పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినియోగిస్తే ఈ పులమావి మహారాజ్యం విస్తరించి తన పేరు శాశ్వతంగా నిలుపుకొని ఉండును. అతడు చక్రవర్తిపదవి ఆశించడం తప్పుకాదు. కాని ఆ పదవికి పోయేమార్గం రాక్షసత్వంతో నిర్మించుకోజూచాడు.

పులమావి ఆలోచనలు గాటమైపోయాయి. వానిలో సుడిగుండాలు ఉద్భవించాయి. ప్రళయ ఝంఝలు వీచసాగాయి. గురుదత్తపురంనుండి మారువేషాలు వేసుకొని అందరూ మాయమయ్యారు. వీరు మారువేషాలు వేసుకుని మాయమైనారని అపసర్పనాయకుడు శ్రీ రాహులునకు తెలియును. అయినా మహారాజు శాంతిమూలుని ఆజ్ఞచొప్పున ఏమీ ఎరుగని వానిలా ఊరుకొన్నాడు.

పులమావి మాయమైపోయాడు. కొన్నినాళ్ళకు పులమావి తన రాజధాని నగరం ముసికలో ప్రత్యక్షమై సింహాసనం అధివసించాడు. నెలదినాలు తన ధనాగారం నింపుకొన్నాడు. సైనికులను ప్రోగుచేసుకొన్నాడు. నెలదినాలు ముసికలో వైభవోపేతమైన ఉత్సవాలు జరిగాయి.

పులమావి మాత్రం కనుబొమలు ముడిచి తన పరాభవ దావానలాన్ని ప్రతీకార వాంఛచే ప్రజ్వలింపజేస్తున్నాడు. తన దురవస్థకు శాంతిశ్రీ మూలకారణం. అంత ప్రేమించి, ఆమెను సామ్రాజ్ఞిచేయ ప్రతిజ్ఞపూని, మహాపురుషుడైన తాను ఆమెకోసం జైత్రయాత్రను కూడా ప్రారంభించాడు. అలాంటి సందర్భంలో ఆ వగలమారి, సైంధవునివలె తన అదృష్టానికి అడ్డుపడి, పులమావి అభీష్టాన్ని భగ్నముచేసింది. అతని హృదయంలో ఒక్కటే ఆలోచన. ధాన్యకటకం నాశనం చేయడం, ఇక్ష్వాకువంశాన్ని నిర్మూలనంచేయడం, ఇక్ష్వాకు శాంతిశ్రీని పట్టికొనిరావడం. అతని మోములో నవ్వులే - అతని హృదయంలో శాంతిలేదు. అతని పళ్ళు ఎప్పుడూ బిగుసుకొనే ఉన్నాయి. అతని ముక్కుపుటాలు ఎప్పుడూ విస్తరించే ఉన్నాయి. అతని కళ్ళలో కెంపులు తళతళమంటున్నాయి.


“ధర్మంరీత్యా పులమావే చక్రవర్తి!” “మధుపాన మత్తతలో ఒడలు తెలియక పొర్లే మనుష్యుడు చక్రవర్తి కాజాలడు!” “ఇక్ష్వాకులు చక్రవర్తి వంశీకులు కారు. వారు తెరమీద బొమ్మలునడిపే ఆటగాళ్ళు. దీనిని ఏ సామంతుడు అంగీకరించలేడు.” “స్త్రీలోలురైన రాజులను బలవంతులైనవారు వధించి ధర్మరాజ్యం స్థాపించి తీరాలి”-ఈ విధంగా స్నేహముఖాలు ప్రతిసామంతునకూ పులమావి పంపించినాడు.

ఎక్కడోఉన్న ధాన్యకటకప్రభువు సకల దక్షిణాపథానికి సార్వభౌముడుకావడం మహారాజ్యాలైన వైజయంతికి, సౌరాష్ట్రానికీ, మాళవానికీ, శాతవాహనరట్టుకు, ములకదేశానికి, కళింగాలు రెండింటికీ, పూంగీయ రాజ్యాలకు, వేంగీరాజ్యానకూ, క్రముక రాష్ట్రానికి తలవంపులు అని పులమావి పంపిన దిట్టరులైన పండితులు రాయబారులుగా దేశదేశాలకు పోయి బోధిస్తూ ఉండిరి.

పులమావి నాశిక, సహ్యమలయ, వ్యాఘ్రనది, ప్రతిష్టాన, వైజయంతి, నాగపర్వతాది సంఘారామాలవారికి ఉత్తరాది సంఘారామాలవారికీ రహస్యంగా రాయబారాలను పంపి శ్రీ విజయసార్వభౌముడు, శ్రీ చంద్రశ్రీ సార్వభౌముడూ, శాంతమూలుడూ బౌద్దధర్మనాశన కారకులనిన్నీ బౌద్ధధర్మ ప్రతిష్టాపన తిరిగి చెయ్యడమే తన సంపూర్ణోద్దేశమనీ, తన నగరంలో

అడివి బాపిరాజు రచనలు - 6

178

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)