పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంటనే రాకుమారి తిరిగి తన శిబిరానికి వెళ్ళిపోయింది. ఆమెకు ఎందుకో నిరాశా విసుగు కలిగినవి. ఎన్నడూ ఆమె విసుగుచెంది యెఱుగదు. ఆశలే లేని ఆ రాకుమారికి నిరాశపొంద కారణమేమి ఉండగలదు? ఆమె కవచం విప్పి తన యోగాసనాన కూరుచుండి మనస్సును ఏకముఖం చేయాలని ప్రయత్నించింది. ఆలోచనలు ఒకదానివెంట ఒకటి తరుముకు వచ్చాయి. ఆమె ఎన్ని ఘటికలు అలా నిశ్చలత్వానికై ఎదురు చూస్తూ కూరుచుందో! సేనా నాయిక శిబిరమూహూర్త ఘంటికలు మ్రోగుతున్నాయి.

బ్రహ్మదత్తుడు పాఠాలు చెబుతూ కనబడతాడు. ఒక వసంతోత్సవంలో తానే ఏదో భయపడి పారిపోతున్నట్లు కనబడుతుంది. సముద్రం కల్లోలావృతమై ప్రత్యక్షమాతుంది. అందులో ఒక చిన్న ఓడ మునిగి పోయేటంత స్థితిలో దూరంగా తోస్తుంది. బ్రహ్మదత్తుడు నవ్వుతూ దర్శనం ఇస్తాడు. ఏదో మాట్లాడ బోతాడు. బ్రహ్మదత్తుడు యుద్ధానికి వెడుతూ మూర్తించాడు. ఆ దృశ్యం మాయమైపోతుంది. యుద్ధంలో రక్తసిక్తాంగుడై పడిపోయి ఉంటాడు.

“ఓ” అంటూ శాంతిశ్రీ లేచింది. ఒక అంగరక్షకురాలు పరుగెత్తు కొనివచ్చి “రాజకుమారీ! ధనకమహారాజలవారిని బంధించినామని పులమావి వద్ద నుంచి వార్త వచ్చింది” అని రోజుతూ చెప్పింది.

“ఏమిటీ? ధనక ప్రభువును బంధించడమే?” ఆమెకు ఏమీ అర్థం కాదు. మేము వివర్ణమైనది.

ఇంతలో వీరపురుషదత్త యువరాజు వేగంగా చెల్లెలి శిబిరంలోనికి వచ్చి “చెల్లీ! బ్రహ్మదత్తప్రభువు రాయబారానికై వెళ్ళితే పులమావి వారిని పట్టుకొని బంధించాడట. ఆ విషయం కమ్మఁవాసి స్వహస్తాంకితమైన ముద్ర పంపించినాడు” అనుచు ససంభ్రమంగా మాట్లాడినాడు. పదిలిప్తలు జరిగినవి. శాంతిశ్రీ తిరిగి గంభీరత తాల్చింది.

“అన్నయ్యగారూ! రాయబారిని ఎట్లా పట్టుకోగలరు?"

“రాయబారి వస్తున్నాడని వార్త పంపి మరీవెళ్ళినాడట బ్రహ్మదత్త ప్రభువు!”

“రాయబారిని ఎల్లా పట్టుకొన్నారు అన్నయ్యగారూ?” శాంతిశ్రీ ఏదో ఆశ్చర్యమూ, ఏమీ అర్థంకాని వైకల్యమూ మోమును ఆవరిస్తూ ఉండగా అడిగింది.

“రాయబారిని ఏ రాజూ రాజనీతి ప్రకారము బంధింపకూడదు. అలా బంధించినవాడు రాజుకాడు. వాడు నీతి బాహ్యుడు” అని వీరపురుషదత్తుడు తన గుప్పిలి ముడిచి పులమావి శిబిరంపై ఆడిస్తూ అన్నాడు.

శాంతిశ్రీ చటుక్కునలేచింది. ఆమె అన్నగారికి నమస్కరించింది. ఆమె మోమున చూడనలవికాని భయంకరరేఖలు తోచినవి. ఆమె అచ్చట ఉన్న ఖడ్గపు వరలోనుండి ఖడ్గము తీసినది. కవచము ధరించలేదు. శిబిర ద్వారము కడకుపోయి “గుఱ్ఱము” అని కేక వేసింది. అచ్చట కావలికాయు రక్షకదళ బాలికలలో ఒకరై పరుగునపోయి సూతుని శాంతిశ్రీ ఎక్కే అత్యుత్తమాజానేయాన్ని కొనివచ్చేటట్టు చేసింది. ఆమె గుఱ్ఱంమీదకు ఉరికింది.

అడివి బాపిరాజు రచనలు - 6

154

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)