పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“శాంతీ! ఇదేమిటమ్మా ! ఎక్కడికీప్రయాణం” అని కేకలు వేస్తూ వీరపురుషదత్తుడు బయటకు పరుగిడి వచ్చినాడు. శాంతిశ్రీ అన్నగారి మాటలు వినిపించుకొనలేదు. తన రక్షకభటురాండ్రుకు యువతీదళాలు ఒక నిమేషంలో సిద్ధం కావాలని ఆజ్ఞ ఇచ్చింది. యువతీ సైన్యాధికారిణియైన ప్రౌఢయోర్తు అచ్చటికి అచ్చటికి అశ్వారూఢయై వచ్చింది. శాంతిశ్రీ ఆజ్ఞ వినగానే ఆమె వీపున వ్రేలాడు శంఖం ఎడమచేత ధరించి “భోం భోం, భోంభో” ఊదింది. ఊదిన మరుసటిక్షణంలో వేయిమంది యువతులు అశ్వాలు అధిరోహించి సాయుధులై విచ్చేసిరి. శాంతిశ్రీ అన్నగారి వంక చూడలేదు. ఆమె ఆ సమయంలో దుర్నిరీక్ష ప్రతాపమూర్తియై విరాజిల్లినది. వీరపురుషదత్తుడే ఆమెను తేరిపార చూడలేకపోయినాడు. శాంతిశ్రీ తన సైన్యానికి ముందుకు సాగండి అన్నట్లుగా చేయి ఊపి, వేగంతో సాగిపోయింది. ఆమె వెనుకనే సాగిపోతోంది ఆమె సైన్యం.

వీరపురుషదత్తుడు ఏమీ అర్థము కాక తానూ తన సైన్యాలను సిద్ధము చేసి రెండుఘటికలు జరిగిపోయేసరికి సైన్యాన్ని కూర్చుకొని ముందుకురికినాడు. అతని సైన్యం ముందుకు సాగగానే సేనాధిపతి కొంపలు మునిగి పోవునను భయంతో తన యావత్తు సైన్యాన్ని సిద్ధంకండని ఆజ్ఞ ఇచ్చెను. శాంతిశ్రీ భయంకరమూర్తియై సింహవాహన అయిన ఆదిశక్తివలె ముందుకు మహావేగంతో పురోగమనంచేస్తూ హిమాలయపర్వతంనుంచి విరుచుకుపడిన గంగానదిలా విజృంభించింది. ఆమెను ఎవ్వరూ తేరిపార చూడలేరు. పులమావి ఆయుధోపేతలైన స్త్రీలు తమ మీదకు వస్తూ ఉండడం చూచి ఆశ్చర్యము చెందెను. ఆ వనితా సైన్యానికి శిరస్పై వస్తున్న బాలికను చూచినాడు. విస్తుపోయి నిలిచినాడు.

(10)

శాంతిశ్రీ పులమావిని గాంచి చిరునవ్వు నవ్వుకుంది. “ఓహో! మీరా నూత్నచక్రవర్తులు, రాయబారులను బందీచేసే ధర్మమూర్తులు!” అని నవ్వింది శాంతిశ్రీ. పులమావి కళ్ళు కోపంతో ఎఱ్ఱబారాయి. “ఎవరురా అక్కడ? ఈ తుచ్చురాలిని బందీచేసి మా దాసీజనంలో చేర్చు. ఈ పిచ్చి దానితో వచ్చిన ఈ దండును బంధించి సేనాపతులు పంచుకోవలసిందని మా ఆజ్ఞలందించు” అని దండతాడితభుజంగంలా రోజినాడు. “ప్రచండికా! ఈ దుడుకు మనుష్యుని బంధించు!” అని ఆమె ఆజ్ఞ ఇచ్చింది. ప్రచండిక ముందుకుపోయి, పులమావిని చేయిపట్టుకుని బరబర శాంతిశ్రీ రాకుమారికడకు లాగికొనివచ్చి ఒక్కవిదిలింపున క్రిందకు పడద్రోచినది. అక్కడఉన్న సేనాపతులు 'ఆఁ ఆఁ!' అంటూ తమ ప్రభువును రక్షించడానికి ముందుకురికారు. శాంతిశ్రీ చుట్టుఉన్న నాగనికా తారానికాది అంగరక్షక బాలలు కత్తులుతీసి మహావేగంతో సేనాపతులను తలపడినారు.

ఒక్కసారిగా శాంతిశ్రీ యువతీసైనికులు పులమావి శిబిరాలను చుట్టు ముట్టినారు. పది నిమేషాలలో పులమావి అతని అంగరక్షకులు సేనాపతులు పరివారజనము ఆ వీరాంగనులకు పట్టుబడిపోయినారు. శాంతిశ్రీ బంధితులను అంగరక్షక బాలలకు అప్పగించి తాను పులమావి సభాశిబిరంలో ప్రవేశించి అక్కడ 'సింహాసనము పై

అడివి బాపిరాజు రచనలు - 6

155

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)