పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“బ్రహ్మదత్తప్రభువు ఏమిటో చెబుతాడు. అణువంటే ఎవరి క్కావాలి. కణమంటే ఎవరిక్కావాలి? ఏమంటావు అందాలదానా?”

“నిజమే మనోహరా! అయితే బ్రహ్మదత్తప్రభువు చాలా తెలివయినవాడా?”

“బాగా చదువుకున్న వారంటారు. ఏం లాభం? ప్రేమ అంటే ఏమిటో తెలియని వాడూ; మధుపానం రుచి ఎరుగనివాడూ, చదువుకున్నా చదువుకోనివాడే!”

“బాగా చెప్పినారు సుందరాకారులైన మీరు,”

“నేను నిజంగా సుందరుణ్ణేనా రతీదేవీ?”

“మీరు నా మన్మథులు.”

“ఏదీ ఒక......”

“ఒకటికాదు పది.”

“నేను మన్మథుణ్ణంత అందంగా ఉంటానా?”

“కాదన్నవారి మొగం మీద పసుపునీళ్ళు చల్లనా? అయితే ప్రాణేశ్వరా! బ్రహ్మదత్తుడు అందమైనవాడంటారు.”

“ఎవరంటారు?”

“అంతఃపురంలోని స్త్రీలంతానూ.”

“ఏమిటీ! ఆ దుర్మార్గుడు నా అంతఃపురానికి వచ్చాడా? త్వరగా చెప్పు.”

“అదేమిటి దివ్యసుందరాకారులైన చక్రవర్తీ! అంతఃపుర స్త్రీలంటే దాసీజనం. వాళ్ళుతప్ప బ్రహ్మదత్తుణ్ణి చూచే వాళ్ళెవరుంటారు?”

“అయితే దాసీలకుమాత్రం బ్రహ్మదత్తుని మాట రావలసిన అవసరం ఏమి వచ్చిందీ?”

“ఏదో మాటమీద మాట వచ్చి శాంతిమూల మహారాజు కొమార్తె శాంతిశ్రీ దేవిని గురించి సంభాషణ వచ్చింది. ఆ బాలికకూ బ్రహ్మదత్త ప్రభువేకదా గురువులు?”

“ఏమిటీ! మాకు తెలియదే! శాంతిశ్రీ సౌందర్యం ఈ లోకాల్లో ఇంకోచోట లేదట!”

“అవునులెండి ప్రభూ! ప్రపంచంలో అందరూ మీకు సౌందర్యవతులే.”

“అంటే నా ఉద్దేశం ఎంత శాంతిశ్రీ అయినా నీముందు తీసికట్టు అనే.”

“ఈ బ్రహ్మదత్త ప్రభువు శాంతిశ్రీని, శాంతిశ్రీ ఈ ప్రభువును ఒకరినొకరు ప్రేమించుకొంటున్నారట!”

“ఏమిటీ? చక్రవర్తి గర్జించినంత పని చేశాడు. ఆ మాళవిక చటుక్కున ముతి ఆడిస్తూ ఘల్ ఘల్ మని చక్రవర్తి ఒడిలోనుంచి లేచింది.

మాళవిక ఉజ్జయినీపురంలో ఉన్న ఒక క్షుద్ర క్షత్రియ స్త్రీ కొమరిత. ఆ బాలిక అందం ఆనాడు ఆర్యావర్తంలో ఎక్కడా లేదని ప్రతీతి. ఆమెను వరిస్తూ వేలకు వేలు మహారాజులు, సామంతులు, సేనాపతులు మొదలగు వారు వచ్చారు. చంద్రశ్రీ చక్రవర్తిని కాగానే ధాన్యకటక నివాసియైన ఒక వర్తకుడు చక్రవర్తి మెప్పించి వేంగీనగరంలో ఉన్న ఒక స్వర్ణగిరిని స్వర్ణం తవ్వడానికి గుత్తకు పుచ్చుకొనడానికి నిశ్చయించుకొన్నాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

169

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)