పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సువర్ణగిరి సంఘారామంలో ప్రియదర్శి అశోకచక్రవర్తి లిఖించిన దివ్య శిలాశాసనంలోని పవిత్రదేశాలు పునరుద్ధరించడమే తన ఆశయమనీ వారికి మనవి చేసుకుంటూ వారి సంపూర్ణ సహాయం అర్థించాడు.

చంద్రశ్రీశాతవాహన సార్వభౌముడు బ్రహ్మదత్తునిచెంతచదువునేర్చుకుంటున్నాడు. ఆంధ్రప్రాకృతం చదువనూ వ్రాయనూ నేర్చెను. చిన్న చిన్న గ్రంథాలు చదువుతున్నాడు. మాళవిక ఆయనతోబాటు బ్రహ్మదత్తుని శిష్యురాలై చదువు ప్రారంభించింది. ఆ సమయంలో శాంతిమూల మహారాజు విజయపురంలో అగ్నిష్టోమం సంకల్పించారు. ఇక్ష్వాకులు హారితసగోత్రజు లైన ఉత్తమ బ్రాహ్మణక్షత్రియులు. ఆ దినాల్లో ఆంధ్రవేశం అంతా బ్రాహ్మణులూ, శూద్రులూ - రెండే జాతులు. శూద్రులలో ఉప్పరులు, చాకళ్ళు మొదలైన వారుండేవారు. ఆనాడు ఆంధ్రదేశంలో క్షత్రియులులేరు. బ్రాహ్మణులలో రాజ్యాలు పాలించేవారు బ్రాహ్మణ క్షత్రియులు (వీరు తరువాత వచ్చిన నియోగులకు పూర్వీకులయ్యారు - కొందరుసచ్ఛూద్ర క్షత్రియులయ్యారు. సచ్ఛూద్ర క్షత్రియులు అయిపోవడానికి కారణం బౌద్దమతానికి తర్వాత వచ్చిన జైనమతమే.)

శాంతమూలుడు విజయపురంలో అగ్నిష్టోమం చేయగానే, ధాన్యకటకంలో చక్రవర్తి చేత అఖండోత్సవం ఒకటి చేయించ సంకల్పించాడు. శాంతిమూలమహారాజు నిత్యాగ్ని హోత్రి. అగ్నిష్ఠోమానికి అన్ని ప్రయత్నాలు జరుపుటకు బ్రహ్మదత్తప్రభువు తన పరివారంతో విజయపురం వెళ్ళినాడు. బ్రహ్మదత్తుడు వెళ్ళిన నాలుగురోజులకు శాంతిమూల మహారాజు భార్యలతో పరివారజనంతో బయలుదేరి చంద్రశ్రీ సార్వభౌముని బయలుదేర దీసినాడు. చక్రవర్తి అఖండసైన్యంతో దాసీజనంతో, మహారాణులతో విజయపురం వేంచేసినాడు. ఆయన అధివసించవలసిన మదగజంపైన చంద్రశ్రీ ప్రయాణం చేయలేదు. అదివరకే శాంతమూలుడు ఏనుగుపైన ఒక అంగరక్షక ప్రభువు వేషంతో ప్రయాణం చేసినారు. చక్రవర్తి గజరాజుపై ప్రయాణం చేసింది ఒక బాలవీరుడు, అతని ప్రియురాలు.. ఆ బాలవీరునికి చంద్రశ్రీ పోలిక ఉన్నది. అతనితో ఉన్న యువతి మేలిముసుగులో ఉన్నది. మూడుదినాలు ప్రయాణాలు సలిపి చక్రవర్తి సైన్యమూ, పరివారమూ విజయపురం చేరినారు.

చక్రవర్తి విడిది చేసింది శాంతిమూల మహారాజు అభ్యంతర ప్రాసాదములో. చక్రవర్తి బ్రహ్మదత్తుని శిష్యుడై నప్పటినుంచీ కొంచెం తెలివిని సముపార్జించడం ప్రారంభించాడు. జీవితం అంటే భయం, కొంచెం భక్తి ప్రారంభమైనవి. రాజ్యవ్యవహారాలు తెలిసికొనడం రాజు, మంత్రి, ధర్మము, ప్రజలు, ముఖ్య నగరము, దుర్గము, సమితులు, సైన్యమూ, సంధి, విగ్రహము, మిత్రలాభం, రాయబారము, ధర్మవిచారణ, యాత్ర, రాజపథములు నదులు, కాల్వలు, చెరువులు, సముద్రము, వర్తకము, వైద్యము, ఖనిజములు, ఏనుగులు, రథములు, అశ్వములు, పశువులు, రహస్యచారులు మొదలగు ఎన్నియో విషయాలు బ్రహ్మదత్తుడు చంద్రశ్రీ చక్రవర్తికి ఉపదేశింప ప్రారంభించినాడు. చక్రవర్తికి ఒక అంగరక్షకుని వేషం వేసి నాగదత్తుని జత చేసి, తాను అప్రమత్తుడై బ్రహ్మదత్తప్రభువు విజయపురం అంతా తిప్పుతూ రాజ్యనిర్వహణ విధానం నేర్పసాగినాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

179

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)