పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మొక్క చచ్చిపోయిన వెనుక అమృతం పోసినా తిరిగి బ్రతుకుతుందా మహాప్రభూ!” అన్నాడు బ్రహ్మదత్తుడు. “మీ దగ్గర అమృత సంజీవినీ విద్య ఉన్నది నాకు తెలుసును” అన్నాడు శాంతిమూలుడు గంభీరంగా.

4

ఆనాటినుంచి బ్రహ్మదత్తప్రభువు చక్రవర్తికి గురువయ్యెను.

“మహాప్రభూ! ఈ విశ్వం అంతా పాలసముద్రం నిండి ఉంది.”

“పాలసముద్రం ఏమిటయ్యా! మన చుట్టుపక్కల ఎక్కడ పాలు లేందే!”

“పాలసముద్రం అంటే పాలు కాదండి.”

“పాలంటే నీరా లేకపోతే నూనా?”

“పాలసముద్రం అంటే వెలుగుసముద్రం అన్నమాట మహాప్రభూ!”

“పాలంటే వెలుగా! వెలుగంటే ఏమిటి? మరి రాత్రిళ్ళు వెలుగు లేదే?”

“తక్కువ వెలుగూ, ఎక్కువ వెలుగూ ఉంటవి. చీకటి అంటే తక్కువ వెలుగు. ఎక్కువ వెలుగు లేకపోవడం; చీకటి కణాలు ఒక్కటే. తక్కువశక్తిగలవి చీకటి కణాలు అవుతాయి.”

“కణాలేమిటి? భోజనకణాలు అన్నమాట ఎరుగుదుము. అగ్నికణాలు ఎరుగుదుము. వెలుగుకణాలు ఏమిటయ్యా వెఱ్ఱివాడా?”

“చిత్తము. సృష్టిలో మన చూపు కెదురుగా ఉన్న వస్తువులన్నీ పాంచభౌతికాలు! అవి మనం చూపుతో, స్పర్శతో, రుచితో, వాసనతో, వినికిడితో తెలుసుకోకలిగినవి. అవి నిజంగా మన ఎదుట ఉండనక్కర లేదు.”

“మన ఎదుట కాకపోతే మనవెనకాల ఉండవచ్చునన్నమాట! అదాభౌతికం ? అయితే మొన్న మేము లాక్కొచ్చిన అమ్మాయి భౌతికమే! ఊఁ. తర్వాత....”

“మహాప్రభూ! ఈ భౌతిక వస్తువుల్ని విభజించగా ఇంక భాగించ లేనంత భాగం వస్తే దాన్ని అణువంటారు.”

“ఎవరంటారు?”

“మనుష్యులు.”

“ఎవరు భాగిస్తారు?”

“మనుష్యులే!”

“అలా భాగించపోతే?”

“నిజంగా భాగించనక్కరలేదు. భాగించారనుకోవాలి ప్రభూ!”

“ఊరికే అనుకొంటే భాగాలయిపోతాయా ధనకరాజా?”

“అలా చేస్తే వాటిని అణువులంటాము.”

ఈలా సాగింది చక్రవర్తిగారి చదువు. ఆ రాత్రి చంద్రశ్రీ శాతవాహన సార్వభౌముడు, తనప్రియురాలగు మాళవసుందరిని ఒళ్ళోకూర్చో పెట్టుకొని, ముద్దులిస్తూ తన విద్యా కృషినిగూర్చి మాటలు సాగించినారు.

అడివి బాపిరాజు రచనలు - 6

168

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)