాల జరిగే యాగమిది. దేశదేశాలనుండి ఋత్విజులు వచ్చినారు. దేశదేశాలనుండీ బ్రాహ్మణ్యము వచ్చిపడింది. విజయపురానికి రెండుయోజనాల దిగువనున్న సత్రశాల అను పవిత్రయాగస్థలంలో శాంతమూలుడీ కత్రువును ఆరంభించాడు. ఆ యాగశాల ప్రదేశమంతా మహాపట్టణమైపోయింది. చతుశ్శాలలు, శాలలు, వందల కొలది వీధులు, వేలకొలది ఇళ్ళు, పందిళ్లు, పాకలు నిర్మించాడు. వైద్యశాలలు 'మంచినీళ్ళశాలలు' భోజనశాలలు నిర్మాణమైనవి. అనేక విధములైన అంగళ్ళు వచ్చినవి. ఎక్కడ చూచినా జనమే. రధ్యలను పల్లవభోగ పలకరాతితో నిర్మాణం చేసినారు. దేశదేశాలనుండి కూరగాయలు, పప్పుదినుసులు, పాలు, పెరుగులు, నేతులు దినదినమూ దిగుమతి అయిపోతున్నాయి. యాగమైన తరువాత శాంతిమూల మహారాజు బ్రాహ్మణులకు భూరిసంభావనలు ఇచ్చినాడు. మహా పండితులకు, ఋత్విజులకు, ఋషులకు లక్షలకొలది సువర్ణరాసులుపోసి తన మేనల్లుడగు చక్రవర్తిచే దానాలు ఇప్పించినాడు.

ఆరవదినమందు చక్రవర్తి దానాలు రాత్రిపడిన మూడుఘటికలవరకు ఇచ్చి నిర్ణీత కాలానికి ఆపి, తన విడిదికి వెళ్ళడానికి బయలుదేరినాడు. రథమువెంట మెరికలవంటి అంగరక్షకులున్నారు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చారో ఆ మహారాజరథపథము వెంట అయిదారువందలమంది బ్రాహ్మణులు తమ శాలువలు క్రిందకు జారవిడిచి సంపూర్ణ కవచధారులై ప్రత్యక్షమైనారు. కత్తులదూసి చక్రవర్తి రథంమీదకురికినారు. అంగరక్షకులు అప్రమత్తులయ్యే ఉన్నారు. వాళ్ళు విరోధుల మొదటి ఉరుకునకు వెనుకకేగినా మరునిమీషంలో ఫలకాలతో ఆపుకుంటూ కత్తులు దూసి తలపడినారు. ఆ చుట్టుప్రక్కల శాలలలోనుంచి ఇంకా అయిదారువందలమంది ఈ సంకుల సమరంలోకి “జయ పులమావి చక్రవర్తీ జయీభవ” అంటూ దుముకినారు. అంతా అల్లకల్లోలమైపోయింది. మహారాజ రథసారథిగానున్న నాగదత్తుడు రథం ఆపి తన స్నేహితులైన అంగరక్షకులకు గురుతుగా శంఖం మూడుసారులు ఊది హెచ్చరికచేసి ఎడమచేత ఫలకము పుచ్చుకొని,

అడివి బాపిరాజు రచనలు - 6

183

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)